చదువుల సారం... ఆత్మవిశ్వాసం!

విద్యార్థుల ఆత్మహత్యలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. చావనేది దేనికీ పరిష్కారం కాదు. విద్యార్థులు ఒత్తిడిని జయించాలి. చదువుల్ని జ్ఞాన సముపార్జనకు, సొంత కాళ్లపై నిలబడేందుకు ఉపయోగించుకోవాలి.

Published : 30 Apr 2024 00:16 IST

విద్యార్థుల ఆత్మహత్యలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. చావనేది దేనికీ పరిష్కారం కాదు. విద్యార్థులు ఒత్తిడిని జయించాలి. చదువుల్ని జ్ఞాన సముపార్జనకు, సొంత కాళ్లపై నిలబడేందుకు ఉపయోగించుకోవాలి. ఇష్టంతో చదువుతూ, జీవితాల్ని చక్కదిద్దుకోవడానికే విద్య ఉపయోగపడాలన్న సంగతిని గుర్తించాలి.

విద్యార్థుల ఆత్మహత్యల్లో కార్పొరేట్‌ కళాశాల వ్యవస్థ బయటికి కనిపించని పాత్ర పోషిస్తోంది. పదోతరగతి తరవాత పిల్లలతో ఏ కోర్సులు చదివించాలి, వారేం కోరుకుంటున్నారు, వారికేది ఇష్టమో తల్లిదండ్రులు నిర్ధారించుకొనేలోపే కార్పొరేట్‌ వ్యవస్థ ప్రత్యక్షమవుతోంది. వ్యాపార ప్రయోజనాల కోసం చిన్నారులను బలి పశువులుగా మారుస్తోంది. జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కల ప్రకారం 8,032 మంది విద్యార్థుల ఆత్మహత్యల్లో 30శాతం పరీక్షల్లో అనుత్తీర్ణత కారణంగా సంభవించినవేనని తేలింది. మిగతా 70శాతం వివిధ రకాల కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడినట్లు గుర్తించారు. ఒత్తిడి, ఇష్టంలేని చదువులు, వసతి గృహంలో సౌకర్యాలు నచ్చకపోవడం, తల్లిదండ్రులను సంతోషపెట్టలేమేమోననే అనుమానం, బయటికి చెప్పుకోలేని పరిస్థితులు వంటి వన్నీ ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు తేలింది.

స్నేహంగా మెలిగితే...

రోజంతా చదువు ఒత్తిడిలో ఉండే పిల్లలకు ప్రత్యేకంగా ఎలాంటి కౌన్సిలింగ్‌ తరగతులనూ నిర్వహించడం లేదు. కార్పొరేట్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కనీసం ఆరు గంటల నిద్ర కూడా ఉండటం లేదు. లక్ష్యాల భారంతో ఒత్తిడి పెరుగుతోంది. విద్యార్థుల మనస్తత్వాలు అందరివీ ఒకేలా ఉండవు. కొంతమంది తరవాత జరగబోయే అవమానాల్ని తలచుకుని, ఆందోళనకు గురై బలవన్మరణం దిశగా అడుగులేస్తారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే అన్ని కళాశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు ఉండాలి. కళాశాల యాజమాన్యాలు మూడు నెలలకోసారి విధిగా వారితో సమావేశమవ్వాలి. విద్యార్థుల సూచనల కోసం సలహాల పెట్టెలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి కళాశాలలో కౌన్సిలర్‌ను నియమించాలి. విద్యార్థులు, బోధకులతో యోగా, ధ్యానం చేయించాలి. పిల్లలకు చదువులపై నమ్మకాన్ని పెంచాలి. తల్లిదండ్రులు వాళ్లతో స్నేహితులుగా మెలుగుతూ ప్రతి నిర్ణయాన్ని సమస్యను, కష్టాన్ని, సుఖాన్ని పంచుకోవాలి.

తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్‌ సముద్రంలో విసిరేయకూడదు. వారు అందులో ఈదలేక, ఒడ్డుకు చేరలేక, వెనక్కి రాలేక భవిష్యత్తు కనుమరుగైన పరిస్థితిలో చిక్కుకుంటున్నారు. పిల్లలు సైతం తమ కష్టాలను, ఇష్టాలను అమ్మానాన్నలకు చెప్పుకోవాలి. అప్పుడే సులువైన పరిష్కారం కనపడుతుంది. తల్లిదండ్రులేమీ శత్రువులు కాదు. ఎలాంటి సమస్యనైనా అర్థం చేసుకొనే సన్నిహితులు. చదువులనేవి చావడానికి కాదన్న సంగతిని ప్రతి విద్యార్థికీ అర్థమయ్యేలా చేయాలి. విద్యాభ్యాసం జీవితంలో ముందుకు నడిపించడానికి, ఉన్నత స్థానంలో నిలబడేలా తోడ్పడటానికి, కుటుంబాలను ఉన్నతస్థితిలో నిలపడానికి, దేశ ప్రతిష్ఠకు ఉపయోగపడటానికే తోడ్పడాలన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి. చదువుల్లో విఫలమయ్యామనే పేరిట మరణాన్ని ఆహ్వానిస్తూ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచకూడదు. ధైర్యాన్ని పెంచుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లుగానే ఎదగాలంటూ గిరిగీసుకుంటున్నారు. అలాంటి భావనల నుంచి బయటికి వచ్చి ఎన్నో మంచి ఉద్యోగాలను అందించే విభిన్న కోర్సుల్ని చదివేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. అప్పుడే విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో, ఒత్తిడి లేని విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడం సాధ్యమవుతుంది. తమ పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రుల వైఖరిలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాము జీవితంలో సాధించలేకపోయిన వాటిని తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలనే ఆలోచన నుంచి బయటపడాలి. తోటి ఉద్యోగులు, సహచరులు, బంధువులు, పరిచయస్తుల సంతానంతో తమ పిల్లలను పోల్చుకుంటూ, అదే స్థాయిలో నిలవాలని కోరుకోవద్దు.

మార్గదర్శకులుగా నిలవాలి...

అందరి పిల్లల సామర్థ్యాలు ఒకేలా ఉండవు. కార్పొరేట్‌ కళాశాలలో చదివితేనే తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందనే అపోహలు విడిచిపెట్టాలి. వేలం వెర్రిగా కార్పొరేట్‌ బడుల్లో పిల్లల్ని చేర్పించి చదువుల కోసం భారీగా ఖర్చుపెట్టే పద్ధతికి స్వస్తి పలకాలి. కార్పొరేట్‌ కళాశాలల నిర్వహణ తీరుపై ప్రభుత్వ యంత్రాంగాలు సైతం గట్టి నిఘా ఉంచాలి. యాజమాన్యాలు విద్యార్థులపై పెడుతున్న ఒత్తిడులకు అడ్డుకట్టవేయాలి. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే, ఆయా కార్పొరేట్‌ కళాశాలలను నిషేధ జాబితాలో చేర్చేందుకూ వెనకాడకూడదు. పిల్లల ఊపిరి ఆగిపోయేలా ఉక్కిరిబిక్కిరి చదువుల విషయంలో తల్లిదండ్రులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉదాసీనతను వదిలి పిల్లలకు మార్గదర్శకులుగా నిలవాలి. చదువుల విషయంలో తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో సమూల మార్పు రావాలి. లక్షల రూపాయలు వెచ్చించి కొన్న చదువులతో పిల్లల మరణాలకు కారణమవడమా, లక్షణంగా మంచి విద్యాబుద్ధులు నేర్పించి లక్ష్యం దిశగా నడిపించడమా అని నేటి తల్లిదండ్రులు తేల్చుకోవాల్సిన తరుణమిదే! 

 డాక్టర్‌ బెండి లవకుమార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.