Delhi vs Rajasthan: దిల్లీ ధమాకా.. రాజస్థాన్‌పై అలవోక విజయం

ఒక విజయం.. వెంటనే ఒక పరాజయం.. మళ్లీ గెలుపు.. ఆ తర్వాత తిరిగి ఓటమి బాట.. ఇదీ ఈ సీజన్లో దిల్లీ ఆటతీరు. ఇలా పడిలేస్తూ సాగుతున్న ఆ జట్టు గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో పరాభవం తర్వాత గొప్పగా పుంజుకుంది.

Updated : 12 May 2022 06:35 IST

మార్ష్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులు
రాణించిన వార్నర్‌, సకారియా

ఒక విజయం.. వెంటనే ఒక పరాజయం.. మళ్లీ గెలుపు.. ఆ తర్వాత తిరిగి ఓటమి బాట.. ఇదీ ఈ సీజన్లో దిల్లీ ఆటతీరు. ఇలా పడిలేస్తూ సాగుతున్న ఆ జట్టు గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో పరాభవం తర్వాత గొప్పగా పుంజుకుంది. ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజ వేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించింది. మొదట బౌలర్లు సమష్టిగా రాణించి  రాజస్థాన్‌ను ఓ మోస్తరు స్కోరుకు కట్టడి చేస్తే.. అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి ఆరో విజయాన్ని (12 మ్యాచ్‌ల్లో) ఖాతాలో వేసుకుంది దిల్లీ. మిచెల్‌ మార్ష్‌  టీ20 లీగ్‌లో తొలిసారిగా ఆల్‌రౌండ్‌ పాత్రకు న్యాయం చేయడం మ్యాచ్‌లో హైలైట్‌.

ముంబయి

టీ20లీగ్‌ దశ చివర్లో ప్లేఆఫ్‌ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇంకో విజయం సాధిస్తే బెర్తు ఖరారయ్యే స్థితిలో రాజస్థాన్‌ సాధారణ ప్రదర్శన చేయగా.. ఇంకో మ్యాచ్‌ ఓడితే ప్లేఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యే స్థితిలో దిల్లీ ఆల్‌రౌండ్‌ జోరుతో అదరగొట్టింది. బుధవారం దిల్లీ 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. మొదట రాజస్థాన్‌ 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. అశ్విన్‌ (50; 38 బంతుల్లో 4×4, 2×6) రాణించారు. దిల్లీ బౌలర్లలో చేతన్‌ సకారియా (2/23), మిచెల్‌ మార్ష్‌ (2/25), నోకియా (2/39) సత్తా చాటారు. అనంతరం మార్ష్‌ (89; 62 బంతుల్లో 5×4, 7×6) బ్యాటుతోనూ అదరగొట్టడం, వార్నర్‌ (52 నాటౌట్‌; 41 బంతుల్లో 5×4, 1×6) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడడంతో దిల్లీ 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 12 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కిది అయిదో ఓటమి.

అదృష్టం తోడై..: ఆస్ట్రేలియా తరఫున, వేరే టీ20 లీగ్స్‌లో అదరగొట్టినా.. టీ20 లీగ్‌లో మిచెల్‌ మార్ష్‌ ఇప్పటిదాకా ప్రభావం చూపిందే లేదు. ఆడింది తక్కువ మ్యాచ్‌లు. వాటిలోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ బుధవారం మాత్రం అతను బంతితోనే కాక బ్యాటుతోనూ అదరగొట్టాడు. తొలి ఓవర్లోనే శ్రీకర్‌ భరత్‌ (0)ను బౌల్ట్‌ ఔట్‌ చేయడం, 3 ఓవర్లకు దిల్లీ 5 పరుగులే చేయడంతో విజయంపై ఆశలు పెంచుకున్న రాయల్స్‌కు మార్ష్‌.. విధ్వంసక ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను దూరం చేశాడు. అయితే ఆరంభంలో అతను బాగా ఇబ్బంది పడ్డాడు. 12 బంతుల్లో 4 పరుగులే చేశాడు. మార్ష్‌ ఒక్క పరుగుకే వెనుదిరగాల్సింది. అతను బౌల్ట్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఎల్బీ అప్పీల్‌ను అంపైర్‌ తిరస్కరించాడు. రాజస్థాన్‌ కూడా సమీక్షకు వెళ్లలేదు. కానీ రీప్లే చూస్తే బంతి.. బ్యాట్‌ కంటే ముందు ప్యాడ్‌కు తాకిందని, ప్లంబ్‌ అని తేలింది. ఈ అవకాశాన్ని మార్ష్‌ పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో జోరందుకున్న అతను.. తర్వాత ఎక్కడా ఆగలేదు. మరో ఎండ్‌లో వార్నర్‌ చాలాసేపు వేగమందుకోలేదు. నెమ్మదిగా అతనూ జోరు పెంచడంతో లక్ష్యం దిశగా దిల్లీ పరుగులు పెట్టింది. వార్నర్‌కు కూడా రెండు జీవనదానాలు లభించాయి. విజయానికి 18 బంతుల్లో 17 పరుగులే అవసరమైన స్థితిలో మార్ష్‌ ఔటైనా.. పంత్‌ (13 నాటౌట్‌) వచ్చి రాగానే రెండు సిక్సర్లు బాదడంతో మ్యాచ్‌ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.

రాణించిన పడిక్కల్‌, అశ్విన్‌: మొదట రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ ఒడుదొడుకులతో సాగింది. దిల్లీ బౌలర్లు ఆరంభంలో చాలా కట్టుదిట్టంగా బంతులేయడంతో ఓపెనర్లు బట్లర్‌, యశస్వి బాగా ఇబ్బంది పడ్డారు. షాట్లకు అవకాశం దొరక్కపోవడంతో అసహనానికి గురైన బట్లర్‌ (7).. అడ్డదిడ్డంగా ఆడాడు. ఆ ప్రయత్నంలోనే సకారియా బౌలింగ్‌లో శార్దూల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఒక సిక్స్‌ కొట్టి జోరందుకున్నట్లు కనిపించిన యశస్వి (19) కూడా తర్వాత ఇబ్బంది పడి.. మిచెల్‌ మార్ష్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అతను ఔటయ్యే సమయానికి రాజస్థాన్‌ 8.1 ఓవర్లలో 54 పరుగులే చేసింది. ఈ దశలో అశ్విన్‌, పడిక్కల్‌ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్‌ టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ లాగే ఆడాడు. చక్కటి షాట్లతో అలరించాడు. కాకపోతే అతడి బ్యాటింగ్‌ ఓ మోస్తరు వేగంతోనే సాగింది. క్రీజులో కుదురుకున్నాక పడిక్కల్‌ దూకుడు పెంచాడు. 14 ఓవర్లకు రాజస్థాన్‌ 107/2తో నిలిచింది. ఈ దశలో అశ్విన్‌ ఔట్‌ కాగా.. శాంసన్‌ రాకతో స్కోరు బోర్డు పరుగులు పెడుతుందనుకుంటే దానికి భిన్నంగా జరిగింది. అతను 6 పరుగులే చేసి ఔటయ్యాడు. రియాన్‌ పరాగ్‌ (9) మెరుపులు ఒక సిక్సర్‌కే పరిమితం అయ్యాయి. ఓ ఎండ్‌లో పడిక్కల్‌ ధాటిగానే ఆడుతున్నా.. అతడికి సహకారం అందలేదు. వాండర్‌డసెన్‌ (12) కూడా ధాటిగా ఆడలేకపోవడంతో రాజస్థాన్‌ ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని