బండ భారం తగ్గింది

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.200 మేర తగ్గించాలని ప్రధాని ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తీర్మానించింది.

Updated : 30 Aug 2023 06:56 IST

రూ.200 తగ్గిన వంటగ్యాస్‌ సిలిండర్‌
ఉజ్వల’ కింద 75 లక్షల ఉచిత కనెక్షన్లు
ఆడపడుచులకు రాఖీ కానుకన్న ప్రధాని

ఈనాడు-దిల్లీ, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.200 మేర తగ్గించాలని ప్రధాని ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తీర్మానించింది. ఈ తగ్గింపు వెంటనే అమల్లోకి రానుంది. అలాగే ఉజ్వల పథకం కింద 75 లక్షల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. రాఖీపౌర్ణమి పండగ వేళ వంటగ్యాస్‌ ధర తగ్గింపు నిర్ణయం ఆడపడుచులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘నా సోదరీమణులు అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఆ దేవుణ్ని ఇదే కోరుకొంటున్నా’’ అని ఆయన హిందీలో ‘ఎక్స్‌’ ద్వారా ట్వీట్‌ చేశారు.

హైదరాబాద్‌లో రూ.955.. వరంగల్‌లో రూ.970

కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో హైదరాబాద్‌లో ధర రూ.1,155 నుంచి రూ.955కి, వరంగల్‌లో రూ.1,170 నుంచి రూ.970కి, మహబూబ్‌నగర్‌లో రూ.1,158.50 నుంచి రూ.958.50కి తగ్గనుంది. దిల్లీలో రూ.1,103 ధర ఉండగా.. తాజా తగ్గింపుతో బుధవారం నుంచి రూ.903 అవుతుంది. ఉజ్వల లబ్ధిదారులకు రూ.703కే లభించనుంది. సిలిండర్‌పై వినియోగదారులకు ప్రస్తుతం రూ.40.71 రాయితీ మాత్రమే వస్తోంది. ధర తగ్గింపు నేపథ్యంలో ఎంత వస్తుందన్న అంశంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది. రెండు మూడు నెలల్లో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలపై వంటగ్యాస్‌ ధరల భారం తగ్గిస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేస్తోంది. ఈ తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్రంలో 1.17 కోట్ల కనెక్షన్లు

తెలంగాణవ్యాప్తంగా 33 జిల్లాల్లో దాదాపు 1.17 కోట్లకు పైగా గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 16.05 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. రంగారెడ్డిలో 12.30 లక్షలు, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 11.61 లక్షలున్నాయి. అత్యల్పంగా భూపాలపల్లి జిల్లాలో 6.6 లక్షలు, నారాయణపేట జిల్లాలో 8.6 లక్షల కనెక్షన్లు ఉన్నాయి.

రూ.7,680 కోట్ల అదనపు భారం: అనురాగ్‌ ఠాకుర్‌

తాజా నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వంపై 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.7,680 కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 33 కోట్ల మంది గ్యాస్‌ వినియోగదారులందరికీ తాజా తగ్గింపు వర్తిస్తుందని చెప్పారు. ఉజ్వల వినియోగదారులకు ఇదివరకే రూ.200 రాయితీ ఇస్తున్నామని, దానికి అదనంగా రూ.200 తగ్గింపు కూడా కలిపి.. వారికి మొత్తం రూ.400 వరకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. 2020-22 మధ్యలో అంతర్జాతీయంగా గ్యాస్‌ ధరలు 303% పెరిగినా దేశంలో మాత్రం ఈ పెరుగుదల 63%కే పరిమితమైందని తెలిపారు. రాబోయే ఎన్నికల కోసమో.. రాజకీయాల కోసమో ఈ నిర్ణయాలు తీసుకోలేదని, అలా చేయాలనుకుంటే చాలా ముందే చేసి ఉండేవాళ్లమని పేర్కొన్నారు. అయితే, ఈ తగ్గింపు పైప్డ్‌ గ్యాస్‌ వినియోగదారులకు వర్తించేదీ.. లేనిదీ మంత్రి స్పష్టత ఇవ్వలేదు.

  •  రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీమణులందరికీ కానుకగా మోదీ ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించడం సంతోషకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మూడేళ్లలో రూ.508.50 పెంపు.. రూ.200 తగ్గింపు

హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.1,155 ఉండగా.. తాజాగా రూ.200 తగ్గింపుతో రూ.955కి చేరింది. ప్రస్తుతం ధర భారీగా తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ.. గడిచిన మూడేళ్లలో పెంచిన రూ.508.50తో పోలిస్తే ఇప్పుడు తగ్గింది (రూ.200).. 40 శాతం మాత్రమే. 2020 సెప్టెంబరులో సిలిండర్‌ ధర రూ.646.50 మాత్రమే. 2021 సెప్టెంబరులో రూ.937 ఉండగా.. ప్రస్తుతం దాదాపు అదే ధరకు చేరుకుంది. కాగా, గృహావసర సిలిండర్ల ధరను చమురు సంస్థలు చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న రూ.50 చొప్పున పెంచాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని