పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ

మాన్సాస్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్‌ పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

Updated : 01 May 2024 14:26 IST

మాన్సాస్‌ ట్రస్టుకు 15వేల ఎకరాల దానం
విద్యాసంస్థల కోసం బ్యాంకుల్లో రూ.124 కోట్ల డిపాజిట్‌
పీవీజీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: మాన్సాస్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్‌ పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. విజయనగరంలోని గజపతుల కోట ప్రాంగణంలో ట్రస్టు ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి కుటుంబంలో జన్మించడం తన అదృష్టమని పేర్కొన్నారు. విజయనగర మహారాజు అలక్‌ నారాయణ గజపతిరాజు, మహారాణి విద్యావతి దంపతుల పెద్ద కుమారుడు పీవీజీ. చిట్టచివరి పట్టాభిషిక్తుడైన రాజుగా చరిత్రలో నిలిచారు. రాజకోట (విజయనగరం కోట), ఉత్తర కోస్తా చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తన ఆస్తిని విరాళంగా ఇచ్చారు. విజయనగరం సంస్థానానికి ఒడిశా నుంచి మచిలీపట్నం వరకు ఉన్న ఆస్తులను పైసా పరిహారం ఆశించకుండా ప్రభుత్వానికి దానం చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన 15 వేల ఎకరాలను మాన్సాస్‌ ట్రస్టుకు ఇచ్చారు. ఆయన కుమారుడే కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు.

విజయనగరానికి మహర్దశ ఆయనవల్లే..

విద్యల నగరిగా విజయనగరం మారిందంటే ఆ మహారాజు దార్శనీకతే కారణం. సంగీత, సారస్వతాల్లో ఆయన అందించిన సహాయ, సహకారాల వల్లే ఎందరో ఆయా రంగాల్లో ఉన్నతంగా నిలిచారు. ఇంటి పెద్దగా వచ్చిన జ్యేష్ఠ భాగాన్ని ప్రజాధనంగా భావించి, రాజ్యంలో ఉన్న ఆస్తులు మొత్తాన్ని పీవీజీ దానమిచ్చారు. మాన్సాస్‌ ట్రస్టు పరిధిలో 105 దేవాలయాలు, 14,800 ఎకరాల భూములు, 13 విద్యాసంస్థలు ఉన్నాయి. విద్యాసంస్థల కోసం బ్యాంకుల్లో రూ.124 కోట్లు డిపాజిట్లు వేశారు. 60 ఏళ్ల తర్వాత అన్నీ వదిలి సింహాచలం గోశాలలో దైవచింతనలో గడిపారు. 1995 నవంబరు 14న విశాఖలో కన్నుమూశారు.

ఆయన శతజయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో అశోక్‌గజపతి రాజు సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తెలు అదితి గజపతిరాజు, విద్యావతి, మాన్సాస్‌ కరస్పాండెంట్‌ కేవీఎల్‌ రాజు, విశ్రాంత ప్రధానాచార్యుడు ఏవీడీ శర్మ, మహారాజా కళాశాల ప్రధానాచార్యుడు ఎం సాంబశివరావు, విద్యాసంస్థల పూర్వ ప్రధానాచార్యులు తదితరులు పాల్గొన్నారు.


నేడు పుస్తకావిష్కరణ

ఉత్సవాల్లో భాగంగా పీవీజీపై రూపొందించిన ‘ది లాస్ట్‌ మహారాజా ఆఫ్‌ విజయనగరం’ పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించనున్నారు. ఇందులో స్ఫూర్తిమంతమైన ఆయన జీవితచరిత్రను పొందుపర్చినట్లు మాన్సాస్‌ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌ బుక్‌ట్రస్టుకు చెందిన రచయితలు గీతా రామస్వామి, శశికుమార్‌, జయదీప్‌ ఈ పుస్తకం రాశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని