Ishan - Rohit: బర్త్‌డే బాయ్‌ ఇషాన్‌ను గిఫ్ట్ అడిగిన రోహిత్.. అదేంటో తెలుసా?

భారత యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్ (Ishan kishan) 25వ పుట్టినరోజు నేడు. సహచర క్రికెటర్లు అతడితో కేక్‌ కోయించి సెలబ్రేషన్స్‌ చేశారు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం అతడి నుంచే గిఫ్ట్ అడిగాడు. ఇంతకీ అందేంటంటే?

Updated : 19 Jul 2023 10:33 IST

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా పుట్టిన రోజంటే శుభాకాంక్షలు చెప్పి ఏదొక బహుమతిని ఇవ్వడం ఆనవాయితీ. కానీ, టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం బర్త్‌డే బాయ్‌ ఇషాన్ కిషన్‌ను (Ishan Kishan) గిఫ్ట్‌ కావాలని కోరాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. టీమ్ఇండియా యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ ప్రస్తుతం విండీస్‌ పర్యటనలో (WI vs IND) ఉన్నాడు. ఇవాళ అతడి బర్త్‌డే. ఈ స్పెషల్‌డే సందర్భంగా  ఇషాన్‌ ఏం చేశాడనేది వీడియో రూపంలో బీసీసీఐ (BCCI) తన ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రాక్టీస్‌ చేయడం నుంచి కేక్‌ కటింగ్‌ వరకు ఇషాన్ లైఫ్‌ను చూపించింది. విండీస్‌ క్రికెట్ దిగ్గజం బ్రియాన్‌ లారాతో కూడా ఇషాన్‌ సంభాషించాడు. ఈ క్రమంలోనే ఇషాన్‌ను ఆటపట్టిస్తూ ఏం గిఫ్ట్‌ ఇస్తున్నావని రోహిత్ అడిగాడు. దానికి రోహితే సమాధానం ఇచ్చాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?

బుమ్రా సిద్ధమేనా?

వెస్టిండీస్‌తో రెండో టెస్టు (WI vs IND) గురువారం నుంచి ప్రారంభం కానుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఉండగా ఇషాన్‌ కిషన్‌ ప్రాక్టీస్‌ ముగించుకుని డగౌట్‌ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో రిపోర్టర్‌ ఒకరు ఇషాన్‌ బర్త్‌డేకు మీరేం గిఫ్ట్‌ ఇస్తారని రోహిత్‌ను ప్రశ్నించాడు. దానికి సమాధానంగా స్పందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. 

ఇషాన్‌నే ఈ ప్రశ్న అడుగుదామని చెప్పి.. నీకేం బహుమతి కావాలి? అని కిషన్‌ను రోహిత్ అడిగాడు. ఇషాన్‌ ఏం సమాధానం ఇవ్వకుండా నవ్వాడు. మళ్లీ రోహితే కలగజేసుకొని ‘అతడికి అన్నీ ఉన్నాయి’ అని అనడంతో అందరూ నవ్వేశారు. ‘ఇషాన్‌ నువ్వే మాకు బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వు. విండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ సాధించు. ఇదే భారత జట్టుకు ఇచ్చే బహుమతి’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. విండీస్‌తో తొలి టెస్టు సందర్భంగానే ఇషాన్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో పరుగుల (1*) ఖాతాను తెరిచే అవకాశం మాత్రమే వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని