IPL 2024: వచ్చే వేలంలో అశ్విన్‌ అన్‌సోల్డ్.. వరల్డ్‌ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్

తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్‌లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది.

Published : 29 Apr 2024 15:00 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ జట్టులో (T20 World Cup 2024) స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఐపీఎల్‌లో రాణిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు యువ క్రికెటర్లతోపాటు సీనియర్లూ సిద్ధంగా ఉన్నారు. కానీ, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) ప్రదర్శన మాత్రం దారుణంగా ఉంది. రాజస్థాన్‌ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. అశ్విన్‌ ఆటతీరు మాత్రం నిరాశపరుస్తోంది. దీంతో అతడిని పొట్టి కప్‌ పరిగణనలోకి తీసుకొనే అవకాశాలు చాలా తక్కువ. స్పెషలిస్ట్ స్పిన్నర్ రేసులో చాహల్, కుల్‌దీప్‌ ముందున్నారు. ఇక స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జడేజాదే స్థానం. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అశ్విన్‌ ఐపీఎల్‌లో కొనసాగే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో అశ్విన్‌ కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టాడు.

‘‘పరుగులు చేస్తున్నప్పుడు స్ట్రైక్‌రేట్‌తో సంబంధం లేదని కేఎల్ రాహుల్ గతంలో చెప్పాడు. అది బ్యాటింగ్‌ గురించి. ఇప్పుడు అశ్విన్‌ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. అయితే, వికెట్లు తీసినప్పుడే అలా కుదురుతుంది. ఒకవేళ అతడి గణాంకాలు సరిగ్గా లేకపోతే కనీసం వచ్చే ఏడాది జరగబోయే వేలంలో తీసుకొనేందుకు ఎవరూ ఆసక్తి కూడా చూపరు. అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం ఖాయం. ఏ జట్టైనా ఒక బౌలర్‌ నుంచి 25-30 పరుగులు కంటే ఎక్కువ ఇవ్వకుండా వికెట్లు తీయాలని కోరుకుంటుంది. అలా జరగకపోతే అతడిని తీసుకోవడం వృథాగానే భావిస్తుంది. 

ఇప్పుడున్న స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్ వికెట్లు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. అశ్విన్‌ ఆఫ్‌ స్పిన్‌ వర్కౌట్ కావడం లేదు. ఎందుకు అతడు క్యారమ్‌ బౌలింగ్ చేయడం లేదు? గతంలో చాలాసార్లు దూస్రాలు సంధించి వికెట్లు పడగొట్టాడు. తన బౌలింగ్‌పై నమ్మకం సన్నగిల్లినప్పుడే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. నేనే మెంటార్‌ అయి ఉంటే నా జట్టులో ఎవరైనా వికెట్లు తీయడం కంటే పరుగులను నియంత్రించాలనుకుంటే మాత్రం వారికి మళ్లీ జట్టులో అవకాశం కల్పించను’’ అని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని