ODI WC 2023: ప్రపంచకప్‌లో స్టార్‌ బ్యాటర్ల పోటాపోటీ... ఎవరో మేటి?

గురువారం నుంచి ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ప్రారంభం కానుంది. 

Published : 04 Oct 2023 11:39 IST

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023) ప్రారంభమయ్యేందుకు సమయం ఆసన్నమైంది. అన్ని జట్లూ అస్త్రశస్త్రాలతో సిద్ధం. ఈ మెగా టోర్నీలో తమ బ్యాటింగ్‌ విన్యాసాలతో అభిమానులను అలరించడమే కాక.. కప్పు ఒడిసి పట్టాలని కొందరు మేటి బ్యాటర్లు సన్నద్ధమవుతున్నారు. మరి ఉత్తమ ప్రదర్శన చేసి తమ జట్టు టైటిల్‌ విజయానికి తోడ్పడి ప్రపంచ మేటి బ్యాటర్‌ అనిపించుకునే ఆటగాడు ఎవరవుతారా అని క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

విరాట్‌ కోహ్లి (Virat Kohli), స్టీవ్‌ స్మిత్ (Steve Smith), కేన్‌ విలియమ్సన్ (Kane Williamson), జో రూట్‌ (Joe Root).. సచిన్‌ తరం ఆటకు టాటా చెప్పాక ప్రపంచ క్రికెట్లో మేటి బ్యాటర్లుగా పేరు తెచ్చుకుంది ఈ నలుగురే. వీరిని ఫ్యాబ్‌-4 అని పిలుస్తారు అభిమానులు. వీరి హవా మొదలైన కొన్నేళ్ల తర్వాత బాబర్‌ అజామ్‌ (Babar Azam) వెలుగులోకి వచ్చాడు. ఈ ప్రపంచకప్‌లో అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న స్టార్‌ బ్యాటర్లు వీరు. టోర్నీలో వీరి ప్రదర్శన ఆధారంగానే ఆయా జట్లు ఎక్కడిదాకా వెళ్తాయన్నది ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు.

మంచినీళ్ల ప్రాయంగా శతకాలు

గత పదేళ్లనే కాదు.. మొత్తంగా క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు విరాట్‌ కోహ్లి. సచిన్‌ సహా చాలామంది మేటి బ్యాటర్ల రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డులు నెలకొల్పుతూ తనకు తానే సాటి అనిపించాడీ బ్యాటింగ్‌ యోధుడు. అయితే మూడేళ్ల కిందట అతను అనూహ్యంగా ఫామ్‌ కోల్పోయాడు. కరోనా, కెప్టెన్సీ నుంచి తప్పించడం అతడిని మానసికంగా కొంత దెబ్బ తీశాయి. మంచినీళ్ల ప్రాయంగా శతకాలు బాదేసే అతను.. రెండున్నరేళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయలేదంటే ఎంతగా ఇబ్బంది పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. కానీ ఏడాది నుంచి అతడి ప్రదర్శన మెరుగుపడుతూ వస్తోంది. ఈ ఏడాది మంచి ఊపులో ఉన్నాడు విరాట్‌. 2023లో అతను అయిదు సెంచరీలు సాధించాడు. ప్రపంచకప్‌ ముంగిట మంచి లయలో ఉన్నాడు. 2011 విజేత జట్టులో సభ్యుడైనప్పటికీ.. అప్పుడు అతడి పాత్ర పరిమితం. ఈసారి బ్యాటింగ్‌లో అతను ఎంతో కీలకం. విరాట్‌ ఇంకో ప్రపంచకప్‌ ఆడతాడా అన్నది సందేహమే. సొంతగడ్డపై మరో కప్పుతో వన్డే కెరీర్‌కు ముగింపు పలుకుతాడేమో చూడాలి.

స్మిత్‌ ‘గ్రేట్‌’

కోహ్లి లాగే స్టీవ్‌ స్మిత్‌ కూడా ఇప్పటికే ఓ ప్రపంచకప్‌ నెగ్గాడు. 2015 ప్రపంచకప్‌ విజేత జట్టులో అతను సభ్యుడు. అయితే అప్పుడు అతడి కెరీర్‌ పతాక స్థాయిలో ఉండేది. కానీ కొన్నేళ్ల తర్వాత బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణం వల్ల అతడి ప్రతిష్ట మసకబారింది. ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి పునరామగనం చేసి మళ్లీ నిలకడగా ఆడుతూ పోయిన గౌరవాన్ని సంపాదించాడు. యాషెస్‌లోనూ జట్టును గెలిపించాడు. అయితే టెస్టుల్లో మేటి బ్యాటర్‌ అయినప్పటికీ.. వన్డేల్లో అతడి ప్రదర్శన అంచనాలకు తగ్గట్లు లేదు. ఈసారి ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన చేసి.. జట్టును గెలిపిస్తే ఈ ఫార్మాట్లోనూ స్మిత్‌ ‘గ్రేట్‌’గా గుర్తింపు సంపాదిస్తాడు.

కేన్‌ @ అందరివాడు

దేశంతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే క్రికెటర్లలో కేన్‌ విలియమ్సన్‌ ఒకడు. జెంటిల్మన్‌ ఆటను జెంటిల్మన్‌లా ఆడే కేన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. టెస్టుల్లోనే కాక వన్డేల్లోనూ అతను మేటి బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నాడు. కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ జట్టును కూడా గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు. కాకపోతే ఆ జట్టు ప్రపంచకప్‌ కలను మాత్రం నెరవేర్చలేకపోయాడు. గత రెండు టోర్నీల్లోనూ కివీస్‌ రన్నరప్‌ ట్రోఫీకే పరిమితమైంది. కేన్‌ ఆడబోయే చివరి ప్రపంచకప్‌ ఇదే. ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలని అతను, కివీస్‌ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఐపీఎల్‌లో గాయపడి ఒక దశలో ప్రపంచకప్‌కే అనుమానంగా మారిన కేన్‌.. తర్వాత వేగంగా కోలుకుని టోర్నీకి అందుబాటులోకి రావడం అభిమానులకు ఉపశమనం. మరి కప్పులో అతనెలాంటి ప్రదర్శన చేస్తాడో?

మరో కప్పు అందిస్తాడా?

ఫ్యాబ్‌-4లో ఒకప్పుడు వన్డేలకు సరిపోడనే విమర్శలు ఎదుర్కొన్న ఆటగాడు జో రూట్‌. టెస్టుల్లో గొప్ప ఘనతలెన్నో సాధించినా.. వన్డేల్లో మరీ నెమ్మదిగా ఆడుతుండటంతో అతడిపై వేటు పడింది. కానీ మారిన ఇంగ్లాండ్‌ జట్టు శైలికి తగ్గట్లు అతను కూడా దూకుడు పెంచాడు. మిగతా ఇంగ్లాండ్‌ బ్యాటర్లకు దీటుగా ధాటిగా ఆడటం మొదలుపెట్టాడు. టీ20 స్పెషలిస్టుల తరహాలో రివర్స్‌ స్వీప్‌లు, స్కూప్‌లు కూడా ఆడేస్తున్నాడు. వన్డేలకు అవసరమైన వేగం, నిలకడగా రూట్‌ ఈ ఫార్మాట్లోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. ప్రపంచకప్‌లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్న రూట్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న తన జట్టుకు మరో కప్పు అందిస్తాడేమో చూడాలి.

నంబర్‌వన్‌ అనిపించుకుంటాడా?

ప్రస్తుతం వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామే. గత కొన్నేళ్లలో అతను వేగంగా ఎదిగాడు. విరాట్‌ను మించి పరుగుల వరద పారిస్తూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించాడు. అయితే ఎక్కువగా సొంతగడ్డపై, సెకండ్‌ హోమ్‌ అనదగ్గ యూఏఈలో మాత్రమే అతను రాణిస్తాడని.. అందుకే అతడి సగటు ఎక్కువగా ఉంటుందని.. బౌలింగ్‌కు ఎక్కువ అనుకూలించే పిచ్‌లపై సత్తా చాటలేడని విమర్శలు ఉన్నాయి. భారత్‌లో ఆడిన అనుభవం లేని బాబర్‌.. ప్రపంచకప్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరం. తనేంటో ప్రపంచానికి చాటడానికి వచ్చిన మంచి అవకాశాన్ని బాబర్‌ ఎంతమేర ఉపయోగించుకుంటాడో మరి? 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని