Gaza: గాజాలో మరో విషాదం.. ఆహార పార్సిళ్ల పారాచ్యూట్ కూలి పలువురి మృతి

గాజాలో ఆకలితో మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్న అమాయకులపై ఆహార ప్యాకెట్లను తరలిస్తున్న పారాచ్యూట్ కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 

Updated : 09 Mar 2024 11:04 IST

జెరూసలెం: గాజాలో మరో విషాదం చోటు చేసుకొంది. మానవతా సాయం కోసం క్యూలో ఎదురుచూస్తున్న గాజా (Gaza)వాసులపై విమానాల నుంచి జారవిడిచిన ఆహార ప్యాకెట్ల పారాచ్యూట్ కూలింది. భారీ పార్సిళ్లు పడడంతో ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం..

ఇజ్రాయెల్‌ దాడులతో గాజా వాసుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆకలి బాధను తీర్చేందుకు కొన్ని దేశాలు ముందుకొచ్చి ఎయిర్‌డ్రాప్‌ల ద్వారా ఆహార పొట్లాలను జారవిడుస్తున్నాయి. వీటిలో అమెరికా, జోర్డాన్‌, బెల్జియం, ఈజిప్ట్‌, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. ఉత్తర గాజాలోని ఒక శిబిరం వద్ద ఆహారప్యాకెట్ల కోసం ఎదురుచూస్తున్న పౌరులపై పారాచ్యూట్ కూలింది. సమయానికి అది తెరుచుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణం. దీంతో ఐదుగురు మృతి చెందగా.. పది మంది గాయపడ్డారు. 

ప్రపంచ ప్రజాస్వామ్యానికి ట్రంప్‌ పెను ప్రమాదం

క్షతగాత్రులను ఆల్‌-షిఫా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పాలస్తీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్‌డ్రాప్‌ ఆకలి సమస్యకు పరిష్కారం కాదని.. ఇది పనికిరాని చర్య అంటూ మండిపడింది. వాయు మార్గాన చేసే సాయం ప్రజలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించినట్లు తెలిపింది. మానవతా సాయం పేరిట ప్రచారం పొందుతున్నాయంటూ ఆరోపించింది. ఎయిర్‌డ్రాప్‌ ప్రమాదానికి దారి తీస్తుందని.. రఫా సరిహద్దు నుంచి మరిన్ని ఆహార ట్రక్కులను  అనుమతించాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్యసమితి కోరిన విషయం తెలిసిందే. 

ఆ పారాచ్యూట్‌ మాది కాదు..

కూలిన పారాచ్యూట్ తాము జారవిడిచింది కాదంటూ జోర్డాన్‌, అమెరికా సైన్యాలు ప్రకటించాయి. బెల్జియం, ఈజిప్ట్‌, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ కలసి చేపట్టిన సాయంలో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాయి. ఇటీవల ఆహారం కోసం ట్రక్కుల వద్ద గుమిగూడిన వారిపై ఐడీఎఫ్‌ విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు మరణించడం బాధాకరం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని