Axar patel: కుల్దీప్ స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తీసుకోండి: వసీం జాఫర్‌

బంగ్లాతో రెండో వన్డేలో కుల్దీప్‌ సేన్‌కు బదులుగా అక్షర్‌ పటేల్‌(Axar patel)కు అవకాశం ఇవ్వాలని వసీం జాఫర్‌(Wasim jaffer) అన్నాడు. 

Published : 07 Dec 2022 01:05 IST

దిల్లీ: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌(Axar patel)ను బంగ్లాతో రెండో వన్డే ఆడే జట్టులోకి తీసుకోవాలంటూ మాజీ బ్యాటర్‌ వసీం జాఫర్‌(Wasim jaffer)  సూచించాడు. కుల్దీప్‌ సేన్‌(Kuldeep sen) స్థానంలో అతడికి అవకాశం కల్పించాలన్నాడు. వచ్చే ఏడాది ప్రపంచకప్‌(ODI World cup 2023) నేపథ్యంలో ఈ ఆటగాడికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని తెలిపాడు.  

‘‘రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని కుల్దీప్ సేన్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. ఈ టోర్నమెంట్‌ కన్నా ముందు 20-25 మ్యాచ్‌లు ఉన్నాయి. కాబట్టి, అక్షర్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ప్రపంచకప్‌ పిచ్‌లపై స్పిన్నర్లు విధ్వంసం సృష్టించగలరు. షకీబ్‌ విషయంలో మనమది చూశాం. షాబాజ్‌ కొత్త కుర్రాడు. ఉమ్రాన్‌ మాలిక్‌, దీపక్‌, సిరాజ్‌కు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావించి ఉంటారు. కానీ, అక్షర్‌ లాంటి స్పిన్నర్లు తుది జట్టులో ఉండాలి’’ అని తెలిపాడు. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో గెలుపు అవకాశాలపై మాట్లాడుతూ.. 

‘‘బంగ్లాతో రెండో వన్డేలో షకీబ్‌ అల్‌ హసన్‌, ఇబాదత్‌, ముస్తాఫిజుర్‌ వంటి బౌలర్లను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా షకీబ్‌.. ఇతడికి వికెట్లు తీసే అవకాశం ఇవ్వకపోతే ఆ ప్రభావం వల్ల మిగిలిన బౌలర్లు ఒత్తిడికి గురవుతారు. ఆఫ్‌ స్పిన్నర్‌ కావడం వల్ల కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ, షకీబ్‌ ప్రమాదకారి. అతడికి వికెట్లు ఇవ్వకుండా బ్యాటింగ్‌ చేయగలిగితే చాలు భారత్‌ గెలుస్తుంది. తొలి వన్డే టీమ్ఇండియాకు చెడ్డరోజు. కానీ, రెండో వన్డేలో రోహిత్‌సేన అది పునరావృతం కాకుండా చూడాలని నేను కోరుకుంటున్నా. పెద్ద స్కోరేమీ అక్కర్లేదు.. 230-240 సాధించగలిగితే చాలు. బ్యాటర్లు ఈ సారి మరింత జాగ్రత్తగా ఆడాలి’’అంటూ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని