MS Dhoni: ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్‌ గేమ్‌: భారత మాజీ క్రికెటర్

ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్‌లో సింగిల్‌ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది.

Published : 02 May 2024 16:34 IST

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా ఇన్నింగ్స్‌లో ఇంకా రెండు ఓవర్లు ఉన్నప్పుడు ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్‌కు వచ్చాడు. చివరి ఓవర్‌లో సులువైన పరుగు వచ్చే అవకాశం ఉన్నా దానిని వద్దని నాన్‌స్ట్రైకర్‌ డారిల్ మిచెల్‌ను వెనక్కి పంపాడు. అప్పటికే అతడు దాదాపు రెండు పరుగులు తీసినట్లుగా స్ట్రైకింగ్‌ నుంచి తన క్రీజ్‌ వైపు పరిగెత్తాడు. తర్వాత బంతినే ధోనీ సిక్స్‌గా మలచడం గమనార్హం. అయితే, ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ సింగిల్‌ లేదా డబుల్ తీసి ఉంటే బాగుండేదని కొందరు కామెంట్లు చేస్తుండగా.. డారిల్‌ ఆఖర్లో దూకుడుగా ఆడలేడనే కారణంతోనే ధోనీ స్ట్రైకింగ్‌ను తనవద్దే ఉంచుకున్నాడని మరికొందరు మద్దతుగా నిలిచారు. ఈ వ్యవహారంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. 

‘‘ఎంఎస్ ధోనీ క్రీజ్‌లోకి వచ్చినప్పటినుంచి అభిమానుల నినాదాలు హోరెత్తిపోతాయి. అతడు భారీ షాట్లు కొట్టడం చూడాలనేది వారి ఆశ. ఈ ఐపీఎల్‌లో అందుకు తగ్గట్టుగానే ధోనీ చివర్లో వచ్చి విరుచుకుపడ్డాడు. అయితే, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డారిల్ మిచెల్ సింగిల్‌ కోసం పిలిచినప్పుడు వెళ్తే బాగుండేది. ధోనీ దాన్ని తిరస్కరించకుండా ఉండాల్సింది. ఇదంతా టీమ్‌ గేమ్. ఎందుకంటే నాన్‌స్ట్రైకర్ కూడా అంతర్జాతీయ స్థాయి క్రికెటరే. ఒకవేళ అతడు బౌలర్‌ అయి ఉండుంటే నేను కూడా పరిస్థితిని అర్థం చేసుకొనేవాడిని. జడేజా, మిచెల్‌తో అలా చేయడం సరైంది కాదు. అలాంటి అవసరం కూడా లేదు. ఇక 19వ ఓవర్‌లో స్పిన్నర్‌తో బౌలింగ్‌ వేయించిన పంజాబ్ కెప్టెన్ కరన్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అక్కడ ధోనీ క్రీజ్‌లో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌లో భారీ మార్పులు తీసుకురాగలడు. అయితే, స్పిన్‌ బౌలింగ్‌లో గత కొన్నేళ్లుగా ధోనీ పెద్దగా పరుగులు చేయలేదు. అందుకే, కరన్ స్పిన్నర్‌ను తీసుకొని వచ్చి ఉంటాడు’’ అని పఠాన్‌ తెలిపాడు. 

బుమ్రాకి వైస్‌ కెప్టెన్సీ ఇవ్వాల్సింది

‘‘హార్దిక్‌ పాండ్య అంతర్జాతీయస్థాయిలో టీ20 జట్టుకు కెప్టెన్సీ నిర్వర్తించాడు. మళ్లీ రోహిత్ సారథ్య బాధ్యతలను చేపట్టాడు. యువకులతో కూడిన జట్టును పొట్టి కప్‌ కోసం పంపించాలని బీసీసీఐ మొదట్లో ప్రణాళికలు రూపొందించింది. అందుకోసం హార్దిక్‌, సూర్య నాయకత్వంలో జట్టును ఆడించింది. కానీ, హార్దిక్‌ పాండ్య నిలకడలేమి కారణంగా మళ్లీ రోహిత్‌నే సారథిగా నియమించింది. ఇషాన్‌, శ్రేయస్‌ దేశవాళీ క్రికెట్‌లో ఆడలేదనే నెపంతో కాంట్రాక్ట్‌లను తీసేసిన బీసీసీఐ.. హార్దిక్‌కు మాత్రం ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించడం వల్ల జట్టులోని మిగతా సభ్యులకు తప్పుడు సంకేతాలు వెళ్లినట్లు అవుతాయి. ఇప్పుడు నేరుగా వైస్‌ కెప్టెన్సీని అప్పగించారు. ప్రస్తుత ఫామ్‌, ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుని రోహిత్‌కు డిప్యూటీగా బుమ్రాని నియమిస్తే బాగుండేది’’ అని ఇర్ఫాన్ సూచించాడు. 

ధోనీ రనౌట్‌పై పంజాబ్‌ సరదా పోస్టు.. 

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ధోనీ తొలిసారి ఔటయ్యాడు. అదీనూ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఈసందర్భంగా ధోనీ రనౌట్‌పై పంజాబ్ ఫ్రాంచైజీ సరదాగా ఓ పోస్టు పెట్టింది.  ‘ధోనీ అలా కావడానికి కారణముంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ధోనీని ఏడో వికెట్‌గా ఔట్ చేయడం గమనార్హం. చెన్నైపై గెలిచిన తర్వాత పంజాబ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని