Credit cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?

Credit cards: సులభంగా క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా..

Published : 01 May 2024 11:40 IST

Credit cards | ఇంటర్నెట్‌డెస్క్‌: డిజిటల్‌ యుగంలో క్రెడిట్‌ కార్డ్‌ (Credit cards) వినియోగం బాగా పెరిగింది. చాలా వరకు లావాదేవీలు క్రెడిట్‌ కార్డుల రూపంలోనే జరుగుతున్నాయి. మునుపటితో పోలిస్తే వీటిని సులువుగా జారీ చేస్తుండడంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డుల్ని తీసుకుంటున్నారు. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే.. దాదాపు 50 రోజుల పాటు వడ్డీ రహిత కాలాన్ని పొందొచ్చు. అంతేకాదు ఎలా వినియోగిస్తే అధిక ప్రయోజనాలు పొందొచ్చో కూడా చూద్దాం..

వడ్డీ రహిత కాలం

క్రెడిట్‌ కార్డు ఉప‌యోగించి లావాదేవీ చేసిన తేదీకి, చెల్లింపు గ‌డువు తేదీకి మ‌ధ్య ఉన్న కాలాన్ని వడ్డీ ర‌హిత కాలం.. ఇంట్రస్ట్‌ ఫ్రీ పీరియడ్‌ అంటారు.  ప్రతి క్రెడిట్ కార్డు జారీ సంస్థ కూడా ఈ వెసులుబాటును అందిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్న వారు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కార్డులను వ్యూహాత్మకంగా ఉపయోగించాలి.

బిల్లింగ్‌ సైకిల్‌

రామ్‌ వద్ద రెండు క్రెడిట్‌ కార్డులు ఉన్నాయనుకుందాం. అందులో క్రెడిట్‌ కార్డ్‌- A బిల్లింగ్‌ సైకిల్‌ ప్రతి నెలా 15తో ముగుస్తుందనుకుందాం. బిల్లు చెల్లించేందుకు దాదాపు ఆ మరుసటి నెల 5 వరకు అవకాశం ఉంటుంది.  ఒకవేళ అత్యవసరమై 14నే ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే మూడు వారాల్లోపే ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఇక్కడ వడ్డీ రహిత కాలం కేవలం 21 రోజులు మాత్రమే. అదే ఆ నెల 16న క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి ఏదైనా కొనుగోలు చేస్తే.. దాదాపు 50 రోజుల సమయం దొరికేది.

ఇలాంటి సందర్భంలో రెండు క్రెడిట్‌ కార్డులు ఉంటే నెలాఖరు కోసం మరో క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఈ కాల వ్యవధిని పెంచుకోవచ్చు. రామ్‌ వద్ద ఉన్న B క్రెడిట్‌ కార్డు  బిల్లింగ్‌ ప్రతి నెలా 30న అవుతుందనుకుంటే.. దానికి బిల్లు చెల్లించేందుకు ఆ మరుసటి నెల 19 వరకు గడువు ఉంటుంది. అప్పుడు మీరు ప్రతి నెలా 15వ తేదీలోపు ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే B క్రెడిట్‌ కార్డుతో..  ఆ తర్వాత జరిపే కొనుగోళ్లకు A క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తే సరి. అప్పుడు వీలైనంత ఎక్కువ వడ్డీ రహిత కాలాన్ని పొందొచ్చు.  క్రెడిట్ కార్డులో బిల్లింగ్‌ సైకిల్‌ని మార్చుకొనే సదుపాయం ఉంది కాబట్టి.. మీ వెసులుబాటును బట్టి  తేదీని మార్చుకోండి.

డిస్కౌంట్లు, రివార్డులు..

దాదాపు అన్ని క్రెడిట్‌ కార్డ్‌లు వివిధ రకాల రివార్డులు, డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో వస్తుంంటాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ల దగ్గర నుంచి ఇంధన కొనుగోళ్లు, విమాన టికెట్ల వరకు అనేక ప్రయోజనాలు కల్పిస్తుంటాయి. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నప్పుడు ఈ తరహా ప్రయోజనాలు ఎక్కువగా అందుకొనే వీలుంటుంది. విరివిగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తుంటే ఆ తరహా కూపన్లు, డిస్కౌంట్లు అందించే కార్డుల్ని.. తరచూ ప్రయాణం చేస్తుంటే ఛార్జీలపై తగ్గింపు అందించే వాటిని ఎంచుకోండి. ఇలా వేర్వేరు రివార్డ్‌ స్కీమ్స్‌ కలిగిన క్రెడిట్‌ కార్డులను వాడడం వల్ల అధిక ప్రయోజనాలు పొందొచ్చు.

CUR చింతక్కర్లేదు..

ప్రతి కొత్త క్రెడిట్‌ కార్డుతో మీ క్రెడిట్‌ పరిమితి పెరుగుతుంది. దీనివల్ల క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో (CUR) నియంత్రణలో ఉంటుంది. మీ క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో ఎంత తక్కువగా ఉంటే మీ క్రెడిట్‌ స్కోర్‌ అంత బాగుంటుంది. ఉదాహరణకు మీ కార్డు పరిమితి రూ.1 లక్ష అనుకుందాం. అందులో రూ.30 వేలు ఖర్చు చేస్తే మీ సీయూఆర్‌ రేషియో 0.3గా ఉంటుంది. అదే మీకు రూ.50వేల లిమిట్‌తో అదనపు కార్డ్‌ ఉంటే రెండింటి ద్వారా అంతే మొత్తం ఖర్చు చేస్తే సీయూఆర్‌ రేషియో 0.2కి తగ్గుతుంది. తద్వారా మీ క్రెడిట్‌ స్కోర్‌ పెరుగుతుందన్నమాట. 

క్లిష్ట పరిస్థితుల్లో..

క్రెడిట్‌ కార్డు బిల్లును సకాలంలో చెల్లించకపోతే వాటిపై అధిక వడ్డీ చెల్లించాలి. అలాంటి సందర్భంలో క్రెడిట్‌ కార్డ్‌ బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ ఉపయోగపడుతుంది. మొదటి క్రెడిట్‌ కార్డుపై బిల్లు బకాయి ఉన్నప్పుడు దాన్ని.. రెండో కార్డుకు బదిలీ చేయొచ్చు. దీంతో మీ బకాయిల్ని చెల్లించడానికి అదనపు సమయం దొరుకుతుంది. అన్ని కార్డులు ఈ సదుపాయాన్ని అందించడం లేదు. సంస్ధల్ని బట్టి బ్యాలెన్స్‌ బదిలీపై ప్రాసెసింగ్‌ రుసుములు కూడా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని