Igor Stimac: నేనేమీ సంతోషంగా లేను.. మరిన్ని మార్పులు అవసరం: భారత ఫుట్‌బాల్‌ కోచ్‌

వరుసగా టోర్నీలను గెలుస్తున్నప్పటికీ.. భారత ఫుట్‌బాల్ జట్టు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని కోచ్‌ ఇగార్ స్టిమాక్‌ (Igor Stimac) అభిప్రాయపడ్డాడు.

Updated : 09 Jul 2023 18:12 IST

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా ఇంటర్‌కాంటినెంటల్‌ కప్, శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌ను (Saff) భారత్ కైవసం చేసుకుని అదరగొట్టేసింది. జట్టును నడిపించడంలో కెప్టెన్ సునీల్ ఛెత్రీ కష్టంతోపాటు కోచ్‌ ఇగార్‌ స్టిమాక్‌ మార్గనిర్దేశకం చాలా కీలకంగా మారింది. ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో సఫలీకృతులయ్యారు. అయితే, కోచ్‌ స్టిమాక్‌ మాత్రం ఇప్పటికీ సంతోషంగా లేనట్లు తెలుస్తోంది. జట్టు మెరుగయ్యే విధానం సరిగా లేదనే అభిప్రాయాన్ని స్టిమాక్‌ వెల్లడించాడు. ఇప్పటికీ ఫుట్‌బాల్ ఆట భారత్‌లో భాగం కాలేకపోయిందని, రియల్‌ వరల్డ్‌లోకి రాలేకపోతున్నట్లు పేర్కొన్నాడు. అంతర్జాతీయంగా జట్టు ప్రత్యర్థులకు పోటీనిచ్చేలా తయారు కావడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించాడు. 

‘‘ఇటీవల భారత్‌ అద్భుత విజయాలు సాధించింది. అయినా సంతోషం అనిపించడం లేదు.  ఇండియన్  సూపర్ లీగ్ (ISL) నుంచి కొన్ని చెడ్డ అలవాట్లను మోసుకొచ్చారు. కొన్ని నిర్ణయాలను  తీసుకోవడంలో సరిగ్గా వ్యవహరించడం లేదు. అందుకే, కొన్ని అంశాల్లో మార్పులు చేయాలి. వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. నా ప్రణాళికలకు స్పష్టమైన ఆమోదం ఉండాలి. అదీనూ రాబోయే కొన్ని వారాల్లోనే జరిగితేనే మంచిది. ఇలాంటి పరిణామాల్లో మార్పులు తీసుకురావడానికి జనవరి వరకు వేచి ఉండలేం. దేశంలో ఫుట్‌బాల్‌ ఇంకా నిజమైన ప్రపంచంలోకి రాలేదు. ప్రత్యర్థులకు, మనకు చాలా గ్యాప్‌ ఉంది. అది తొలగిపోవాలంటే మార్పులు చేసుకుంటూ ముందడుగు వేయాలి. భారత్‌లో బాగా ఆడుతున్నామని సంతోషించడం కంటే ఇతర దేశాల్లోనూ పోటీ ఇవ్వగలిగే స్థాయికి చేరాలని కోరుకోవాలి. 

భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ మరికొంతకాలం ఆడాలి. కనీసం నేను ఇక్కడ ఉన్నంత వరకైనా జట్టుతోపాటు ఉండాలి. కొందరు ఛెత్రీ వయసు గురించి మాట్లాడతారు. కానీ అతడి ఫిట్‌నెస్‌, కమిట్‌మెంట్‌, ఆట పట్ల అభిరుచి, గోల్స్‌ చేయాలనే ఆత్రుత, నాయకత్వ లక్షణాలు అద్భుతం. భారత్‌లోనే అత్యుత్తమ ఆటగాడు. అతడి ఆట, రికార్డులే చెబుతాయి’’ అని స్టిమాక్‌ తెలిపాడు. వచ్చే ఏడాది ఆసియా కప్‌ వరకు ఇగార్‌ స్టిమాక్‌ భారత కోచ్‌గా వ్యవహరిస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు