IND vs WI: సూర్యా.. ఐపీఎల్‌లో ఆడినట్లు ఇక్కడెందుకు ఆడట్లేదు..? : పొలార్డ్

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆ జట్టు సారథి కీరణ్‌ పొలార్డ్‌  తనను రెచ్చగొట్టేందుకు చూశాడని టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అన్నాడు...

Published : 08 Feb 2022 01:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆ జట్టు సారథి పొలార్డ్‌  తనను రెచ్చగొట్టేందుకు చూశాడని టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆరోపించాడు. అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్ చేయగా 176 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 28 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (60; 51 బంతుల్లో 10x4, 1x6) అర్ధ శతకంతో రాణించగా మిడిల్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్‌ (34 నాటౌట్‌; 36 బంతుల్లో 5x4), దీపక్‌ హుడా (26 నాటౌట్‌; 32 బంతుల్లో 2x4) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలోనే పొలార్డ్‌ తనను ఔట్‌ చేసేందుకు చూశాడని సూర్య మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు.

‘‘నేను బ్యాటింగ్‌ చేస్తుండగా అతడు నా వద్దకు వచ్చి.. ‘మిడ్‌ వికెట్‌లో ఎవరూ లేరు.. ఐపీఎల్‌లో ఆడినట్లు ఇక్కడెందుకు ఫ్లిక్‌ షాట్లు ఆడట్లేదు’ అని అడిగాడు. అయితే, ఇక్కడి పరిస్థితులు వేరని, ఇప్పుడు చివరి వరకు క్రీజులో ఉండాలనుకున్నట్లు నిర్ణయించుకున్నానని అతడితో చెప్పాను’ అని ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ వివరించాడు. కాగా, ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన మూడో వన్డేలో సూర్యకుమార్‌ అలాంటి ఫ్లిక్‌ షాట్‌కే ప్రయత్నించి వికెట్ పోగొట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అప్పటికి టీమ్‌ఇండియా మంచి స్థితిలో ఉన్నా చివరికి ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా చివరివరకూ క్రీజులో ఉండాలని ఈ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ భావించాడు. అనంతరం తనతో కలిసి ఐదో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అరంగేట్రం ఆటగాడు దీపక్‌ హుడాపై మాట్లాడిన సూర్యకుమార్‌.. అతడికి తాను ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదని చెప్పాడు. దీపక్‌ ఏడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడని, దీంతో చివరి వరకూ క్రీజులో ఉండటం ముఖ్యమని అతడికి తెలుసని చెప్పాడు. అతడికున్న ఆత్మవిశ్వాసం చూసి ముచ్చటేసిందని ముంబయి బ్యాట్స్‌మన్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని