T20 WC 2024: చిన్నారులతో ప్రపంచ కప్‌ జట్టు ప్రకటన.. వీడియో వైరల్‌

ప్రపంచ కప్ కోసం టీమ్‌లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌ తమ స్క్వాడ్‌ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 29 Apr 2024 11:52 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత కాలమానం ప్రకారం జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. మే 1 లోగా స్క్వాడ్‌లను ప్రకటించాల్సి ఉంది. భారత సెలక్టర్లు అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇవాళే టీమ్‌ను వెల్లడించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, న్యూజిలాండ్ బోర్డు కూడా తమ జట్టును ప్రకటించింది. ఇందులో విశేషం ఏముందంటారా? స్క్వాడ్‌ను సాధారణంగా కెప్టెన్ లేదా చీఫ్ సెలక్టర్, ప్రధాన కోచ్‌ మీడియా సమావేశం నిర్వహించి ప్రకటిస్తుంటారు. కానీ, కివీస్‌ బోర్డు మాత్రం వినూత్న ప్రయత్నం చేసింది. ఇద్దరు చిన్నారులతో ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌ నిర్వహించి.. వారితో జట్టు సభ్యుల పేర్లను వెల్లడించింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

న్యూజిలాండ్‌కు చెందిన ఆంగస్, మటిల్దా టీ20 ప్రపంచ కప్‌లో తమ జట్టును ప్రకటించారు. ఒకరు ఆటగాడి పేరు చదువుతూ ఉండగా.. మరొకరు వారు ఎక్కడి నుంచి వచ్చారనేది ఆసక్తికరంగా చెప్పారు. ‘‘అందరికీ హాయ్‌. మేం ఇక్కడికి వచ్చింది వరల్డ్ కప్‌ జట్టును ప్రకటించడానికే. ఇలాంటి అవకాశం రావడం అనందంగా ఉంది. యూఎస్ఏ - విండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ కోసం కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌ను ఎంచుకున్నాం’’ అని వీడియోలో ఆంగస్‌, మటిల్దా పేర్కొన్నారు. అనంతరం న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తమ జట్టు గురించి వెల్లడించాడు. 

‘‘వరల్డ్‌ కప్‌ కోసం ఎంపికైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. ప్రపంచ టోర్నీల్లో దేశం కోసం ప్రాతినిధ్యం వహించే ప్రత్యేక సందర్భమిది. విండీస్ - యూఎస్‌ఏ పరిస్థితులను త్వరగా అలవాటు చేసుకొనే స్క్వాడ్‌ను ఎంపిక చేశామని భావిస్తున్నా. మ్యాట్ హెన్రీ, రచిన్‌ రవీంద్ర అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొట్టేస్తున్నారు. గత ఏడాదిగా రచిన్‌ నాణ్యమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు’’ అని స్టీడ్‌ వెల్లడించాడు. 

న్యూజిలాండ్ టీమ్‌: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకెల్ బ్రాస్‌వెల్, మార్క్‌ చాప్‌మన్, డేవన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్‌, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, టిమ్‌ సౌథి. ట్రావెలింగ్‌ రిజర్వ్: బెన్ సీర్స్


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని