TG News: తెలంగాణలో కుండపోత వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

Eenadu icon
By Telangana News Team Updated : 29 Oct 2025 20:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరంగల్‌- ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరింది. ప్రధాన రహదారిపై వర్షం నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. వరంగల్‌లోని శివనగర్‌, మైసయ్య నగర్‌, ఎన్‌ఎన్‌ నగర్‌, లక్ష్మీగణపతి, విశ్వనాథ్‌ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, స్టేషన్‌రోడ్‌, బట్టల బజార్‌లో రోడ్లపైకి వరదనీరు చేరింది. వరంగల్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద వరద నీరు బారీగా నిలిచింది. శివనగర్‌లో రహదారిపై వరద నీటితో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్‌ బస్టాండ్‌ చెరువును తలపిస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల దృష్ట్యా హనుకొండ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం 79819 75495 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. వరంగల్‌ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెం.మీ వర్షపాతం నమోదైంది.

హనుమకొండ ఎన్జీవోస్‌ కాలనీలో..

8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తాజాగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఖమ్మం- మహబూబాబాద్ జిల్లాల మధ్య నిలిచిన రాకపోకలు

ఖమ్మం- మహబూబాబాద్ జిల్లాల మధ్య వాల్యాతండా సమీపంలోని వంతెనకు ఆనుకుని ఆకేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో ఇవాళ సాయంత్రం నుంచి రెండు జిల్లాల మధ్య అధికారులు రాకపోకలు నిలిపివేశారు.

ఖమ్మం- మహబూబాబాద్‌ జిల్లా మధ్య ఆకేరు వాగు ఉద్ధృతి

Tags :
Published : 29 Oct 2025 18:57 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని