AUS vs IND: రాణించిన వాషింగ్టన్‌ సుందర్‌.. టీమ్‌ఇండియా ఘన విజయం

Eenadu icon
By Sports News Team Updated : 02 Nov 2025 18:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమ్ఇండియా 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ (49*; 23 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. తిలక్‌ వర్మ (29; 26 బంతుల్లో, 1 ఫోర్‌, 1 సిక్స్‌), అభిషేక్‌ శర్మ (25; 16 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (24; 11 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. ఈ విజయంతో అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.

టీమ్‌ ఇండియా తన బ్యాటింగ్‌ను దూకుడుగా ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్‌ శర్మ మొదటి రెండు ఓవర్లలో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అయితే దురదృష్టవశాత్తు అభిషేక్‌.. నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌లో (3.3) వికెట్‌ కీపర్‌ ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే శుభ్‌మన్‌ గిల్‌ (15) ఎల్లిస్‌ బౌలింగ్‌లోనే (5.3) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్‌లో విఫలమైన గిల్‌.. మూడో మ్యాచ్‌లోనూ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. మంచి టచ్‌లో కనిపించిన సూర్యకుమార్‌ యాదవ్‌ స్టాయినిస్‌ బౌలింగ్‌లో (7.3) నాథన్‌ ఎల్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తనకు లభించిన ఆరంభాన్ని తిలక్‌ వర్మ పెద్ద స్కోర్‌గా మలచలేకపోయాడు. జేవియర్‌ బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో జోష్‌ ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అక్షర్‌ పటేల్‌ (17) సైతం తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. త్రుటిలో హాఫ్‌సెంచరీని మిస్‌చేసుకున్న వాషింగ్టన్‌ సుందర్‌ చివరి వరకు క్రీజులో పాతుకుపోయి, టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించాడు. జితేశ్ శర్మ (22*) టీమ్ఇండియా విజయంలో తన వంతు పాత్రపోషించాడు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఎల్లిస్‌ 3, జేవియర్‌ బార్ట్‌లెట్‌, మార్కస్‌ స్టాయినిస్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. 

ఆసీస్ బ్యాటింగ్ విషయానికొస్తే.. టాప్-3 బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (6), మిచెల్ మార్ష్‌ (11), జోష్‌ ఇంగ్లిస్ (1) త్వరగా పెవిలియన్ చేరగా.. టిమ్ డేవిడ్ (74; 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), మార్కస్ స్టాయినిస్ (64; 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మాథ్యూ షార్ట్ (26*) పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి 2, శివమ్‌ దూబె ఒక వికెట్‌ తీశారు.

Tags :
Published : 02 Nov 2025 17:15 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు