Team India: వారిద్దరే కాదు.. అతడిలోనూ భవిష్యత్తు స్టార్ లక్షణాలు: ఆర్పీ సింగ్

వెస్టిండీస్‌తో సిరీస్‌ల్లో (Wi vs IND) యువ క్రికెటర్లకు భలేగా అవకాశాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ముకేశ్‌ కుమార్‌, యశస్వి జైస్వాల్, తిలక్‌ వర్మ.. ఇలా ఐపీఎల్‌లో ఉత్తమ ప్రదర్శనతో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

Published : 05 Aug 2023 14:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) క్రికెట్‌లో యువకుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్ గతేడాది కాలంగా నిలకడైన ప్రదర్శన ఇస్తున్నారు. ఐపీఎల్‌లో (IPL) రాణించి విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆడిన యశస్వి జైస్వాల్ కూడా తన సత్తా ఏంటో చూపించాడు. తాజాగా విండీస్‌తో టీ20 సిరీస్‌ (WI vs IND) ద్వారా యువ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. తొలి టీ20లో భారత్‌ ఓడినప్పటికీ తిలక్‌ వర్మ (39) బ్యాటింగ్‌ ప్రదర్శన ఆకట్టుకుంది. టీమ్ఇండియా తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత క్రికెట్‌ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్‌ వ్యాఖ్యానించాడు. ఇప్పుడందరూ గిల్, యశస్విని భవిష్యత్తు స్టార్లుగా అభివర్ణిస్తున్నారని.. అయితే, తిలక్‌ వర్మలోనూ భవిష్యత్తు స్టార్‌గా దాగిఉన్నాడని పేర్కొన్నాడు. 

అప్పుడు జట్టులో ధోనీ ఉండాలని గంగూలీకి చెప్పాను.. కానీ

‘‘విండీస్‌తో తొలి టీ20లో తిలక్‌ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత భవిష్యత్తు తారగా మారే లక్షణాలు అతడిలో ఉన్నాయనిపిస్తోంది. మిడిలార్డర్‌లో ఎడమచేతివాటం బ్యాటర్‌ కోసం అన్వేషిస్తున్నాం. యువ్‌రాజ్‌ సింగ్ తర్వాత రిషభ్‌ పంత్‌ ఆ లోటును తీర్చాడు. కానీ ప్రమాదానికి గురై పంత్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఇలాంటప్పుడు తిలక్ వర్మ రూపంలో మరొక సూపర్‌ ప్లేయర్‌ దొరికాడు. సిక్స్‌తో తన అంతర్జాతీయ పరుగుల ఖాతాను తెరిచాడు. మరీ ముఖ్యంగా అతడు కొట్టిన మూడో సిక్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌. ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా బాదాడు. అలాంటి ప్లేస్‌మెంట్‌లో సిక్స్‌ కొట్టడం తేలిక కాదు’’ అని ఆర్పీ సింగ్‌ తెలిపాడు. 

ఆ ట్రిక్‌ మిస్‌ అయింది: చోప్రా

‘‘విండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ బౌలింగ్‌ను సరిగ్గా ప్రారంభించలేకపోయింది. చాహల్‌ వచ్చి రెండు వికెట్లు తీసిన తర్వాత కాస్త కుదురుకుంది. అయితే, అతడిని అక్కడితో ఆపారు.  ఆ తర్వాత మరో రెండు ఓవర్లు వేయించారు. టీమ్‌ఇండియా కెప్టెన్ హార్దిక్‌ పాండ్య చేసిన తప్పిదమదే. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన బౌలర్‌తో నాలుగు ఓవర్లు వేయించకుండా ఆపడం సరైందికాదు. నికోలస్‌ పూరన్ ఆడుతున్న సమయంలోనైనా చాహల్‌తో బౌలింగ్‌ చేయాల్సింది. అతడు ఎడమచేతివాటం బ్యాటర్లకు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడు’’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని