Cricket News: రిటైర్‌మెంట్‌లోనూ వీడని ధోనీ-రైనా స్నేహబంధం.. సంజూ బదులు రింకు.. బెన్‌స్టోక్స్‌ యూ-టర్న్!

మూడేళ్ల కిందట భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికారు. అలాగే ఇటీవల ముగిసిన విండీస్‌ పర్యటనలో ఓ బ్యాటర్‌ విఫలమయ్యాడు. మరోవైపు ఇంగ్లాండ్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ అందించిన స్టార్‌ ఆటగాడు మళ్లీ 50 ఓవర్ల క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఇది చదివేయండి.

Published : 15 Aug 2023 11:09 IST

ఇంటర్నెట్ డెస్క్: సరిగ్గా మూడేళ్ల కిందట ఇద్దరు భారత స్టార్‌ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికారు. ఒకరేమో ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) కాగా.. మరొకరు సురేశ్ రైనా. వీరిద్దరూ 2020వ సంవత్సరం ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. తొలుత ధోనీ తన నిర్ణయం వెల్లడించగా.. ‘సోదర’ సమానుడైన మహీ బాటలోనే సురేశ్ రైనా కూడా ఆటకు గుడ్‌బై చెప్పడం గమనార్హం. టీమ్‌ఇండియాలోనే కాకుండా ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023)లో సీఎస్‌కే తరఫున చాలాఏళ్లపాటు కలిసి ఆడారు. ధోనీ నాయకత్వంలోనే భారత్‌ 2007లో టీ20 వరల్డ్‌ కప్, 2011లో వన్డే ప్రపంచకప్‌లతోపాటు ఛాంపియన్స్‌ ట్రోఫీ (2013) విజేతగా నిలిచింది. అయితే, ధోనీ ఇంకా ఐపీఎల్‌లో కొనసాగుతుండగా.. సురేశ్‌ రైనా మాత్రం గతేడాది ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వీరిద్దరి స్నేహబంధం కేవలం మైదానంలోనే కాకుండా వ్యక్తిగతంగానూ బలమైందే. అందుకే, సీఎస్‌కే క్రికెట్ అభిమానులు ధోనీని ‘తలా’ అని.. రైనాని ‘చిన్న తలా’గా భావిస్తారు. ఐపీఎల్‌లో సీఎస్‌కే విజయవంతంగా కొనసాగడానికి ధోనీతోపాటు రైనా పాత్ర కూడా చాలా కీలకమని మాజీలు చెబుతుంటారు. ఇలాంటి ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు ఒకే రోజు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం... అదీనూ స్వాతంత్ర్య దినోత్సవం రోజునే కావడం విశేషం. 


సంజూ మిడిలార్డర్‌లో కష్టమే: అభిషేక్ నాయర్‌

వెస్టిండీస్‌ పర్యటనలో ఘోరంగా విఫలమైన బ్యాటర్ సంజూ శాంసన్‌. అతడికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా చేతులెత్తేశాడు. టీ20ల్లో రెండు మ్యాచుల్లో ఐదో స్థానం, ఒక మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్‌కు మిడిలార్డర్‌ సరైన స్థానం కాదని భారత వెటరన్ క్రికెటర్ అభిషేక్ నాయర్ వ్యాఖ్యానించాడు. ‘‘సంజూ శాంసన్‌ను మూడు లేదా నాలుగో స్థానంలో ఆడించాలి. ఐపీఎల్‌లోనూ ఎక్కువగా ఇవే స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన అనుభవం ఉంది. అందుకే, మిడిలార్డర్‌లో సంజూ శాంసన్‌కు బదులు రింకు సింగ్‌ సరిగ్గా సరిపోతాడు. సంజూను టాప్ ఆర్డర్‌లో ఆడించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. లోయర్‌ ఆర్డర్‌లో రింకు సింగ్‌ ఉత్తమ ఎంపిక అవుతుంది’’ అని నాయర్‌ వ్యాఖ్యానించాడు. 


వన్డే ప్రపంచకప్‌ ఆడితే.. వచ్చే ఐపీఎల్‌ బెన్‌ స్టోక్స్ ఆడడా..?

గత వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ గెలుచుకోవడంలో బెన్‌స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. అయితే, వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పిన బెన్‌స్టోక్స్ కేవలం టెస్టులు, టీ20ల్లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే, భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీలో బెన్‌ను ఆడించాలని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వన్డే ఫార్మాట్‌ కోచ్‌ కూడా బెన్‌ వస్తాడనే ఆశాభావంతో ఉన్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. వన్డే జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ అడిగితే బెన్‌స్టోక్స్‌ ప్రపంచ కప్ ఆడే అవకాశాలు మెండుగా ఉంటాయని కథనాలు వెలువడ్డాయి. తన రిటైర్‌మెంట్‌పై యూ టర్న్‌ తీసుకుని ఒక వేళ వన్డే ప్రపంచకప్‌లో బెన్‌ ఆడితే మాత్రం వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువ. భారత్‌తో 2024 జనవరి 25 నుంచి మార్చి 11 వరకు జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్ ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐపీఎల్‌ ఉంటుంది. దాదాపు ఐదారు నెలలు భారత్‌లోనే గడపాల్సి ఉంటుంది. కాబట్టి, వర్క్‌లోడ్‌ విపరీతంగా ఉండనున్న క్రమంలో ప్రపంచకప్‌ బరిలోకి దిగితే.. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి బెన్‌స్టోక్స్‌ వైదొలుగుతాడని సమాచారం. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లోనూ మోకాలి గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే, ఆసీస్‌తో యాషెస్‌ సిరీస్‌ ఆడినప్పటికీ ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ చేయకుండా.. బ్యాటింగ్‌పైనే దృష్టిపెట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని