రిషబ్‌ పంత్‌ ఆటను బెన్‌ డకెట్‌ చూడలేదేమో : రోహిత్‌ శర్మ

బజ్‌బాల్‌ గురించి మాట్లాడే ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ బెన్‌ డకెట్‌ రిషబ్‌ పంత్‌ ఆటను చూడాలని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. 

Updated : 06 Mar 2024 17:25 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ డకెట్‌ (Ben Duckett) చేసిన వ్యాఖ్యలను కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఖండించాడు. ధర్మశాలలో జరిగే ఐదో టెస్టు మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషబ్‌పంత్ గురించి ప్రస్తావించాడు. ‘‘మా జట్టులో రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) ఉండేవాడు. తన దూకుడైన ఆటను, సిక్సర్లు కొట్టే తీరును బెన్‌ డకెట్‌ చూడలేదేమో’’ అంటూ చురకలంటించాడు. 

మూడో టెస్టులో జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ చేసిన తర్వాత తమ బజ్‌బాల్‌ గేమ్‌కు కొంత ప్రాధాన్యం దక్కుతుందని డకెట్‌ వ్యాఖ్యానించాడు. దీనిపై ఇంగ్లాండ్‌ సహా పలు దేశాల మాజీ ఆటగాళ్ల నుంచి అతడు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.  జైస్వాల్‌ మీ నుంచి ఏమీ నేర్చుకోలేదు. వీలుంటే మీరే అతని దగ్గర నేర్చుకోండి అంటూ ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ నాసిర్‌ హుస్సేన్‌ తమ ఆటగాళ్లకు సూచించాడు. రికీ పాంటింగ్‌, క్రిస్‌గేల్ లాంటి వారు సైతం మాతరం క్రికెటర్ల ఆటను డకెట్‌ చూడలేదేమో అంటూ అతని వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 

విలేకరులు బజ్‌బాల్‌ గురించి రోహిత్‌ శర్మను ప్రశ్నించగా బజ్‌బాల్‌ అంటే ఏమిటో తనకు తెలియదని, ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కూడా మెరుగైన ప్రదర్శన చేశారని రోహిత్‌ శర్మ అన్నాడు. ఈ సిరీస్‌లో జైస్వాల్ 4 మ్యాచుల్లో 94 సగటుతో 655 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని