WI vs IND: ఆఖరి టీ20లో చేతులెత్తేసిన భారత్.. సిరీస్‌ను కైవసం చేసుకున్న విండీస్‌

సిరీస్‌ను నిర్ణయించే ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా చేతులెత్తేసింది. భారత్‌ నిర్ణయించిన 166 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ జట్టు 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొంది 3-2 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Updated : 14 Aug 2023 01:34 IST

ఫ్లోరిడా: విండీస్‌పై వరుసగా రెండు టీ20ల్లో గెలిచి జోరు మీద కనిపించిన భారత్.. సిరీస్‌ నిర్ణయాత్మక పోరులో చేతులెత్తేసింది. ఆదివారం  జరిగిన ఐదో టీ20లో టీమ్‌ఇండియాపై విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సూర్యకుమార్‌ (61; 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), తిలక్ వర్మ (27; 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో తొలుత భారత్ 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని విండీస్ 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఐదు టీ20 సిరీస్‌ను విండీస్‌ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. బ్రాండన్ కింగ్ (85*; 55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు. నికోలస్ పూరన్ (47; 35 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్, తిలక్ వర్మ తలో వికెట్ పడగొట్టారు. మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. 

లక్ష్యఛేదనకు దిగిన విండీస్‌ రెండో ఓవర్లోనే వికెట్‌ కోల్పోయింది. తొలి ఓవర్లో సిక్స్‌, ఫోర్ బాది మంచి ఊపుమీదున్న ఓపెనర్‌ కైల్ మేయర్స్‌ (10)ను అర్ష్‌దీప్ సింగ్ వెనక్కి పంపాడు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్‌ వచ్చిరావడంతోనే తన పరుగుల ప్రవాహాన్ని మొదలుపెట్టాడు. అదే ఓవర్‌లో ఓ సిక్సర్‌ బాది పరుగుల ఖాతా తెరిచాడు. హార్దిక్ వేసిన మూడో ఓవర్‌లో చివరి రెండు బంతులను కూడా నేరుగా బౌండరీ అవతల పడేశాడు. కింగ్ కూడా దూకుడు పెంచి అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో వరుసగా 4,6 రాబట్టాడు. చాహల్ బౌలింగ్‌లోనూ అతడు ఓ సిక్స్, ఫోర్ దంచాడు. వీరిద్దరూ నిలకడగా ఆడటంతో 10 ఓవర్లకు విండీస్ 96/1 స్కోరుతో నిలిచింది. చాహల్‌ వేసిన 13 ఓవర్‌లో సిక్స్‌ కొట్టి బ్రాండన్‌ కింగ్ అర్ధ శతకం పూర్తి చేసుకోగానే వర్షం మొదలైంది. దీంతో ఆటను కాసేపు నిలిపివేశారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత తిలక్‌ వర్మ బౌలింగ్‌లో పూరన్‌ ఔటయ్యాడు. స్లిప్‌లో పాండ్య క్యాచ్‌ పట్టడంతో అతడు వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన షై హోప్‌ (22)తో కలిసి కింగ్ దూకుడు పెంచాడు. చాహల్ వేసిన 16 ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతడు.. తిలక్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ రాబట్టాడు. యశస్వి జైస్వాల్ బౌలింగ్‌లో హోప్‌ సిక్స్‌ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్‌కు స్పిన్నర్‌ అకీల్‌ హోసీన్‌ ఆదిలోనే గట్టిషాక్‌ ఇచ్చాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (5), శుభ్‌మన్‌ గిల్ (9)లను వరుస ఓవర్లలో ఔట్‌ చేశాడు. యశస్వి.. బౌలర్‌కే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరగా.. గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. గిల్ డీఆర్‌ఎస్‌కు వెళ్లి ఉంటే నాటౌట్‌గా నిలిచేవాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్, తిలక్ వర్మ భారత్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచారు. అకీల్ హోసీన్‌ వేసిన ఐదో ఓవర్‌లో సూర్య సిక్స్ బాదాడు. అల్జారీ జోసెఫ్‌ వేసిన ఆరో ఓవర్‌లో తిలక్ వర్మ చెలరేగిపోయాడు. వరుసగా 4,6,4,4 బాదేశాడు. హోల్డర్ వేసిన ఏడో ఓవర్‌లో ఈ కుర్రాడు మరో సిక్స్ బాదాడు. 

జోరుమీదున్న తిలక్‌.. రోస్టన్ చేజ్‌ బౌలింగ్‌లో అతడికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ (13) మరోసారి నిరాశపర్చాడు. రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మరోవైపు నిలకడగా ఆడిన సూర్యకుమార్‌ అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. తిరిగి ఆట మొదలైన తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్య (14), సూర్యకుమార్‌ వరుస ఓవర్లలో ఔటవ్వడంతో స్కోరు వేగం నెమ్మదించింది. 19వ ఓవర్‌లో షెఫర్డ్.. అర్ష్‌దీప్‌ సింగ్ (8), కుల్‌దీప్‌ (0)లను పెవిలియన్‌కు పంపాడు. హోల్డర్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఓ సిక్స్‌ బాదిన అక్షర్‌ పటేల్ (13) ఐదో బంతికి షెఫర్డ్‌కు చిక్కాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు