Kolkata vs Delhi: సొంతగడ్డపై చెలరేగిన కోల్‌కతా.. దిల్లీపై ఘన విజయం

హ్యాట్రిక్‌పై కన్నేసిన దిల్లీకి షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ 2024లో భాగంగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

Updated : 29 Apr 2024 23:56 IST

కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా చెలరేగింది. హ్యాట్రిక్‌పై కన్నేసిన దిల్లీకి షాక్‌ ఇచ్చింది. ఐపీఎల్‌ 2024లో భాగంగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ (68; 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకంతో చెలరేగాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (33*), వెంకటేశ్‌ అయ్యర్‌ (26*) రాణించారు. దిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 2, విలియమ్స్‌ 1 వికెట్‌ తీశారు. ఈ విజయంతో కోల్‌కతా ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించగా, దిల్లీ 11 మ్యాచ్‌ల్లో ఆరో ఓటమిని మూటగట్టుకుంది.  

దంచికొట్టిన సాల్ట్‌..

భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ ఐపీఎల్‌లో దిల్లీ నిర్దేశించిన 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ రెచ్చిపోయి ఆడాడు. విలియమ్స్‌ వేసిన తొలి ఓవర్‌లో ఫోర్‌తో వేట మొదలు పెట్టిన అతడు అదే ఓవర్‌లో ఓ సిక్స్‌, ఫోర్‌ బాదాడు. మరో ఓపెనర్‌ నరైన్‌ సైతం చివరి బంతికి ఫోర్‌ బాదడంతో ఈ ఓవర్లలో మొత్తం 23 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్లోనూ విలియమ్స్‌కు ఫిలిప్‌ చుక్కలు చూపించాడు. వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. రసిక్‌ వేసిన ఐదో ఓవర్లో నరైన్‌ రెండు ఫోర్లు కొట్టగా, ఫిలిప్‌ ఒక ఫోర్‌ బాదాడు. దీంతో ఈ ఓవర్లో మొత్తం 15 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు కోల్‌కతా 61 పరుగులతో పటిష్ఠంగా నిలిచింది. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఆరో ఓవర్‌లో ఫిలిప్‌ విశ్వరూపం చూపాడు. రెండో బంతిని ఫోర్‌ బాదిన అతను, నాలుగో బంతిని సిక్‌ బాది 26 బంతుల్లో అర్ధశతకం చేశాడు. తర్వాతి రెండు బంతులను బౌండరీ దాటించాడు. ఏడో ఓవర్‌లో అక్షర్‌ వేసిన తొలి బంతికి నరైన్‌ (15: 10 బంతుల్లో) ఫ్రేజర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం రింకు సింగ్‌ క్రీజులోకి వచ్చాడు. కుల్దీప్‌ వేసిన 8వ ఓవర్‌లో రింకు ఫోర్‌ కొట్టగా, సాల్ట్‌ సిక్స్‌ బాదాడు. 9వ ఓవర్‌ తొలి బంతికి సాల్ట్‌ను అక్షర్‌ బౌల్డ్‌ చేశాడు. విలియమ్స్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్‌ రెండో బంతికి రింకు సింగ్‌ (11: 11 బంతుల్లో) క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో వెంకటేశ్‌ అయ్యర్‌తో జట్టు కట్టిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ నెమ్మదిగా స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో 15 ఓవర్లకు కోల్‌కతా 141 పరుగులతో విజయానికి చేరువైంది. 16వ చివరి బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ సిక్స్‌ బాదడంతో విజయలక్ష్యం మూడు పరుగులుగా మారింది. రసిక్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ సిక్స్‌ బాది మ్యాచ్‌ను గెలిపించాడు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కుల్దీప్‌ యాదవ్‌(35) టాప్‌ స్కోరర్‌. పంత్‌ (27) మినహా మిగతావారు విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా, వైభవ్‌ అరోరా, హర్షిత్‌ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్టార్క్‌, నరైన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని