హైదరాబాద్‌ స్టేషన్లపై ఒత్తిడి తగ్గే అవకాశం

ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్న హైదరాబాద్‌ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ఈ ముత్యాల నగరం చుట్టూ రైలుమార్గం నిర్మించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Published : 29 Jun 2023 05:03 IST

కొత్త ప్రతిపాదన కార్యరూపందాల్చితే మహర్దశ

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్న హైదరాబాద్‌ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ఈ ముత్యాల నగరం చుట్టూ రైలుమార్గం నిర్మించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సుమారు రూ.15 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ప్రతిపాదిత అవుటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే హైదరాబాద్‌లో రవాణా అధారిత అభివృద్ధికి చోదక శక్తి లభిస్తుంది. తెలంగాణకు 563.5 కి.మీ. కొత్త మార్గం ఒనగూరుతుంది. ఇప్పటివరకు రైలుమార్గం లేని చిట్యాల వంటి పట్టణాలకు కొత్తగా రైళ్లు అందుబాటులోకి తేవచ్చు. ముఖ్యంగా నగరంలోని రైల్వేస్టేషన్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. కొత్తగా మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టేందుకు వెసులుబాటు లభిస్తుంది.

ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది...

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ స్టేషన్లపై ఇప్పటికే తీవ్ర ఒత్తిడి ఉంది. నగరంలోకి వస్తున్న రైళ్లు సిగ్నల్‌ కోసం శివారు ప్రాంతాల్లో చాలాసేపు ఎదురుచూస్తున్నాయి. దీంతో చాలామంది ప్రయాణికులు అక్కడే రైళ్లే దిగి ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు చేరాల్సి వస్తోంది. అవుటర్‌ రింగ్‌ రైలు మార్గం సాకారమైతే... గూడ్సు, ప్రయాణికుల రైళ్లను హైదరాబాద్‌కు 50-60 కిమీ దూరం నుంచే మళ్లించవచ్చు. ఉదాహరణకు మిర్యాలగూడ నుంచి సిమెంటుతో వచ్చే గూడ్సు బండ్లు హైదరాబాద్‌ మీదుగా బెంగళూరు, ముంబయి వైపు వెళుతుంటాయి. వీటి కారణంగా ప్రయాణికుల రైళ్ల సమయం ప్రభావితం అవుతోంది. అవుటర్‌ రింగ్‌ రైలు మార్గం నిర్మిస్తే అవి చిట్యాల నుంచి వెళ్లిపోతాయి. బొగ్గు, చమురు, ఆహారధాన్యాలు... ఇలా అనేక రకాల గూడ్సు బండ్లతోపాటు కొన్ని ప్రయాణికుల రైళ్లను హైదరాబాద్‌లోకి రాకుండానే మళ్లించొచ్చు. ముంబయి, భువనేశ్వర్‌ మధ్య రాకపోకలు సాగించే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ లింగంపల్లి, సికింద్రాబాద్‌ స్టేషన్ల మీదుగా వెళుతుంది. మహబూబ్‌నగర్‌-విశాఖపట్నం ప్రత్యేక రైలు కాచిగూడ, మల్కాజిగిరి మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఇలాంటి రైళ్లనూ శివార్ల నుంచే పంపించొచ్చు.

లాజిస్టిక్‌ హబ్‌గానూ ప్రగతి

ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు... విజయవాడ, ముంబయి, కర్నూలు, వికారాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ ప్రధాన రహదారులను అనుసంధానిస్తుంది. ఆయా జంక్షన్లు లాజిస్టిక్‌ హబ్‌గా అభివృద్ధి అయ్యేందుకు, అక్కడ కార్గో టెర్మినళ్లు నిర్మించడానికి అవకాశం ఉంటుంది.

ట్రాక్‌ సామర్థ్యమూ పెరిగే అవకాశం

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో సెక్షన్లను బట్టి ట్రాక్‌ సామర్థ్యం 80, 100, 110, 130 కి.మీ. వరకే ఉంది. వందేభారత్‌ రైళ్లకు 180 కి.మీ. వేగ సామర్థ్యమున్నా ట్రాక్‌ తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో 130 కి.మీ. వేగానికే పరిమితం అవుతున్నాయి. అవుటర్‌ రింగ్‌ రైలు మార్గంలో ట్రాక్‌ను 200 కి.మీ. వేగానికి తట్టుకునేలా నిర్మించే అవకాశముంది.

నిధులు, భూసేకరణే కీలకం

డీపీఆర్‌కు ఆమోదం లభిస్తే... ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడమే అత్యంత కీలకంగా మారుతుంది. ఈ రైలుమార్గం కొన్నిచోట్ల ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆనుకుని, మరికొన్నిచోట్ల దూరంగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌కు భూసేకరణ జరుగుతోంది. రైలు మార్గానికి మరోసారి సేకరించాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.15 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశమున్నట్లు అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమయానుకూలంగా కేటాయించాలి.


ఎక్కడెక్కడ కలుస్తుందంటే...

ప్రతిపాదిత రీజనల్‌ రింగ్‌ రైలు మార్గం... విజయవాడ హైవేలో చిట్యాల వద్ద, వరంగల్‌ రోడ్డులో రాయగిరి వద్ద, బెంగళూరు రోడ్డు మార్గంలో బూర్గుల వద్ద, ముంబయి మార్గంలో వికారాబాద్‌ వద్ద, బాసర, నాందేడ్‌కు వెళ్లే మార్గంలో అక్కన్నపేట వద్ద కలుస్తుంది. ఇవన్నీ హైదరాబాద్‌కు 30-50 కి.మీ. దూరంలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని