Ashes Series: స్మిత్‌ ‘రనౌట్‌’ విషయంలో.. అంపైర్‌ చెప్పిందదే: స్టువర్ట్‌ బ్రాడ్

యాషెస్ సిరీస్‌ (Ashes Series) ఐదో టెస్టులోనూ ఇంగ్లాండ్, ఆసీస్‌ జట్లు (ENG vs AUS) బజ్‌బాల్‌ క్రికెట్ ఆడేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఇరు జట్ల తొలి ఇన్నింగ్స్‌లు ముగిశాయి. నేడు మూడో రోజు ఇంగ్లాండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే ఆసీస్‌ 12 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. అయితే, రెండో రోజు స్మిత్ రనౌట్‌ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. 

Updated : 29 Jul 2023 11:51 IST

ఇంటర్నెట్ డెస్క్: యాషెస్‌ సిరీస్‌ (Ashes Series) ఫైనల్‌ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండు రోజుల ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా 12 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ (ENG vs AUS) ఆధిక్యంతో నిలిచింది. తొలుత ఇంగ్లాండ్ 283 పరుగులు చేయగా.. ఆసీస్‌ 295 పరుగులకు ఆలౌటైంది. స్టార్‌ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (71) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే, స్మిత్ 42 పరుగుల వద్ద ఉన్నప్పుడు రనౌట్‌ నుంచి తప్పించుకున్నాడు. ‘బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌’ కింద స్మిత్‌ నాటౌట్‌గా బయటపడ్డాడు. దీంతో మరోసారి అంపైరింగ్‌పై చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ సీనియర్‌ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్ స్పందించాడు. స్మిత్‌ను నాటౌట్‌గా ప్రకటించడానికిగల కారణాన్ని ఫీల్డ్‌ అంపైర్‌ ధర్మసేన చెప్పినట్లు బ్రాడ్ పేర్కొన్నాడు.

భువి వీడ్కోలు పలకనున్నాడా?

‘‘నియమ నిబంధనలు ఎలా ఉన్నాయనేది నాకు పూర్తిగా తెలియదు. అయితే, అక్కడ నాటౌట్‌ ఇవ్వడానికి సరైన కారణం లేదనిపిస్తోంది. ఇది బ్యాటర్‌కు బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్ కింద అవకాశం లభించింది. ఒక కోణంలో నుంచి చూస్తే అది ఔట్‌గానే అనిపించింది. కానీ, పక్క నుంచి చూస్తే బెయిల్స్‌ సరిగ్గా పడనట్లు కూడా ఉంది. ఇదే విషయంపై అంపైర్‌ ధర్మసేనను అడిగా. ఒక వేళ బెయిల్‌ కాస్త పైకి లేచినా ఔట్‌గా పరిగణించే అవకాశం ఉండేదని చెప్పాడు. ఇలాంటి కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు’’ అని బ్రాడ్ వ్యాఖ్యానించాడు. 

తొలిసారి చూసినప్పుడు..: స్మిత్

‘‘రిప్లేలో తొలిసారి చూసినప్పుడు నేను కూడా ఔట్‌గానే భావించా. పెవిలియన్‌కు వెళ్దామని సిద్ధమయ్యా. అయితే, మళ్లీ రిప్లేలో మాత్రం బెయిల్‌ పైకి లేచినట్లు అనిపించలేదు. ఒకవేళ బంతి నేరుగా తగిలి ఉంటే నేను కచ్చితంగా ఔటయ్యేవాడినే’’ అని స్మిత్ స్పందించాడు. ఎంసీసీ నిబంధనల ప్రకారం.. బంతి వికెట్లను తాకినప్పుడు బెయిల్స్‌లో కనీసం ఒక్కటైనా స్టంప్స్‌ నుంచి కాస్త పైకి కానీ, పక్కకు కానీ తొలిగినప్పుడే రనౌట్‌గా పరిగణించడం జరుగుతుంది. ఇదే విషయంపై ఎంసీసీ కూడా స్పందించింది. స్టంప్స్‌ నుంచి ఒక్క బెయిల్‌ కూడా విడిపోలేదు కాబట్టి, స్మిత్‌ను నాటౌట్‌గా ప్రకటించడం జరిగిందని ఎంసీసీ పేర్కొంది.

ఇదీ జరిగింది.. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో 78 ఓవర్‌ మూడో బంతిని ఇంగ్లాండ్‌ పేసర్ క్రిస్‌ వోక్స్‌ సంధించాడు. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ బంతిని ఎదుర్కొని మిడ్‌ఆన్‌ వైపు తరలించాడు. కమిన్స్‌తో కలిసి స్మిత్‌ రెండో పరుగుకు యత్నించాడు. అయితే, అక్కడ ఫీల్డర్‌ జార్జ్‌ ఎల్హామ్‌ చురుగ్గా కదిలి బంతిని వికెట్‌ కీపర్‌కు విసిరాడు. జానీ బెయిర్‌స్టో కూడా స్టంప్స్‌ను తాకించాడు. కానీ, స్మిత్‌ బ్యాట్‌ను క్రీజ్‌ లోపలికి పెట్టే సమయానికి బెయిల్‌ ఒక్కటి కూడా విడిపోకపోవడంతో థర్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత స్మిత్ హాఫ్‌ సెంచరీ సాధించి ఆసీస్‌ ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని