Cricket News: సూర్యకుమార్‌ గాయంపై అప్‌డేట్.. ఖవాజాకు ఐసీసీ అనుమతి నిరాకరణ!

Updated : 11 Jan 2024 10:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న భారత క్రికెటర్ సూర్యకుమార్‌ యాదవ్‌పై (Surya kumar Yadav) అప్‌డేట్‌.. ఆసీస్‌ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా విజ్ఞాపనకు ఐసీసీ నిరాకరణ.. పీసీబీకి షాక్‌ ఇచ్చిన పాక్‌ ప్రభుత్వం.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..

గాయాలు సరదా తీర్చేస్తాయ్‌ బాసూ..

టీ20ల్లో టాప్‌ బ్యాటర్‌, భారత ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు గాయమైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్‌ సందర్భంగా కాలు మడతబడటంతో ఇబ్బందిపడ్డాడు. అతడు వెంటనే జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా అతడి వీడియో ఒకటి బయటకొచ్చింది. కాలికి కట్టు వేసుకుని నడుస్తున్నాడు. ‘‘సీరియస్‌గా చెప్పాలంటే గాయాలను ఏమాత్రం సరదాగా తీసుకోకూడదు. కానీ, జీవితంలో ఇది కూడా ఒక దశ అని నేను భావిస్తా. పూర్తిగా కోలుకుని తిరిగి వస్తా. అప్పటివరకూ ప్రతి ఒక్కరూ ఈ పండగ సీజన్‌ను ఆస్వాదించండి’’ అని సూర్య పోస్టు చేశాడు.


అలాంవేవీ వాడటానికి వీల్లేదు: ఐసీసీ

పాకిస్థాన్‌తో బాక్సింగ్‌ డే టెస్టు (Boxing Day Test) శాంతి చిహ్నాలను తన బ్యాట్‌, బూట్లపై ఉంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన ఆసీస్‌ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు నిరాశే ఎదురైంది. అలాంటివేమీ వాడవద్దని ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రాక్టీస్‌ సెషన్, తొలి టెస్టు సందర్భంగా ఖవాజా తన బూట్లపై నినాదాలు రాయడంపైనా ఇప్పటికే ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిపై వివరణ ఇవ్వాలని ఖవాజాను కోరింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలను ప్రదర్శించవద్దని హెచ్చరికలు జారీ చేసింది. వ్యక్తిగతమైన అభిప్రాయాలను మాత్రమే చెప్పానని.. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని ఖవాజా మీడియా ముఖంగానే వ్యాఖ్యలు చేశాడు.


పీసీబీకి ఎదురు దెబ్బ..

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు (PCB)కి ఆ దేశ ప్రభుత్వం నుంచే ఎదురు దెబ్బ తగిలింది. పాక్‌ సూపర్ లీగ్‌ (PSL)ను అమ్మడం, అంతర్జాతీయ మీడియా హక్కులు విక్రయం ద్వారా భారీగా ఆర్జన చేద్దామని భావించిన పీసీబీకి చుక్కెదురైంది. పీఎస్‌ఎల్‌ లీగ్‌ అమ్మకంతోపాటు మీడియా హక్కుల విక్రయాలపై నిషేధం విధిస్తూ పాక్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘‘కేంద్ర క్రీడల శాఖ ఇప్పటికే నోటీసు జారీ చేసింది. క్రికెట్‌కు సంబంధించిన అతిపెద్ద డీల్స్‌ విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి’’ అని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఈ విక్రయం ద్వారా పీసీబీ రూ. 270 కోట్ల వరకు ఆర్జించాలని భావించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని