
Mohammed Siraj: ప్చ్..! ఆంగ్ల అభిమానుల అతి.. సిరాజ్ పైకి బంతి విసిరిన ఆకతాయిలు
లీడ్స్: టీమ్ఇండియాతో మూడో టెస్టులో ఇంగ్లాండ్ అభిమానులు కాస్త అతి చేస్తున్నారు! బౌండరీ సరిహద్దు వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌పై బంతి విసిరారు. అంతేకాకుండా స్కోరెంత అని అడుగుతూ అపహస్యం చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని వికెట్ కీపర్ రిషభ్ పంత్ మీడియాకు వివరించాడు.
లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీసేన పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 78 పరుగులకే ఆలౌటైంది. టాప్, మిడిలార్డర్ కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ తొలిరోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. 42 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కోహ్లీ బౌండరీ సరిహద్దు వద్ద ఫీల్డింగ్ చేయమన్నాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తుండగా ఇంగ్లాండ్ అభిమానుల్లో ఎవరో అతడి పైకి బంతి విసిరారు. దానిని చూసి బాధపడిన కోహ్లీ ఆ బంతిని వారిపైనే విసిరేయాలని సైగ చేశాడు! అంతేకాకుండా ఎగతాళి చేసేందుకు ఒకరు స్కోరెంత అని సిరాజ్‌ను ప్రశ్నించారు. అతడు తెలివిగా 1-0 అని సిరీసులో టీమ్ఇండియా ఆధిక్యం గురించి సైగలు చేస్తూ దిమ్మతిరిగే జవాబు ఇచ్చాడు.
‘అభిమానుల్లోంచి ఎవరో సిరాజ్ పైకి బంతి విసిరారు. ఆ చేష్టలతో కోహ్లీ బాధపడ్డాడు. ఎవరైనా ఏమైనా అనాలనుకుంటే అనొచ్చు. అరవొచ్చు. కానీ, ఫీల్డర్ల పైకి ఏమీ విసరొద్దు. అదంత మంచి క్రికెట్ అనిపించుకోదు’ అని పంత్ మీడియాతో అన్నాడు. కాగా, సిడ్నీలోనూ మహ్మద్ సిరాజ్ ప్రదర్శన చూసి స్థానికులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.