Chennai Vs Punjab: నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్‌బాల్స్‌ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్

పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

Published : 02 May 2024 11:47 IST

ఇంటర్నెట్ డెస్క్: చెపాక్ వేదికపై చెన్నైను ఓడించడంలో పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ కీలక పాత్ర పోషించాడు. గేమ్‌ ఛేంజింగ్‌ స్పెల్‌తో బ్రార్ ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అతడికే ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి పంజాబ్ పట్టు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 17వ సీజన్‌లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో శివమ్‌ దూబె ఒకడు. అలాంటి బ్యాటర్‌ను బ్రార్ తొలి బంతికే ఔట్ చేశాడు. మ్యాచ్ అనంతరం బ్రార్ తన ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘చెపాక్‌ పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా మారింది. రాహుల్ చాహర్ కూడా అద్భుతంగా బంతులేశాడు. గత ఆరేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నా. నాకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఇప్పుడీ మ్యాచ్‌లో స్టార్‌ క్రికెటర్లకు బౌలింగ్‌ చేయడం బాగుంది. కానీ, ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదు. సాధారణంగానే భావించా. నా బలాలపై దృష్టి పెట్టా. ఎప్పుడూ వికెట్లు తీయాలనే లక్ష్యంతో బరిలోకి దిగలేదు. మరిన్ని డాట్‌ బాల్స్‌ను వేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా వికెట్లు వస్తాయనేది నా భావన. పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తే బౌలర్లు మరింత చెలరేగుతారు’’ అని బ్రార్ వెల్లడించాడు. రాహుల్‌ చాహర్‌, బ్రార్‌ కలిసి 8 ఓవర్లలో కేవలం 33 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. 

చెపాక్‌లో గెలవడం ఎప్పటికీ ప్రత్యేకమే: సామ్‌ కరన్

‘‘ఇక్కడి వచ్చిన ప్రతిసారి విజయం సాధించడం మరింత ఆనందంగా ఉంది. గతేడాది కూడా మేం ఇక్కడ గెలిచాం. ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌లను మా సొంత మైదానంలో ఓడిపోయాం. ప్రత్యర్థి స్టేడియాల్లో విజయం సాధించాం. ఇప్పుడు ప్రతి మ్యాచ్‌ గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొనే స్థితిలో ఉన్నాం. చెన్నైకి వచ్చినప్పుడు భయంకరమైన వేడి ఉంది. కానీ, మ్యాచ్‌ జరిగే కొద్దీ మంచు ప్రభావం ఎక్కువగా ఉండటం ఆశ్చర్యపరిచింది. ఎంఎస్ ధోనీ క్రీజ్‌లో ఉన్నప్పుడు 19వ ఓవర్‌ వేయమని చాహర్‌కు సూచించా. సాధారణంగా చివర్లో పేసర్ల వైపు మొగ్గు చూపిస్తారు. కానీ, నేను మాత్రం స్పిన్‌ వేయిద్దామని భావించా. ప్రతి బ్యాటర్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. దానిని మేం అడ్డుకోవడానికి ఒక్కోసారి ఇలా చేయడం రిస్క్‌తో కూడుకున్నదే’’ అని పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని