Updated : 05 Nov 2021 17:06 IST

Rohit Sharma: ట్రోఫీ రాకుంటే.. ఎన్ని సెంచరీలు కొట్టినా వృథానే: రోహిత్‌ శర్మ

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ ఆటలో వ్యక్తిగత ప్రదర్శన కంటే టీం వర్క్‌ చాలా ముఖ్యమని అన్నాడు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ. జట్టు ట్రోఫీ గెలవనప్పుడు ఎన్ని పరుగులు చేసినా.. ఎన్ని శతకాలు కొట్టినా వాటికి అర్థమే ఉండదన్నాడు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీని పేలవ ప్రదర్శనతో ఆరంభించిన టీమిండియా.. బుధవారం అఫ్గానిస్థాన్‌పై దంచికొట్టి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. ఆ మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచిన రోహిత్‌.. తాజాగా ఐసీసీ అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

‘‘2016 నుంచి ఇప్పటివరకు ఎంతో అనుభవాన్ని పొందాను. అప్పటితో పోలిస్తే బ్యాట్స్‌మన్‌గా మరింత పరిణతి చెందాను. ఆటను అర్థం చేసుకుంటూ, జట్టు ఏం కోరుకుంటుందో తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్రికెటర్‌గా జట్టుకే అధిక ప్రాధాన్యమివ్వాలి. జట్టుకు ఏం అవసరమో తెలుసుకోవాలి. ఒక షాట్‌ ఆడే ముందు అది ఆ సమయంలో జట్టుకు అవసరమా? లేదా? అన్నది ఆలోచించుకోవాలి. అప్పుడే మంచి ఫలితం లభిస్తుంది. ఇక ఓపెనర్ల విషయానికొస్తే.. ఇన్నింగ్స్‌ మొదలుపెట్టేవారికి ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది. అందుకే, టీ20ల్లో ఎక్కువ శతకాలు టాప్‌ ఆర్డర్ బ్యాట్‌మెనే సాధించగలుగుతారు. నేను కూడా అంతే’’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆట తీరు మారిందని, అందుకే చాలా మంది సెంచరీలు కొట్టేస్తున్నారని రోహిత్‌ అన్నాడు. బ్యాట్స్‌మెన్‌ ఎలాంటి భయం లేకుండా బంతులను ఎదుర్కొంటున్నారని, అది ఒక రకంగా అన్ని జట్లకు కలిసొస్తున్న అంశమన్నాడు. 

ఈ సందర్భంగా 2019 వన్డే ప్రపంచకప్‌ నాటి సంగతులను కూడా రోహిత్‌ గుర్తు చేసుకున్నాడు. ‘‘2019 ప్రపంచకప్‌ నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకం. ఆ టోర్నీలో నేను చాలా పరుగులు సాధించాను. ప్రతి ఆటగాడు టోర్నీకి వెళ్లే ముందు ఒక ప్లాన్‌ వేసుకుంటాడు. అది ఫాలో అవుతాడు. నేనూ అదే చేసి ఎక్కువ పరుగులు రాబట్టాను. అయితే నిజాయతీగా చెప్పాలంటే జట్టు ట్రోఫీ గెలవనప్పుడు ఆటగాడిగా ఎన్ని పరుగులు చేసినా.. ఎన్ని శతకాలు సాధించినా అవన్నీ వృథానే కదా’’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. 

అమ్మ కోసం.. జెర్సీ నం. 45

టీమిండియాకు అరంగేట్రం చేసినప్పటి నుంచి ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఎప్పుడూ 45వ జెర్సీ నంబరుతోనే కన్పిస్తుంటాడు. అయితే దీనికి ఓ ప్రత్యేక కారణం ఉందట. ఆ విషయాన్ని తాజాగా హిట్‌మ్యాన్‌ బయటపెట్టాడు. అమ్మ కోరిక మేరకే ఆ నంబరును ఎంచుకున్నట్లు చెప్పాడు. ‘‘45వ నంబరు ఎందుకంటే.. ఆ సంఖ్య మా అమ్మకు ఇష్టం. జట్టులోకి వచ్చినప్పుడు చాలా జెర్సీ నంబర్లు ఉన్నాయి. ఏ నంబరు ఎంచుకోవాలని మా అమ్మను అడిగా. 45 అయితే నీకు మంచిదని చెప్పింది. అందుకే ఆ నంబరు తీసుకున్నా’’ అని రోహిత్‌ వివరించాడు. 

అఫ్గాన్ జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా శుక్రవారం స్కాట్లాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని చవిచూడటంతో మిగతా మ్యాచ్‌లన్నీ భారత జట్టుకు కీలకంగా మారాయి. 


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని