NZ vs IND:వాళ్లు జట్టులో లేరని టీమ్‌ఇండియాని తక్కువ అంచనా వేయొద్దు: కేన్‌ విలియమ్సన్‌

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జట్టులో లేకపోయినా ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలిగే  సామర్థ్యం టీమ్‌ఇండియాకు ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు.

Published : 19 Nov 2022 02:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జట్టులో లేకపోయినా ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలిగే  సామర్థ్యం టీమ్‌ఇండియాకు ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. కివీస్‌, భారత్‌ మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన అనంతరం విలియమ్సన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. హార్దిక్ పాండ్య సారథ్యంలో న్యూజిలాండ్‌లో పర్యటనకెళ్లిన భారత జట్టును ద్వితీయ శ్రేణి జట్టుగా పరిగణించాలా? అని విలేకరులు ప్రశ్నించగా.. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ లేకున్నా ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడింగలిగే సత్తా ఈ టీమ్‌కు ఉందన్నాడు. ఈ జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లున్నారని  పేర్కొన్నాడు.  

‘వారందరూ (టీమ్‌ఇండియా యువ క్రికెటర్లు) భారతదేశానికి పెద్ద ఆటగాళ్లు అవుతారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. నేను వారందరినీ భారత టీ20 లీగ్‌లో చూశాను. ఈ  ఆటగాళ్లు మంచి ప్రతిభావంతులు’ అని  విలియమ్సన్ తెలిపాడు. 2023 ప్రపంచ కప్‌ సన్నద్ధత గురించి మాట్లాడుతూ.. ఈ మెగా ఈవెంట్‌ కోసం సన్నద్ధం కావడానికి ఇది గొప్ప అవకాశమన్నాడు. న్యూజిలాండ్‌ తమ ఆటగాళ్లందరికీ అవకాశాలు ఇవ్వాలనుకుంటోందని చెప్పాడు. ‘చాలా జట్లు 2023 వన్డే ప్రపంచకప్‌ కోసం సన్నద్ధమవుతున్నాయి. యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇప్పుడు వన్డే ఫార్మాట్ చక్కటి అవకాశంగా ఉంది. వారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాణిస్తారనే నమ్మకం నాకుంది’ అని కేన్‌ వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని