ఆట.. స్టైల్‌లో..ఆల్‌రౌండర్‌!

ఆ కుర్రాడు గల్లీలో బ్యాట్‌ పట్టి ఆడితే.. ప్రతిసారీ బంతి పక్కింట్లో పడేది! వాళ్లొచ్చి గొడవ పడేవారు. ఆ పోరు పడలేక.. అబ్బాయిని  దూరంగా ఉన్న పెద్ద మైదానానికి తీసుకెళ్లేవారు నాన్న. అక్కడా.. అలవోకగా బౌండరీలు బాదేసేవాడు. అలా ఆ ప్రతిభ అంచెలంచెలుగా ఐపీఎల్‌ దాకా చేరింది.

Updated : 27 Apr 2024 14:03 IST

ఆ కుర్రాడు గల్లీలో బ్యాట్‌ పట్టి ఆడితే.. ప్రతిసారీ బంతి పక్కింట్లో పడేది! వాళ్లొచ్చి గొడవ పడేవారు. ఆ పోరు పడలేక.. అబ్బాయిని  దూరంగా ఉన్న పెద్ద మైదానానికి తీసుకెళ్లేవారు నాన్న. అక్కడా.. అలవోకగా బౌండరీలు బాదేసేవాడు. అలా ఆ ప్రతిభ అంచెలంచెలుగా ఐపీఎల్‌ దాకా చేరింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో హీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన అతగాడు, రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు. ఆ క్రికెటరే.. కాకి నితీశ్‌కుమార్‌ రెడ్డి.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అచ్చ తెలుగు ఆటగాళ్ల సంఖ్య వేళ్ల మీద లెక్కించొచ్చు. ఆ కొందరిలో వేగంగా దూసుకొస్తున్న యువ ఆటగాడు విశాఖపట్నం వాసి నితీశ్‌. అతగాడి సత్తాకి గీటురాయిగా ఉగాది రోజు జరిగిన మ్యాచ్‌ని చెప్పొచ్చు. హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ అది. జట్టులోని కీలక బ్యాటర్లు పెవీలియన్‌ చేరినప్పుడు ఇరవయ్యేళ్ల నితీశ్‌ క్రీజులోకి వచ్చాడు. ఏమాత్రం బెదురు లేకుండా 32 బంతులకే 50 పరుగులు తీశాడు. బౌలింగ్‌లోనూ రాణించి, జట్టును గెలుపు తీరం చేర్చాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఆ ఒక్క ప్రదర్శనతో తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఫ్యాన్‌ బేస్‌ క్రియేట్‌ చేసుకొని, సామాజిక మాధ్యమాల్లో సంచలనం అయ్యాడు.

కన్నవాళ్ల త్యాగాలతో..

ప్రతి విజేత వెనకాల ఎంతో కష్టం ఉంటుంది అన్నది ఎంత నిజమో.. కన్నవాళ్ల త్యాగాలూ ఉంటాయన్నది అంతే వాస్తవం. నితీశ్‌ ఈ స్థాయికి చేరడంలో అమ్మానాన్నల పాత్ర ముఖ్యమైంది. అతడి నాన్న ముత్యాలరెడ్డికి ఆటలంటే ప్రాణం. చిన్నప్పుడు కబడ్డీ బాగా ఆడేవారు. మోకాలి సమస్య కారణంగా ఆటకు దూరమయ్యారు. తన ఆశ, ఆశయాన్ని కొడుకులో చూసుకోవాలనుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో నితీశ్‌ క్రికెట్‌ ఆడుతుంటే.. అతడు కొట్టే ప్రతి బంతీ పక్కింట్లో పడేది. వారు నితీశ్‌ అమ్మతో గొడవ పెట్టుకునేవారు. ఆ కుర్రాడి ‘పవర్‌’ చూసిన నాన్న.. కొడుకును క్రికెటర్‌ చేయాలని అప్పుడే అనుకున్నారు. సమీపంలోని జింక్‌ మైదానానికి తీసుకెళ్లి ప్రాక్టీస్‌ చేయించేవారు. అక్కడ కోచ్‌ సలహాతో ఏసీఏ-వీడీసీఏ స్టేడియంకి తీసుకెళ్లి శిక్షణ ఇప్పించేవారు. అందుకోసం రోజూ 25 కి.మీ. దూరం తీసుకెళ్లి, పని పూర్తయ్యేవరకూ అక్కడే కూర్చునేవారు. నితీశ్‌ జిల్లా జట్టుకు ఆడుతు న్నప్పుడు ముత్యాలరెడ్డికి రాజస్థాన్‌ బదిలీ చేశారు. అప్పటికి ఆయన హిందుస్థాన్‌ జింక్‌ సంస్థలో ఉద్యోగి. నేను లేకపోతే కుమారుడి కెరియర్‌ ఇబ్బందుల్లో పడుతుందని ఉద్యోగాన్నే వదులుకున్నారాయన. రాణిస్తాడో, లేదో తెలియని కొడుకు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వదులుకోవడమేంటని బంధువులు, సన్నిహితులు మందలించారు. అయినా కొడుకు కోసం ఆ తండ్రి అవేమీ పట్టించుకోలేదు. అప్పుడే కన్నవాళ్ల త్యాగానికి విలువ దక్కేలా మంచి క్రికెటర్‌గా ఎదగాలనుకున్నాడు. మనసు పెట్టి సాధన చేసేవాడు నితీశ్‌.

గాయాలు ఓర్చుకొని..

ఎంతో కష్టపడి రాటుదేలిన నితీశ్‌ పద్నాలుగేళ్లకే ఆంధ్ర జట్టుకి ఆడాడు. చీఫ్‌ కోచ్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ సూచనతో కడపలోని ఏసీఏ అకాడమీకి వెళ్లాడు. అక్కడ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ నైపుణ్యం సాధించాడు. అండర్‌-16లో ఒకే ఏడాదిలో 1,237 పరుగులు చేయడంతోపాటు.. 26 వికెట్లు తీశాడు. అందులో త్రిబుల్‌, డబుల్‌ సెంచరీలున్నాయి. ఇలా మంచి ప్రదర్శన చేస్తూ... ఐపీఎల్‌, భారత క్రికెట్‌ జట్టు తలుపు తట్టాలని ఎదురు చూస్తున్న సమయంలోనే గతేడాది ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో చీలమండకు తీవ్ర గాయమైంది. కోలుకోవడానికి.. మూడు నెలలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలన్నారు వైద్యులు. ఇవేమీ పట్టించుకోకుండా ఫిజియోథెరపిస్టులు, జిమ్‌ శిక్షకుల సహాయంతో నితీశ్‌ కష్టపడ్డాడు. కాలిపై భారం పడకుండా అప్పర్‌ బాడీ వర్కవుట్లు చేస్తూ.. రెండు నెలల్లోనే పూర్తిగా కోలుకున్నాడు. అప్పటికే ఐపీఎల్‌ యాజమాన్యాల దృష్టిలో పడటంతో, గతేడాది వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌.. నితీశ్‌ని రూ.20 లక్షలకు దక్కించుకుంది. గత సీజన్‌లో కేవలం రెండు మ్యాచుల్లోనే బౌలింగ్‌ చేసే అవకాశం రాగా.. ఈసారి మాత్రం బ్యాటు, బంతి.. రెండింటితోనూ మాయ చేస్తున్నాడు.

  • ఐపీఎల్‌తో వచ్చిన డబ్బుతో అమ్మానాన్నలకు కారు కొనిచ్చా.
  • ప్రస్తుతం ప్రైవేటుగా డిగ్రీ చదువుతున్నా.
  • జట్టు సభ్యులందరితో సరదాగా ఉంటా. విదేశీ ఆటగాళ్లకు తెలుగు పదాలు నేర్పుతున్నా. ద్విచక్రవాహనాలంటే పిచ్చి అందులోనూ కేటీఎం డ్యూక్ అంటే చాలా ఇష్టం.
  • పవన్ కల్యాణ్ సినిమాలోని పాటలంటే ఇష్టం.. నచ్చిన ఆటగాడు కోహ్లి.
  • ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డోను ఆరాధిస్తా
  • కొత్త స్టైల్స్‌ని ఫాలో అవుతా. జుట్టుతో ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం.
  • రోజూ గంటసేపైనా జిమ్‌ చేస్తా. నచ్చినవన్నీ తింటా
  • ప్రేమ, పెళ్లికింకా చాలా సమయముంది
  • అండర్‌-16లో మెరుగైన ప్రదర్శనతో పదిహేనేళ్లకే బీసీసీఐ ఉత్తమ జూనియర్‌ క్రికెటర్‌గా ఎంపికయ్యా.

-కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు