Sanju Samson: లఖ్‌నవూపై సూపర్ ఇన్నింగ్స్‌.. పొట్టి కప్‌ రేసులోకి సంజూ!

టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్‌ను వెల్లడించాల్సి ఉంది.

Published : 28 Apr 2024 13:11 IST

ఇంటర్నెట్ డెస్క్: లఖ్‌నవూపై రాజస్థాన్ విజయం సాధించడంలో కెప్టెన్ సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అతడు కేవలం 33 బంతుల్లోనే 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్‌ కోసం విరాట్ కోహ్లీతో (430) పోటీ పడుతున్నాడు. ప్రస్తుతం సంజూ 385 పరుగులతో కొనసాగుతున్నాడు. మరోవైపు ఈ ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్‌ టీ20 ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లఖ్‌నవూపై విజయం అనంతరం సంజూ సంబరాలు చేసుకున్నాడు. త్వరలోనే పొట్టి కప్‌ కోసం టీమ్‌ఇండియాను ప్రకటించనున్న నేపథ్యంలో పోటీ ఆసక్తికరంగా మారింది. 

ప్రపంచ కప్‌ కోసం స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్ల లిస్ట్‌లో రిషభ్‌ పంత్ అందరికంటే ముందున్నాడు. అతడికి బ్యాకప్‌గా ఎవరు ఉంటారు? అనే ప్రశ్నకు సంజూ సమాధానంగా కనిపిస్తున్నాడు. వన్‌డౌన్, మిడిలార్డర్‌లో భారీగా పరుగులు చేస్తుండటం అతడికి కలిసొచ్చే అంశం. ఈ మ్యాచ్‌కు ముందు కూడా ఐపీఎల్‌లో 82*, 69, 68* పరుగులు చేశాడు. ఇషాన్‌ కిషన్, కేఎల్ రాహుల్ ఉన్నా.. ఫామ్‌పరంగా సంజూతో పోలిస్తే దూరంగా ఉన్నారు. కిషన్‌ ఓపెనర్‌గా ముంబయికి ఆడుతున్నాడు. కొన్ని ఇన్నింగ్స్‌ల్లో దూకుడుగా ఆడినా.. ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఇక కేఎల్‌ రాహుల్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో లఖ్‌నవూను నడిపిస్తున్నాడు. అయితే, స్ట్రైక్‌రేట్‌పరంగా సంజూనే వీరిద్దరికంటే బెటర్‌ అనేది క్రికెట్ పండితుల వాదన. కానీ, బీసీసీఐ వర్గాల వాదన మరోలా ఉందని వార్తలు వస్తున్నాయి. పంత్‌తోపాటు కేఎల్‌కే అవకాశం ఇస్తారని పేర్కొనడం గమనార్హం. 

సీనియర్‌ ప్లేయర్ దినేశ్ కార్తిక్‌ కుర్రాళ్లకు తీవ్ర పోటీ ఇస్తున్నాడు. ‘ఫినిషర్‌’గా బెంగళూరు తరఫున దూకుడుగా ఆడేస్తున్న అతడిని పరిగణనలోకి తీసుకోవాలనే వారూ లేకపోలేదు. అయితే, డీకేను ఫైనల్‌ XI లోకి తీసుకోనప్పుడు.. అతడిని స్క్వాడ్‌లోకి ఎంపిక చేయొద్దని భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే పంత్, సంజూ మంచి ఫామ్‌లో ఆడుతున్నారని.. వారి ఎంపికే సరైందని పేర్కొన్నాడు. మరో మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ కూడా రెండో వికెట్‌ కీపర్‌ స్పాట్‌ అత్యంత ఆసక్తికరంగా మారిందని తెలిపాడు. కేఎల్‌ రాహుల్‌ను తొలి ఎంపికగా తీసుకున్న క్రిష్‌.. రెండో కీపర్‌గా పంత్/సంజూ మధ్య తీవ్ర పోటీ ఉందని పేర్కొన్నాడు. మరో మాజీ నవ్‌జ్యోత్ సిద్ధూ అయితే ఏకంగా సంజూ శాంసన్‌నే తొలి ఎంపికగా వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని