Updated : 06/10/2021 09:26 IST

ఆగని ప్రకంపనలు

ప్రియాంక, మరో పది మందిపై కేసులు
లఖింపుర్‌ ఖేరి ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌

దిల్లీ, లఖ్‌నవూ, సీతాపుర్‌, ఈనాడు-లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మంగళవారమూ 144వ సెక్షన్‌ అమలైంది. ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు కొనసాగాయి. ఘటన చోటుచేసుకున్న తికోనియాలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అక్కడికి చేరుకునే అన్ని మార్గాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. మృతిచెందిన రైతుల పోస్టుమార్టం నివేదిక తీవ్ర వివాదాస్పదమైంది. రైతు సంఘం నేత రాకేశ్‌ టికాయిత్‌ అధికారులతో చర్చలు జరపడంతో ముగ్గురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాజకీయంగానూ పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ నిర్బంధం కొనసాగింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న ఆరోపణలపై... ఆమెతో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు లేఖ రాశారు. తన కుమారుడు దర్యాప్తు సంస్థల ముందు హాజరుకావడానికి సిద్ధమని కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర వెల్లడించారు. ఘటనపై పలు పార్టీల నేతలు మండిపడ్డారు. ప్రియాంకను వెంటనే విడుదల చేయాలని, మంత్రి కుమారుడిని అరెస్టు చేయాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు.

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ... లఖింపుర్‌ ఖేరి జిల్లాలోని తికోనియా-బన్బీర్‌పుర్‌ రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులపైకి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారు, మరో వాహనం దూసుకెళ్లడం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన అన్నదాతల దాడిలో మరో నలుగురు చనిపోవడం... దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ప్రియాంకా గాంధీ ఇంకా సీతాపుర్‌లోని పీఏసీ అతిథి గృహంలోనే ఉన్నారు. అక్కడ డ్రోన్లతో నిఘా పెట్టారంటూ పార్టీ జాతీయ కార్యదర్శి ధీరజ్‌ గుర్జార్‌ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.

ప్రమాదంలో రాజ్యాంగం: రాహుల్‌

రైతులపైకి వాహనం దూసుకెళ్లిన వీడియోను రాహుల్‌ ఫేస్‌బుక్‌లో పోస్టుచేశారు. ‘‘ఈ వీడియోను చూసిన తర్వాతైనా నిందితుడిని కస్టడీలోకి తీసుకోకుంటే, మన రాజ్యాంగం ప్రమాదంలో పడినట్టే. ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే మహిళా నేతను 30 గంటలు నిర్బంధిస్తే, రాజ్యాంగం ప్రమాదంలో పడినట్టే. ఈ వీడియో ఎవర్నీ చలింపజేయకపోతే, మానవత్వమూ ప్రమాదంలో పడినట్టే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రియాంక నిజమైన కాంగ్రెస్‌వాది అని, ఓటమిని అంగీకరించని ధీరవనిత అని, సత్యాగ్రహాన్ని ఆపరని పేర్కొన్నారు. భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ కూడా రైతులపైకి వాహనం దూసుకెళ్లిన వీడియోను ట్వీట్‌ చేశారు. పోలీసులు వెంటనే ఆ వాహన యజమానిని, అందులో ఉన్నవారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే ధర్నా చేశారు.

మళ్లీ పోస్టుమార్టం చేయాలి..

గాయాల కారణంగానే నలుగురు రైతులు మృతిచెందినట్టు పోస్టుమార్టం నివేదిక పేర్కొనడంపై బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. తూటాల కారణంగానే గాయపడి మరణించారని, మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టారు. రైతు సంఘం నేత టికాయిత్‌ అధికారులతో చర్చలు జరిపారు. లవ్‌ప్రీత్‌సింగ్‌(19), నచత్తర్‌ సింగ్‌(65), దల్జీత్‌సింగ్‌(42)ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబ సభ్యులు అంగీకరించారు. గుర్విందర్‌ సింగ్‌(22) మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ముగ్గురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. 8 మంది మృతుల్లో.. టీవీ జర్నలిస్ట్‌ రామన్‌ కశ్యప్‌ కూడా ఉన్నారు.


నా కుమారుడు విచారణకు సిద్ధం: అజయ్‌ మిశ్ర

తాజా పరిణామాల నేపథ్యంలో అజయ్‌ మిశ్ర స్పందించారు. దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యేందుకు తన కుమారుడు ఆశిష్‌ సిద్ధమని వెల్లడించారు. ‘‘ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆధారాల సేకరణలో వాస్తవాలు బయటపడతాయి. రైతులపైకి కారు నడిపిన వ్యక్తిని కొట్టి చంపేశారు. నా కుమారుడు అక్కడే ఉంటే.. అదే జరిగేది కదా. దర్యాప్తు అధికారులు మా ఫోన్‌ రికార్డులు, మొబైల్‌ ఫోన్‌ లొకేషన్లు పరిశీలించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.


విచారణ కోరుతూ సీజేఐ జస్టిస్‌ రమణకు లేఖ

లఖింపుర్‌ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు న్యాయవాదులు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు లేఖ రాశారు. ‘‘దీన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా భావించండి. రైతుల మృతికి కారణమైన సంఘటనపై సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో, నిర్ణీత గడువులోగా సీబీఐతో విచారణ జరిపించండి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దోషులకు శిక్ష విధించాలని హోంశాఖను ఆదేశించండి’’ అని న్యాయవాదులు శివ్‌ కుమార్‌ త్రిపాఠి, సీఎస్‌ పాండాలు ఈ లేఖ రాశారు.


మోదీజీ! మీరు ఈ వీడియో చూడలేదా?: ప్రియాంక

టనా స్థలం వద్ద రైతులపైకి ఎస్‌యూవీ వాహనం దూసుకెళ్లిన దృశ్యాన్ని రాహుల్‌, ప్రియాంకలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ‘‘మోదీజీ! ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదుకాని నన్ను మీ ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది. రైతులపై వాహనంతో దూసుకెళ్లి, వారి మరణానికి కారణమైన వ్యక్తిని మాత్రం ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయలేదు? ఈ వీడియోను చూశారా? మీ ప్రభుత్వంలోని మంత్రి కుమారుడు రైతులపైకి ఎలా దూసుకెళ్లాడో చూడండి. ఆ మంత్రిని ఇంతవరకూ ఎందుకు తొలగించలేదో, ఆయన కుమారుడిని ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పండి. అన్నదాతలే దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు. వారి కుమారులు సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు. మీరు అమృతోత్సవాల్లో పాల్గొనేందుకు లఖ్‌నవూ వస్తున్నారు. లఖింపుర్‌ ఖేరికి కూడా వచ్చి, రైతుల ఆవేదన వినండి. వారికి న్యాయం చేయండి. ఇది మీ బాధ్యత’’ అని ప్రియాంక ట్విటర్‌లో పేర్కొన్నారు. తనను అక్రమంగా నిర్బంధించారని, 38 గంటలు దాటినా ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వలేదని, ఏ న్యాయమూర్తి ముందూ తనను హాజరుపరచలేదని, కనీసం న్యాయవాదులనైనా కలవనీయలేదని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నుంచి అతిథిగృహ ద్వారం వద్దే ప్రియాంక నుంచొని నిరసన వ్యక్తంచేశారు. ఘటనాస్థలానికి వెళ్లాలన్న పట్టుదల వీడాలని, దిల్లీ లేదా లఖ్‌నవూ వెళ్లిపోవాలని ప్రియాంకను అధికారులు కోరారు. అందుకామె అంగీకరించలేదు. ఘటనలో మృతిచెందిన రైతులు, టీవీ విలేకరి కుటుంబ సభ్యులతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని