Dhruv Jurel: ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్‌ సెంచరీ అంకితం: ధ్రువ్‌ జురెల్

ప్లేఆఫ్స్‌కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్‌ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్‌నవూపై విజయభేరి మోగించింది.

Updated : 28 Apr 2024 11:42 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ దూసుకుపోతోంది. ఇప్పటికే తొమ్మిది మ్యాచుల్లో 8 విజయాలు సాధించిన ఆర్‌ఆర్‌ ప్లేఆఫ్స్‌కు చేరువైంది. తాజాగా లఖ్‌నవూపై అలవోకగా విజయం సాధించింది. కెప్టెన్ సంజూ శాంసన్‌తోపాటు (71*) ధ్రువ్ జురెల్ (52*) అజేయంగా నిలిచి గెలిపించాడు. ఐపీఎల్ కెరీర్‌లో తొలి అర్ధశతకాన్ని సాధించిన తర్వాత ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) భావోద్వేగంతో ఒకరికి సెల్యూట్ చేశాడు. ఇంతకీ ఆ స్పెషల్‌ వ్యక్తి ఎవరనేది మ్యాచ్‌ అనంతరం ధ్రువ్ వెల్లడించాడు. 

‘‘మ్యాచ్‌ను ముగించే అవకాశం ఎప్పుడు వచ్చినా వదులుకొనేందుకు ఇష్టపడను. మిడిలార్డర్‌లో ఆడటం వల్ల మరింత బాధ్యత మనపై ఉంటుంది. చివరి వరకూ క్రీజ్‌లో ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించే అవకాశం వస్తుంది. పవర్‌ ప్లేలో కేవలం ఇద్దరు మాత్రమే సర్కిల్ అవతల ఉంటారు. సులువుగానే పరుగులు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ, మిడిల్‌ ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లను దాటి బౌండరీ పంపించాలంటే చాలా శ్రమించాలి. టెక్నిక్‌తోపాటు టైమింగ్ ముఖ్యం. మొదట్లో నేను కొట్టిన బంతులు నేరుగా ఫీల్డర్ల వద్దకే వెళ్లాయి. ఆ సమయంలో సంజూ ధైర్యం చెప్పాడు. మరీ బాదుడు కాకుండా టైమింగ్‌తో ఆడమని సూచించాడు. ఆ తర్వాత ఒకే ఓవర్‌లో 20 పరుగులు చేయడంతో నాపై నాకు నమ్మకం పెరిగింది. నేను భారత జట్టులో ఆడుతోంది నా తండ్రి కోసం. మా కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో ఆడేటప్పుడు నాతోపాటు లేరు. ఆర్మీలో విధులు నిర్వర్తించారు. ఇప్పుడు హాఫ్‌ సెంచరీ చేసిన సమయంలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. అర్ధశతకం చేసిన తర్వాత ఆయనకే సెల్యూట్‌ చేస్తూ సంబరాలు చేసుకున్నా’’ అని ధ్రువ్‌ వెల్లడించాడు. మ్యాచ్‌ అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి ధ్రువ్‌ సంబరాలు చేసుకున్నాడు. వారితో ఫొటోలు దిగాడు. ఈ వీడియోను ఐపీఎల్‌ షేర్ చేసింది.

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • ఐపీఎల్‌లో రాజస్థాన్‌ ఛేదించిన అత్యధిక టార్గెట్స్‌లో ఇది ఐదోది. 2020లో పంజాబ్‌పై, 2024 సీజన్‌లో కోల్‌కతాపై ఆర్‌ఆర్‌ 224 పరుగులను ఛేదించి గెలిచింది. ఇప్పుడు లఖ్‌నవూపై 197 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసింది. 
  • ఐపీఎల్‌లో రాజస్థాన్‌ తరఫున నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం చేసిన జోడీగా సంజూ శాంసన్ - ధ్రువ్‌ జురెల్ నిలిచింది. వీరిద్దరూ కలిసి లఖ్‌నవూపై 121 పరుగులను జోడించారు.
  • లఖ్‌నవూ 2022, 2023 సీజన్లలో మొత్తం 15 మ్యాచ్‌లకుగాను 12 మ్యాచుల్లో లక్ష్యాలను కాపాడుకొని విజయం సాధించింది. రెండు ఓటములను మాత్రమే చవిచూసింది. ఒకదాంట్లో ఎలాంటి ఫలితం రాలేదు. కానీ, 2024 ఎడిషన్‌లో మాత్రం ఆరు మ్యాచుల్లో మూడింట్లో గెలవడం గమనార్హం. మరో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. 
  • ఏక్‌నా మైదానంలో పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక స్కోర్లు నమోదైన నాలుగో మ్యాచ్‌ ఇది. శ్రీలంకతో 2022లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 199/2 స్కోరు చేసింది. 
  • తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు లఖ్‌నవూ చేసిన అత్యధిక జట్టు స్కోర్ల జాబితాలో ఇది ఐదోది. గతేడాది పంజాబ్‌పై 257/5 స్కోరు చేయగా.. కోల్‌కతాపై (2022లో) 210/0 చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని