Bengaluru vs Chennai: బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?

ఐపీఎల్‌ చివరి దశకు వరుణుడు అడ్డుగా మారాడు. కీలకమైన సమయంలో మ్యాచ్‌ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాడు.

Updated : 18 May 2024 15:16 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో అత్యంత ఆసక్తికరమైన పోరు సిద్ధమవుతోంది. కానీ, వరుణుడు అడ్డుగా నిలిచి క్రికెట్‌ మజాను ఆస్వాదించకుండా చేస్తాడేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. టాప్‌ -4లో నిలిచి ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకొనేందుకు బెంగళూరు, చెన్నై జట్ల మధ్య  చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే వర్షం ముప్పు ఉందనే వార్తల నేపథ్యంలో వాతావరణంపై ఆక్యూవెదర్‌ అంచనా వేసింది. దీని ప్రకారం మ్యాచ్‌ జరిగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్‌ సంతోషపడే వార్తే అవుతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌ రద్దైనా, ఓడినా ఆ జట్టు ఇంటిముఖం పట్టడం ఖాయం. మరోవైపు ఒకవేళ చెన్నై 18 పరుగుల్లోపే ఓడిపోయినా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఇప్పటికే బెంగళూరులో ‘యెల్లో అలర్ట్‌’ను అధికారులు జారీ చేశారు. ఈ క్రమంలో అక్కడి వాతావరణం ఎలా ఉండనుందో ఓసారి పరిశీలిద్దాం..

ఇదీ పరిస్థితి..

  • మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ 7 గంటలకు వేస్తారు. అంటే దాదాపు గంట ముందు నుంచే వర్షం పడకుండా ఉండాలి. 
  • ఆక్యూ వెదర్‌ ప్రకారం.. సాయంత్రం 6 గంటల వరకు వర్షం పడే అవకాశాలు 87 శాతం ఉన్నాయి. 
  • రాత్రి 7 గంటలకు వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. చినుకులు పడే అవకాశం 34 శాతానికి దిగిపోతుంది.
  • రాత్రి 8 గంటల నుంచి 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. మబ్బులు పట్టి ఉన్నప్పటికీ మ్యాచ్‌ జరిగే అవకాశాలు ఎక్కువే. చిరు జల్లులు పడినా మ్యాచ్‌ ఆగిపోయేంత స్థాయిలో ఉండకపోవచ్చు.
  • రాత్రి 11 గంటలకు మాత్రం వర్షం పడుతుందని ఆక్యూ వెదర్‌ రిపోర్ట్ చెబుతోంది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం 51 శాతంగా ఉంది. 
  • పై వివరాల ప్రకారం మ్యాచ్‌ జరిగేందుకు పెద్దగా ఇబ్బందులు ఉండవనిపిస్తోంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్‌ ఆగినా.. మైదానాన్ని సిద్ధం చేసేందుకు ‘సబ్‌ఎయిర్‌’ సిస్టమ్‌తో అక్కడి సిబ్బంది రెడీ ఉంటారు.
  • కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌ జరగాలంటే 10.30కల్లా మైదానం సిద్ధంగా ఉండాలి. వర్షం ఎప్పుడు ఆగినా 30 నిమిషాల్లోనే మ్యాచ్‌ నిర్వహణకు అనువుగా మైదానాన్ని రెడీ సామర్థ్యం చిన్నస్వామి స్టేడియంలో ఉంది. 
  • ప్రస్తుతం చెన్నై 14 పాయింట్లు, బెంగళూరు 12 పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైతే సీఎస్కే 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. బెంగళూరు ఖాతాలో 13 పాయింట్లే చేరతాయి. ఇంటిముఖం పట్టక తప్పదు. 

బెంగళూరు - చెన్నై మ్యాచ్‌ ఆసక్తికర విశేషాలు

👉 చెన్నైకి గోల్డెన్ ఛాన్స్‌.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!

👉 కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్‌ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేరుస్తుందా?

👉 బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్‌’ ఛాన్స్‌.. అదెలాగంటే?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని