సీఎస్‌ఈ వస్తేనే చేరతాం!

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్రీయ విద్యా సంస్థల్లో సీటొస్తే చాలు జీవితంలో స్థిరపడినట్లేనని విద్యార్థులు భావించేవారు. ప్రస్తుత సీట్ల భర్తీ తీరును చూస్తుంటే అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

Published : 09 Aug 2023 07:03 IST

ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లోనూ ఇదే పరిస్థితి
ఏకంగా 11,284 బీటెక్‌ సీట్ల భర్తీకి తొలివిడత ప్రత్యేక కౌన్సెలింగ్‌ షురూ

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్రీయ విద్యా సంస్థల్లో సీటొస్తే చాలు జీవితంలో స్థిరపడినట్లేనని విద్యార్థులు భావించేవారు. ప్రస్తుత సీట్ల భర్తీ తీరును చూస్తుంటే అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి ప్రతిష్ఠాత్మక సంస్థల్లోనూ ఏకంగా 29.37% బీటెక్‌ సీట్లు మిగిలిపోవడమే ఇందుకు కారణం. ఆయా సంస్థల్లో మొత్తం 39,767 సీట్లుండగా ప్రస్తుతం 11,284 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ప్రత్యేకంగా రెండు విడతల కౌన్సెలింగ్‌కు కేంద్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. నిరుడు(2022-23) ఆరు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత 9,500 వేల సీట్లు ఖాళీగా ఉండగా ఈసారి మరింత పెరగడం గమనార్హం.

దేశంలోని 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 35 కేంద్రీయ విద్యాసంస్థల్లో ఉన్న మొత్తం 54,348 సీట్లకు జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆరు విడతల తర్వాత ఐఐటీలు మినహా ఇతర సంస్థల్లో 11,284 సీట్లు మిగిలిపోయాయి. అత్యధికంగా బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, మెకానికల్‌ తదితర బ్రాంచీల్లో ఖాళీగా ఉన్నాయి. తమిళనాడులోని తిరుచిరాపల్లి, కర్ణాటకలోని సూరత్‌కల్‌ లాంటి టాప్‌ ఎన్‌ఐటీల్లోని మెకానికల్‌ విభాగంలో ఇతర రాష్ట్రాల కోటాలో వరుసగా 6, 10 సీట్లు మిగిలిపోయాయి. ఏపీలోని శ్రీసిటీ ఈసీఈ బ్రాంచిలో ఓపెన్‌ కోటాలో 16 సీట్లు భర్తీ కాలేదు. వరంగల్‌ ఎన్‌ఐటీలో నాలుగు కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లూ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం వెయ్యి వరకు సీట్లుండగా వాటిల్లో 122 సీట్లను ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో భర్తీకి అందుబాటులో ఉంచారు.

తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో ఖాళీలు

ఎన్‌ఐటీ వరంగల్‌లో 122, ఏపీ నిట్‌లో 106, ట్రిపుల్‌ఐటీ, శ్రీసిటీలో 78, ట్రిపుల్‌ఐటీ, కర్నూలులో 86, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, విజయవాడలో 32, హెచ్‌సీయూలో 8 (కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌) సీట్లు ఖాళీగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని