Vallem Tanvee: తొమ్మిదేళ్లకే ‘క్యూ’ పట్టి.. బిలియర్డ్స్‌లో హైదరాబాద్‌ బాలిక మెరుపులు

తన వయసు పిల్లలంతా ఆడుకుంటూ.. పాఠశాలకు వెళ్తుంటే.. ఆ అమ్మాయి మాత్రం తనకు అమ్మమ్మ వయసు ఉండే వాళ్లతో పోటీపడుతూ.. ప్రపంచ ఛాపింయన్‌షిప్‌లో ఆడేస్తోంది. తొమ్మిదేళ్లకే క్యూ పట్టి బాల్స్‌ని గురి చూసి కొడుతోంది.

Updated : 13 Oct 2023 17:28 IST

 

ఆ బాలిక వయసు తొమిదేళ్లే! సాధారణంగా ఆ వయసు పిల్లలు ఏం చేస్తారు? తోటి పిల్లలతో ఆడుకుంటారు. పాఠశాలకు వెళ్తారు. కానీ, ఆ అమ్మాయి అంతర్జాతీయ టోర్నీల్లో ఆడుతోంది. అది కూడా ఎంతో ఏకాగ్రత అవసరమైన బిలియర్డ్స్‌ (Billiards)! ఆ అమ్మాయే హైదరాబాద్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడిన తెలుగమ్మాయి వల్లెం తన్వీ (Vallem Tanvee). 

అమెరికాలోని మేరీల్యాండ్‌లో నివసించే తన్వీ.. అక్టోబర్‌ 19 నుంచి 22 వరకు ఆస్ట్రియాలో జరిగే ప్రతిష్ఠాత్మక ‘ప్రిడేటర్‌ డబ్ల్యూపీఏ ప్రపంచ 10 బాల్‌ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌’లో పోటీపడబోతోంది. ఈ టోర్నీలో ఆడబోతున్న పిన్న వయస్కురాలు తన్వీనే. 9 బాల్‌ ఫార్మాట్‌ నుంచి 10 బాల్‌ ఫార్మాట్‌కు మారిన బిలియర్డ్స్‌లో తన్వీ ఆడటమే ఎక్కువ అంటే.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడడం మామూలు విషయం కాదు. ఫ్యూర్టోరికోలో జరిగిన 9 బాల్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఆ టోర్నీలో ఆడిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన తన్వీ.. ఇప్పుడు మరో రికార్డు కోసం ఎదురుచూస్తోంది. 2022 అక్టోబర్‌లో తొలి అంతర్జాతీయ టోర్నీలో ఆడిన తన్వీ.. అండర్‌-17 విభాగంలోనూ సత్తా చాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

నాన్న సరదాగా తెస్తే..

గతేడాది ఆరంభంలో ఇంట్లో ఏదో సరదాగా ఆడటం కోసం తెచ్చిన పూల్‌ టేబుల్‌ని చూసి తన్వీ ఆకర్షితురాలైంది. ఎనిమిదేళ్లకే క్యూని కచ్చితంగా పట్టుకోవడం.. బాల్స్‌ని గురి చూసి కొట్టడం అలవాటు చేసుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆటపై మరింత పట్టు సాధించిన ఆమె.. పోటీలకు వెళ్లే స్థాయికి చేరింది. అమెరికాలోని స్థానిక కోచ్‌ రాయ్‌ పాస్టర్‌ దగ్గర తీసుకున్న శిక్షణ తన్వీని మెరుగైన క్రీడాకారిణిగా మలిచింది. ఈ ఏడాది జనవరిలో అమెరికాలో జరిగిన కమూయ్‌ ప్రపంచ మహిళల 9-బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడి ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే చిత్ర మగిమైరాజ్‌ లాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులు ఆడిన టోర్నీలో ఈ చిన్నది ఎలాంటి బెరుకు లేకుండా పాల్గొంది. అందుకే ఆమెకు స్పాన్సర్‌షిప్‌ ఇవ్వడానికి ప్రిడియేటర్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది. త్వరలో ఆమె పోటీపడబోయే ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తన్వీ కన్నా 40 ఏళ్లు పెద్దదైన 49 ఏళ్ల చిత్ర మగిమైరాజ్‌ కూడా బరిలోఉండటం విశేషం.

ఏకాగ్రత చెదరదు 

తొమ్మిదేళ్ల బాలిక అంటే అల్లరి చేయడం సహజం. చెప్పినట్లు వినకుండా వాళ్లకి నచ్చిన పని చేస్తుంటారు. అలాంటిది ఏకాగ్రతకు మారుపేరుగా ఉండే క్యూ ఆటలో తన్వీ ఎలాంటి తడబాటు లేకుండా ముందుకెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తనకు అమ్మమ్మ వయసు ఉండే వాళ్లతో పోటీపడటం ఇంకా చిత్రంగా అనిపిస్తోంది. ‘‘తన్వీకి చిన్నప్పటి నుంచే బిలియర్డ్స్‌పై బాగా ఇష్టం కలిగింది. ఇంత చిన్న వయసులో సీనియర్లతో పోటీపడడం అంత తేలికేం కాదు. ఓడిపోతే ఏడ్వటం చిన్న పిల్లలకు సహజం. కానీ తన్వీ మాత్రం ధైర్యంగా ఉంటుంది. ఓటమిని కూడా పాజిటివ్‌గా తీసుకుంటుంది. ఈ వయసులో ఆ అమ్మాయి పరిణతి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. త్వరలో ఆమె సీనియర్‌ విభాగంలోనూ సత్తా చాటుతుంది’’ అని కోచ్‌లు చెబుతున్నారు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని