US Elecions: మార్చిలో బైడెన్‌కు ₹750 కోట్లు.. ట్రంప్‌నకు ఒక్కరోజే ₹420 కోట్ల విరాళాలు

US Elecions: రాబోయే అధ్యక్ష ఎన్నికల కోసం బైడెన్‌, ట్రంప్‌ ప్రచార బృందాలు పోటాపోటీగా విరాళాలు సేకరిస్తున్నాయి. బైడెన్‌ గత నెలలో రూ.750 కోట్లు సమీకరించగా.. ట్రంప్‌ శనివారం జరిగిన ఒక్క కార్యక్రమంలోనే రూ.420 కోట్లు సేకరించడం గమనార్హం.

Published : 07 Apr 2024 12:31 IST

విల్మింగ్టన్‌: మార్చిలో 90 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.750 కోట్లు) పైగా విరాళాలను సమీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. దీంతో మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి 192 మిలియన్‌ డాలర్ల నిధులు తమ చేతిలో ఉన్నట్లు శనివారం వెల్లడించింది. వీటిలో 90 శాతం విరాళాలు 200 డాలర్ల లోపునవేనని తెలిపింది.

మార్చి 28న రెడియో సిటీ మ్యూజిక్‌ హాల్‌లో మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలోనే 26 మిలియన్‌ డాలర్లకు పైగా నిధులను సమీకరించినట్లు బైడెన్ బృందం వెల్లడించింది. తమకు వస్తున్న విరాళాలతోనే డిజిటల్‌, టీవీ ప్రకటనలు ఇస్తున్నామని తెలిపింది. కీలక రాష్ట్రాల్లో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకూ వీటిని వినియోగిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 31 నాటికి తమ వద్ద ఉన్న 192 మిలియన్‌ డాలర్ల విరాళాలు ఇప్పటి వరకు ఏ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి అందుకోలేదని చెప్పింది. 2023 ఏప్రిల్‌లో బైడెన్‌ తన అభ్యర్థిత్వాన్ని ధ్రువీకరించినప్పటి నుంచి 16 లక్షల మంది విరాళాలిచ్చినట్లు తెలిపింది. మార్చిలో అధ్యక్షుడి కీలక స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ప్రసంగం తర్వాత 24 గంటల్లో 10 మిలియన్‌ డాలర్ల నిధులు అందినట్లు పేర్కొంది.

భారత్‌ ఎన్నికల్లో జోక్యానికి చైనా ‘ఏఐ’!

ఒక్కరోజే 50.5 మిలియన్‌ డాలర్లు..

విరాళాల సేకరణలో డెమోక్రాటిక్‌ పార్టీతో రిపబ్లికన్‌ పార్టీ పోటీపడుతోంది. శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఒక్కరోజే 50.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.420 కోట్లు) సమీకరించినట్లు పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రచారం బృందం ప్రకటించింది. ఒక కార్యక్రమంలో ఇంతమొత్తం సమీకరించడం ఇదే రికార్డని పేర్కొంది. బైడెన్‌ బృందం రెడియో సిటీ మ్యూజిక్‌ హాల్‌ కార్యక్రమంలో సమీకరించిన దానితో పోలిస్తే ఇది రెండింతలు.

ఈ కార్యక్రమం కంటే ముందు మార్చిలో 65.6 మిలియన్‌ డాలర్లు సమీకరించినట్లు ట్రంప్‌ బృందం ప్రకటించింది. దీంతో త్రైమాసికం ముగిసే నాటికి తమ వద్ద 93.1 మిలియన్‌ డాలర్ల నిధులు ఉన్నట్లు వెల్లడించింది. ట్రంప్‌ తన ప్రచారాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో విరాళాలిచ్చేందుకు దాతలు ముందుకు రాలేదు. పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన ఇతరులకు మద్దతునిచ్చేందుకు మొగ్గుచూపారు. శనివారం నాటి కార్యక్రమంలో దాదాపు 100 మంది విరాళాలిచ్చారు. వీరిలో కొంతమంది బిలియనీర్లు ఉన్నట్లు ఆయన బృందం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని