Rishabh Pant: పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్‌ ఆయిల్‌ వాడేవాడు!

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్‌ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్‌ ఆడే ఫిట్‌నెస్‌ను సాధించి బరిలోకి దిగాడు.

Published : 01 May 2024 14:08 IST

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు ప్రమాదం జరిగిన దాదాపు 15 నెలల తర్వాత భారత స్టార్‌ ఆటగాడు రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) మైదానంలోకి అడుగు పెట్టాడు. అందుకోసం తీవ్రంగా శ్రమించాడు. ఫిట్‌నెస్‌ సాధించడానికి, బరువును తగ్గించుకోవడానికి దాదాపు నాలుగు నెలలపాటు ‘నోరు’ను కట్టడి చేసుకున్నాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో అదరగొట్టేస్తున్న అతడు టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) జట్టులోకి అడుగు పెట్టాడు. ఆహార నియమాలపై రిషభ్‌ పంత్ కఠినంగా ఉన్నట్లు అతడి డైట్‌లో భాగస్వాములైన వర్గాలు వెల్లడించాయి. ఫ్రైడ్ చికెన్, రసమలై, బిర్యానీకి దూరంగా ఉన్నాడట. అయితే, చిల్లీ చికెన్‌ను కేవలం 5 ఎంఎల్‌ ఆలివ్‌ ఆయిల్‌తో తయారు చేసుకుని తిన్నాడట. ప్రమాదానికి ముందు కాస్త బొద్దుగా ఉండే పంత్‌ను ఇప్పుడు చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుందని మాజీ క్రికెటర్లూ ప్రశంసలు కురిపించారు.

‘‘కేలరీలను తగ్గించుకునేందుకు పంత్ చాలా కష్టపడ్డాడు. అతడి శరీరం 1400 కేలరీలను కోరుకుంటే.. వెయ్యి మాత్రమే ఇచ్చేవాడు. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించడానికి అవసరమైన కసరత్తులు ప్రారంభించిన తర్వాత డైట్‌ మరింత కఠినతరం చేశాడు. కుడి కాలు గాయం నుంచి కోలుకుని బలంగా మారేందుకు శ్రమించాడు. పంత్‌ తన ఆహారం విభిన్నంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకోసమే, ఎన్సీఏ పర్యవేక్షణలో ఉంటూనే బెంగళూరు ఓ రెంట్‌ హౌస్‌కు మారిపోయాడు. హోటల్‌ ఫుడ్‌ కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారానికే ప్రాధాన్యం ఇచ్చాడు. కేవలం ఐదు ఎంఎల్ ఆలివ్‌ ఆయిల్‌తోనే తన వంటను చేయించుకొనేవాడు. అన్ని రకాల ఫుడ్‌ను వదిలేసినప్పటికీ చిల్లీ చికెన్‌ను మాత్రం తినేందుకు మొగ్గు చూపాడు. 

చాలా తక్కువ ఆయిల్‌తోనే ఆహారాన్ని తయారు చేయించుకొని తినేవాడు. అతడికి బెండకాయ కూరంటే చాలా ఇష్టం. సమయానికి నిద్రకు ఉపక్రమించేవాడు. టీవీ, ఫోన్, ఇతర గ్యాడ్జెట్స్‌ను రాత్రి 11 గంటలకల్లా పక్కన పెట్టేసేవాడు. ఎలాంటి ఆటంకం లేకుండా కనీసం 8 గంటల నిద్ర పోయేవాడు. ఉదయం కఠినమైన శిక్షణ కోసం సిద్ధంగా ఉండేవాడు. ఇలా చేయడం వల్ల కేవలం నాలుగు నెలల వ్యవధిలో 16 కేజీల వరకు బరువు తగ్గాడు’’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని