సమగ్ర వికాసానికి ఆరోగ్యమే ఆలంబన

ఆరోగ్యమే మహాభాగ్యం. అది జీవితాంతం మనిషికి తోడుగా ఉంటుంది. వ్యక్తి అభివృద్ధిలో ఇదే కీలకంగా నిలుస్తుంది. మంచి అలవాట్లే మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆరోగ్య సంరక్షణపై సరైన అవగాహనకు బీజం పాఠశాల దశలోనే పడాలి.

Published : 19 Apr 2024 01:19 IST

ఆరోగ్యమే మహాభాగ్యం. అది జీవితాంతం మనిషికి తోడుగా ఉంటుంది. వ్యక్తి అభివృద్ధిలో ఇదే కీలకంగా నిలుస్తుంది. మంచి అలవాట్లే మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆరోగ్య సంరక్షణపై సరైన అవగాహనకు బీజం పాఠశాల దశలోనే పడాలి. పాలకులు దీనిపై సరైన దృష్టి సారించాలి.

మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలన్నా, పనిపాటలు చేసుకోవాలన్నా, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలన్నా, కుటుంబంతో బంధు మిత్రులతో ఉల్లాసంగా గడపాలన్నా ఆరోగ్యంగా ఉండటం తప్పనిసరి. తీర్థయాత్రలు, విహారాలు జరపాలన్నా ఆరోగ్యవంతులకే సాధ్యం. విద్యార్జనతో సరైన ఉపాధి పొంది ఆదాయం ఆర్జించడానికి, క్రీడల్లో, కళల్లో రాణించడానికి ఆరోగ్యమే మూలం. ఈ సంగతి గ్రహించకుండా దురలవాట్లు చేసుకుంటే ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. ఆరోగ్యవంతమైన జీవిత విధానమంటే ఏమిటో చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. వ్యాధులు, అకాల మరణాలకు దారితీసే సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల గురించీ అందరికీ సరైన అవగాహన ఉండదు. ఫలితంగా వారు స్వీయ ఆరోగ్యాన్ని, కుటుంబ, సమాజ శ్రేయస్సునూ అలక్ష్యం చేస్తుంటారు. వ్యక్తిగత, సామాజిక వికాసానికి విద్యే కీలకమని ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఉద్ఘాటిస్తోంది. 2015నాటి ఇంజాన్‌ ప్రకటన విద్యావికాసం అత్యంత ఆవశ్యకమని ప్రకటించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాణ్యమైన విద్యకు నాలుగో స్థానం దక్కింది. విద్య సముపార్జనకు అనారోగ్యం ఆటంకం కలిగిస్తుంది. విద్య, ఆరోగ్యాల మధ్యనున్న అవినాభావ సంబంధాన్ని గుర్తించి తదనుగుణమైన విధానాలను అవలంబించడం తప్పనిసరి. పాఠశాలలో విద్యాభ్యాస కాలం బాలబాలికలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పడానికి చాలా అనువైనది.

పెద్దల్లో మార్పు

వ్యక్తిగత శుభ్రత, పారిశుద్ధ్యం, పోషకాహారం, వ్యాయామం, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాల్సిన అవసరం, మానసిక ఒత్తిడిని జయించడం, తోటివారితో సామరస్యంగా స్నేహంగా మెలగడం పాఠశాలే నేర్పిస్తుంది. ఘర్షణ వాతావరణాన్ని నివారించడం, లింగ భేదాలకు తావివ్వకపోవడం తదితరాలనూ నేర్చుకునే అవకాశాన్ని విద్యాలయమే కల్పిస్తుంది. రహదారి భద్రత, ప్రాథమిక చికిత్స తదితరాల్లో మెలకువలనూ పాఠశాలల్లోనే బోధించాలి. పాఠశాల ప్రాంగణాల్లో పచ్చదనం, తరగతి గదులలో ధారాళంగా గాలి, వెలుతురు, ఆట మైదానాలు విద్యార్థి వికాసానికి తోడ్పడతాయి. దివ్యాంగులైన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. యోగా, ధ్యానాల అభ్యాసానికి ఏర్పాట్లు చేయాలి. బాలల్లో దృష్టి, శ్రవణ లోపాలను ముందే గుర్తించడానికి పాఠశాలల్లో తరచూ పరీక్షలు చేసి ఉపశమన చర్యలు తీసుకోవాలి. తద్వారా విద్యార్జనకు శారీరక లోపాలు అడ్డురాకుండా జాగ్రత్త పడాలి. మానసిక, శారీరక సమస్యలను అధిగమించడానికి తోటి విద్యార్థులు సహాయపడే వాతావరణాన్ని సృష్టించాలి. ఈ విధంగా వారిలో పాదుకునే సహానుభూతి రేపు పెరిగి పెద్దయ్యాక చక్కని సామాజిక సంబంధాలు నెరపడానికి, సామాజిక సామరస్యం నెలకొనడానికి తోడ్పడుతుంది. పాఠశాలల్లో ఆరోగ్యవంతమైన జీవన శైలి గురించి నేర్చుకున్న విద్యార్థులు తమ కుటుంబంలోని పెద్దలకూ దానిపై అవగాహన కల్పించగలుగుతారు. వారూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించేలా ప్రేరణ ఇవ్వగలుగుతారు. దీనికి సంబంధించిన సంభాషణా నైపుణ్యాన్ని పిల్లలకు పాఠశాలల్లోనే అలవరచాలి. ఉదాహరణకు ధూమ, మద్యపానాల వల్ల కలిగే అనర్థాలను తమ పిల్లల ద్వారానే పెద్దలు గ్రహిస్తే, వారి ప్రవర్తనలో తప్పక మార్పు వస్తుంది. దురలవాట్లను వదిలించుకుని తగిన వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకొనేలా తల్లిదండ్రులను పురిగొల్పడంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించగలుగుతారు.

ప్రాథమిక విద్యతో మొదలుపెట్టి ఉన్నత స్థాయి వరకు విద్యార్థులు జీవన నైపుణ్యాలను నేర్చుకొనే వాతావరణాన్ని విద్యాలయాల్లో కల్పించాలి. పాఠ్యాంశాలు, పాఠ్యేతర కార్యక్రమాలు, బృంద చర్చలు, భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు మంచి జీవితానికి పునాది వేసుకోగలుగుతారు. స్వయంగా విషయ పరిజ్ఞానం సాధించేలా వారిని సన్నద్ధుల్ని చేయాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఎందుకు అనుసరించాలో వారికి తెలియజెప్పి తమంతటతాము మంచి అలవాట్లు అలవరచుకునేలా తీర్చిదిద్దాలి. ఎలాంటి పనులు చేయాలనేది మాత్రమే కాకుండా ఎందుకు చేయాలో కూడా పిల్లలకు అర్థమయ్యేలా నూరిపోయాలి. ఇది ఇంట్లోకన్నా బడిలోనే సుసాధ్యమవుతుంది. తల్లిదండ్రులకన్నా ఉపాధ్యాయులకే ఇలాంటి విషయాల్లో ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది. తోటివారిని చూసీ నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. లింగ దుర్విచక్షణకు తావివ్వకూడదని, లింగపరమైన సమానత్వం ఆధునిక సమాజానికి ఆవశ్యకమని విద్యార్థులకు బోధించాలి.

క్రియాశీల పాత్ర పోషించేలా...

ప్రభుత్వం విద్యావైద్యాలకు సమధిక నిధుల కేటాయింపు చక్కటి ఫలితాలనిస్తుంది. ఇతర రంగాల్లో ప్రభుత్వం చేపట్టే విధానాలు, కార్యక్రమాలూ ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఈతరంవారి ఆరోగ్య సంరక్షణకు తోడ్పడే విధానాలను పాఠశాల స్థాయితో మొదలుపెట్టి భవిష్యత్తులోనూ కొనసాగించేలా విధానకర్తలు చొరవ చూపాలి. పొగాకు నియంత్రణకు, వాయుకాలుష్య కట్టడికి, పాఠశాల ప్రాంగణాల్లో ధూమపాన నిషేధానికి విద్యార్థులు తరచూ ఉద్యమ ప్రాతిపదికపై కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. పాఠశాల వంటగదుల కోసం కూరగాయల తోటలు సాగు చేయడం, చెట్లను పెంచి పర్యావరణాన్ని సంరక్షించడమూ ఈ కోవలోకే వస్తాయి. వాతావరణ మార్పులు ఈ తరం మీదనే కాకుండా రేపటి తరాలపైనా విషమ ప్రభావం చూపనున్నాయి. వాయు, జల, భూ కాలుష్యాలు ఆహార, ఆరోగ్య భద్రతకు ముప్పు తెస్తున్నాయి. పర్యావరణ నష్టం జనసమూహాల మధ్య పరిమిత వనరుల కోసం ఘర్షణలను పెంచుతోంది. వ్యక్తులు, సమాజాల మానసిక, శారీరక ఆరోగ్యాలను దెబ్బతీస్తోంది. కాబట్టి రేపటి పౌరులైన విద్యార్థులు వాతావరణ మార్పుల నిరోధంలో ఇప్పటి నుంచే క్రియాశీల పాత్ర పోషించేలా విద్యాలయాలు చొరవతీసుకోవాలి. మానవ శరీరంపై ఆహార విహారాలు, పర్యావరణం చూపే ప్రభావం గురించి విద్యార్థులకు క్షుణ్నంగా బోధించాలి. తద్వారా వారు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకుని ఆచరించేలా సంసిద్ధుల్ని చేయాలి.


పిల్లల క్షేమం కోసం

పాఠశాలల్లో సుశిక్షిత నర్సులతో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరం. జ్వరాలు, మూర్ఛ, రుతుక్రమ సమస్యలకు సకాలంలో సలహాలు, చికిత్స ఇచ్చి ఉపశమనం కలిగించవచ్చు. జువెనైల్‌ డయాబెటిస్‌ ఉన్న పిల్లల్లో చక్కెర స్థాయి తగ్గిపోతే తక్షణమే నివారణ చర్యలు తీసుకోవడం వీలవుతుంది. ఇలాంటి ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు అవకాశంలేని చోట్ల ఉపాధ్యాయులకే ఆయా అంశాలపై శిక్షణ ఇవ్వాలి. తద్వారా చిన్నపాటి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం, అత్యవసర కేసుల్లో వేగంగా స్పందించడం సులువవుతుంది.

 ప్రొఫెసర్‌ కె.శ్రీనాథరెడ్డి (వైద్య రంగ నిపుణులు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.