IDF: సొంత సైన్యం చేతిలో ‘ఇజ్రాయెల్‌ బందీలు’ మృతి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!

తమ దేశానికే చెందిన ముగ్గురు బందీలను ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలో పొరపాటున కాల్చిచంపిన విషయం తెలిసిందే. స్థానికంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితులు కూడా ఈ తప్పిదానికి కారణమయ్యాయని భావిస్తున్నట్లు ఐడీఎఫ్‌ చెప్పింది.

Updated : 17 Dec 2023 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శత్రువులుగా పొరపాటుపడి తమ దేశానికే చెందిన ముగ్గురు బందీల (Israeli Hostages)ను ఇజ్రాయెల్‌ సైన్యం (IDF) గాజాలో కాల్చి చంపడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఐడీఎఫ్‌.. దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కాల్పులకు దారితీసిన అంశాలతోపాటు ఆ సమయంలో ఏం జరిగిందో వెల్లడించింది. హమాస్‌ (Hamas)కు కంచుకోటగా ఉన్న ఉత్తర గాజాలోని షిజాయా ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. స్థానికంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితులు కూడా ఈ భారీ తప్పిదానికి కారణమయ్యాయని భావిస్తున్నట్లు సమాచారం.

‘‘షిజాయాలోని ఓ భవనం నుంచి ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులు బయటకు వస్తున్నట్లు ఓ ఇజ్రాయెల్‌ సైనికుడు గుర్తించాడు. ఆ సమయంలో వారు చొక్కా లేకుండా ఉన్నారు. ఒకరు శ్వేతవస్త్రంతో కూడిన కర్ర పట్టుకుని ఉన్నాడు. అయితే, ఇదంతా హమాస్ కుట్రగా భావించిన ఆ సైనికుడు.. వారిని ముప్పుగా పరిగణించి కాల్పులు జరిపాడు. ‘ఉగ్రవాదులు’ అని అరుస్తూ.. తోటి సైనికులను అప్రమత్తం చేశాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మూడో వ్యక్తికి గాయాలు కాగా, అతడు తిరిగి భవనంలోకి పారిపోయాడు’’ అని ప్రాథమిక విచారణను ఉటంకిస్తూ ఓ సైనికాధికారి స్థానిక వార్తాసంస్థకు వివరించారు.

పోరులో పొరపాటు.. ఐడీఎఫ్‌ దాడిలో ముగ్గురు బందీల దుర్మరణం

‘‘ఈ క్రమంలోనే ఐడీఎఫ్‌ బెటాలియన్ కమాండర్ ఆదేశాల మేరకు కాల్పులు నిలిపివేశారు. అనంతరం సాయం కోరుతూ భవనం లోపలి నుంచి ‘హిబ్రూ’ భాషలో కేకలు వినిపించాయి. బహుశా అది మూడో వ్యక్తి గొంతు కావచ్చు. అంతలోనే అతడు భవనం నుంచి మళ్లీ బయటకురాగా.. మరో సైనికుడు కాల్చి చంపాడు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు’’ అని సైనికాధికారి వెల్లడించారు. అయితే.. షిజాయాలోని పరిస్థితులే సైనికులను ఆ విధంగా స్పందించేలా చేశాయని ఐడీఎఫ్‌ భావిస్తోందట.

చనిపోయిన ముగ్గురు బందీలను యోతమ్ హైమ్, సమీర్ తలాల్కా, అలోన్ షమ్రిజ్‌లుగా గుర్తించారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న దాడుల సమయంలో హమాస్ ఉగ్రవాదులు వారిని బందీలుగా చేసుకున్నారు. అయితే, వారే తప్పించుకుని బయటకు రావడం లేదా.. హమాస్‌ ఉగ్రవాదులే వదిలేసి ఉండొచ్చని ఇజ్రాయెల్‌ అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి కొద్ది దూరంలో అత్యవసర సాయం కోరుతూ ఓ భవనంపై రాతలను గుర్తించామని, చనిపోయిన ముగ్గురు వ్యక్తులకు.. దానికి సంబంధం ఉందా? అనేది దర్యాప్తు జరుపుతున్నామన్నారు. అంతులేని విషాదమంటూ ఈ ఘటనపై ప్రధాని నెతన్యాహు ఇప్పటికే స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని