రైతు ఐక్యతకు వేదిక

అధునాతన డిజిటల్‌ సౌకర్యాలతో రైతులకు ఉపయోగపడేలా వీటిని నిర్మించాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు రూపుదిద్దుకున్నాయి. కొత్తగా ఏర్పాటైన ఈ వేదికల ద్వారా రాష్ట్రంలోని రైతులందరితో ఒకేసారి ఆన్‌లైన్‌ ద్వారా సమావేశమై ...

Updated : 31 Oct 2020 11:14 IST

పంటల సాగుపై గ్రామస్థాయిలో చర్చలకు అవకాశం
ఆధునిక పరిజ్ఞానం, ఆన్‌లైన్‌ సమావేశాలకు మందిరం
రైతు వేదికల నిర్మాణంతో కొత్తశకం.. నేడు ప్రారంభించనున్న సీఎం
ఈనాడు - హైదరాబాద్‌

గ్రామస్థాయిలో అన్నదాతలంతా ఓ చోట చేరి కష్టనష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఏర్పాటైన ఆధునిక మందిరాలే రైతు వేదికలు. రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంలో భాగంగా వారిని చైతన్య పరిచేందుకు ప్రతి ఐదువేల ఎకరాలకొకటి చొప్పున కూడలి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వీటిని నిర్మించింది. ప్రభుత్వ నిధులే కాకుండా ప్రజాప్రతినిధులూ ఈ బృహత్తర కార్యక్రమానికి విరాళాలను అందజేశారు.

ధునాతన డిజిటల్‌ సౌకర్యాలతో రైతులకు ఉపయోగపడేలా వీటిని నిర్మించాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు రూపుదిద్దుకున్నాయి. కొత్తగా ఏర్పాటైన ఈ వేదికల ద్వారా రాష్ట్రంలోని రైతులందరితో ఒకేసారి ఆన్‌లైన్‌ ద్వారా సమావేశమై ప్రభుత్వ పథకాలు, ఆధునిక పరిజ్ఞానాన్ని వివరించాలన్నది వ్యవసాయశాఖ లక్ష్యం. జనగామ జిల్లా కొడకండ్లలో శనివారం సీఎం కేసీఆర్‌ రైతువేదిక భవనాన్ని ప్రారంభించనున్నారు. 5000 మంది రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సమగ్ర వివరాలతో కథనం..
* ప్రతి జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో వ్యవసాయ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు వీటిని నిర్మించారు.
* ఒక్కో రైతువేదికలో 2,046 చదరపు అడుగుల స్థలం ఉంది. సమావేశ మందిరంతోపాటు రెండుగదులు, రెండుమరుగుదొడ్లు నిర్మించారు.
* మిషన్‌ భగీరథ పథకం నుంచి మంచి నీరు, విద్యుత్‌ సంస్థలు కరెంటు కనెక్షన్లు ఇస్తున్నాయి.
* ఒక్కో వేదిక నిర్మాణానికి రూ.22 లక్షలు కేటాయించారు. ఇందులో వ్యవసాయ శాఖ రూ.12 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలు సమకూర్చారు.

వేదికల్లో ఏం చేయాలంటే..
* పంటల సాగుకు అవసరమైన అధునాతన పరిజ్ఞానాన్ని అందించి పంటల ఉత్పాదకత పెంచడానికి, గిట్టుబాటు ధరలు పొందేలా చూసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ వేదికలు ఉపయోగపడాలి.
* ప్రభుత్వానికి, గ్రామస్థాయిలో ఉండే రైతులకు మధ్య వారధిలా ఇవి పనిచేయాలి.
* వ్యవసాయశాఖలో ప్రతి ఐదువేల ఎకరాలకు ఒకరి చొప్పున పనిచేస్తున్న ‘వ్యవసాయ విస్తరణ అధికారులు’(ఏఈఓ) ఈ భవనంలో కార్యాలయం ఏర్పాటుచేసుకుని రైతులకు అందుబాటులో ఉండాలి.
* రైతులకు పంటరుణాలు, పథకాల రాయితీలు సక్రమంగా అందేందుకు వేదికలు సేవలందించాలి.


ఇదొక అద్భుత ఆలోచన
- జనార్దన్‌రెడ్డి ముఖ్య కార్యదర్శి, వ్యవసాయశాఖ

రైతువేదికల నిర్మాణం ఓ అద్భుతమైన ఆలోచన. వ్యవసాయ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఏఈఓలుగా గ్రామస్థాయిలో వేదికల ద్వారా పనిచేయడం ఈ రంగ అభివృద్ధికి మంచి అవకాశం. ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుంది. అవసరమైన పరిజ్ఞానాన్ని రైతులకు అందించడానికి ఈ వేదికలు ఎంతగానో ఉపకరిస్తాయి. వీటిద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేశాం.


రైతు వేదికల ముఖచిత్రం

*  మొత్తం నిర్మించాల్సిన వేదికలు : 2,601 (గ్రామాల్లో 2462, పట్టణాల్లో 139)
*  ఇప్పటివరకు పూర్తయినవి : 1,951
*  నిర్మాణంలో ఉన్నవి : 650
*  వీటి కోసం రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులు : రూ.572.22 కోట్లు
*  పూర్తిగా విరాళాల సొమ్ముతో  నిర్మించేవి : 23
*  ఎన్ని చోట్ల భూమి ఉచితంగా లభించింది : 139


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని