Shreyas Iyer - BCCI: శ్రేయస్ బలిపశువు అయ్యాడా? బీసీసీఐ నిర్ణయంపై కొనసాగుతున్న చర్చ!

శ్రేయస్‌ అయ్యర్‌ వార్షిక కాంట్రాక్‌ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం విషయంలో చర్చ కొనసాగుతోంది. బీసీసీఐ నిర్ణయం సరైనదేనా అంటూ చర్చ జరుగుతోంది. 

Updated : 06 Mar 2024 15:36 IST

దేశవాళీ క్రికెట్‌ను యువ ఆటగాళ్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఉద్దేశంతో.. అందరికీ ఒక హెచ్చరిక జారీ చేసేలా రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న ఇషాన్ కిషన్‌, శ్రేయస్ అయ్యర్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించడం భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. ఐతే ఈ వ్యవహారంలో శ్రేయస్ అయ్యర్ బలిపశువు అయ్యాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతడి పట్ల బీసీసీఐ అంత కఠినంగా వ్యవహరించి ఉండాల్సింది కాదనే చర్చ జరుగుతోంది. 

టీమ్ ఇండియా ఆటగాళ్లు రంజీ ట్రోఫీని పట్టించుకోకపోవడం కొత్తగా జరుగుతున్నది కాదు. దశాబ్దాల నుంచి స్టార్ ఆటగాళ్లు ఈ దేశవాళీ అత్యున్నత టోర్నీని తేలిగ్గా తీసుకుంటున్నారు. భారత జట్టులో కొంచెం నిలదొక్కుకున్నారంటే ఇక దేశవాళీ క్రికెట్ గురించి మరిచిపోవడమే. అందులోనూ టీ20ల రాకతో అంతర్జాతీయ సిరీస్‌ల సంఖ్య పెరిగిపోయింది. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ఆడుతూ.. ఐపీఎల్‌ కోసం రెండు నెలలు కేటాయిస్తూ దేశవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడటం అంటే కుదిరే పని కాదు. ఐతే తీరిక లేకుండా క్రికెట్ ఆడే సీనియర్ ఆటగాళ్ల సంగతి పక్కన పెడితే.. యువ ఆటగాళ్లు కూడా రంజీ ట్రోఫీని లైట్ తీసుకుంటుండడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. 

బీసీసీఐకి ఇంత ఆగ్రహం రావడానికి ముఖ్య కారణం.. ఇషాన్ కిషన్. రెండు నెలల కిందట దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చేశాడు. వ్యక్తిగత కారణాలు సాకుగా చూపినా.. తుది జట్టులో చోటు దక్కనందుకు కినుక వహించే అతను వచ్చేసినట్లు సమాచారం. ఐతే అతణ్ని ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. భారత జట్టుకు దూరంగా ఉన్నాడు కాబట్టి రంజీ ట్రోఫీలో ఝార్ఖండ్‌కు ఆడాలని బీసీసీఐ నుంచి అతడికి ఆదేశాలు అందాయి. అతను పెడచెవిన పెట్టాడు. మరోవైపు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రెండో మ్యాచ్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్‌కు కూడా బోర్డు నుంచి ఇలాంటి ఆదేశాలే రాగా..  పట్టించుకోలేదట. అందుకే ఇప్పుడు వీళ్లిద్దరినీ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించారు.

శ్రేయస్ కథ వేరు..

ఇషాన్ ఇండియన్ టీమ్ మేనేజ్‌మెంట్‌ దగ్గర యాటిట్యూడ్ చూపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ శ్రేయస్ వ్యవహారం వేరు. అతను ఇంగ్లాండ్ సిరీస్ సందర్భంగా వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. అది ఫామ్ మీద కూడా ప్రభావం చూపింది. దీంతో మూడో టెస్టు నుంచి జట్టుకు దూరమయ్యాడు. అతను ఫిట్‌నెస్‌ సమస్యలతో వైదొలిగాడా.. సెలక్టర్లు వేటు వేశారా అనే విషయంలో స్పష్టత లేదు. వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో కొంత విశ్రాంతి అవసరమైంది. ఆ సమయంలోనే రంజీ ట్రోఫీ ఆడాలని బోర్డు నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. 

అతను వెంటనే ఆ టోర్నీలో బరిలోకి దిగలేదు. కానీ సెమీస్ మ్యాచ్‌లో ముంబయికి ఆడాడు. పదో తేదీ  నుంచి విదర్భతో జరగబోయే రంజీ ట్రోఫీ ఫైనల్‌లో కూడా ఆడతాడని సమాచారం. అయితే ఇప్పుడు అతణ్ని సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించారు. ఇషాన్ ఒక్కడిని లక్ష్యంగా చేసుకుంటే బాగోదని, సమస్య తీవ్రతను పెంచి చూపడానికి శ్రేయస్‌ను కూడా కలిపి బీసీసీఐ చర్యలు తీసుకుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వందకు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ లాంటి ఆటగాడితో బీసీసీఐ మరీ ఇంత కఠినంగా వ్యవహరించాల్సింది కాదని.. ఈ వ్యవహారంలో బలిపశువు అయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తీసిపడేసే ఆటగాడు కాదు

శ్రేయస్ అయ్యర్ 59 వన్డేలు, 51 టీ20లు, 14 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో కొన్నేళ్లుగా రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. ఆ ఫార్మాట్‌లో 5 సెంచరీలు కూడా చేశాడు. గత ఏడాది ప్రపంచకప్‌లో వరుసగా రెండు అర్ధశతకాలు, రెండు శతకాలు సాధించాడు. ఇటీవల, ముఖ్యంగా టెస్టుల్లో ఫామ్‌తో కొంత తంటాలు పడుతున్న మాట వాస్తవం. కానీ అతణ్ని ఫిట్‌నెస్‌ సమస్యలు వెంటాడుతున్న సంగతీ మరువరాదు. ఈ నేపథ్యంలో శ్రేయస్‌కు ఒక హెచ్చరిక జారీ చేసి సరిపెట్టి ఉండాల్సిందని.. మూడు ఫార్మాట్లో భారత్‌కు ఆడుతున్న కొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన శ్రేయస్‌ను చిన్న పొరబాటుకు సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించడం అన్యాయం అనే వాదన వినిపిస్తోంది.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని