Covid-19: మృతదేహానికి కరోనా పరీక్షలు.. 41రోజుల్లో 28సార్లు పాజిటివ్!

ఓ వ్యక్తి మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించిన పరిశోధకులు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. 41 రోజుల్లో 28సార్లు కొవిడ్‌ పరీక్షలు చేయగా......

Published : 15 Feb 2022 19:01 IST

లండన్‌: ఓ వ్యక్తి మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించిన పరిశోధకులు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. మృతదేహానికి 41 రోజుల్లో 28సార్లు కొవిడ్‌ పరీక్షలు చేయగా.. ప్రతిసారీ పాజిటివ్‌గానే వచ్చినట్లు వెల్లడించారు. మృతదేహాల్లో కరోనా వైరస్ ఎంతకాలం సజీవంగా ఉంటుందనే అంశంపై మరింత పరిశోధన జరపాల్సిన అవసరాన్ని ఇది ఎత్తిచూపుతోందని వారు అభిప్రాయపడ్డారు.

ఉక్రెయిన్​కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి.. కొంతకాలం క్రితం ఇటలీలో స్నేహితుడితో కలిసి బీచ్​కు వెళ్లాడు. వాతావరణం బాగాలేకపోయినా సముద్రంలో ఈత కొడుతూ, మునిగిపోయాడు. 16 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని గుర్తించించిన పోలీసులు శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. ఇటలీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం శవపరీక్షకు ముందు మృతదేహానికి కరోనా ఆర్​టీపీసీఆర్​ పరీక్ష చేశారు. కాగా పాజిటివ్‌ అని వచ్చింది.

అయితే అంత్యక్రియల నిర్వహణకు అనుమతులు రాకపోవడంతో.. ఆ వ్యక్తి మృతదేహాన్ని సీల్ చేసి, 4 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద ఆస్పత్రి మార్చురీలో భద్రపరచాల్సి వచ్చింది. ఆ సమయంలోనే డి అన్నున్​జియో విశ్వవిద్యాలయ వైద్యులు.. ఆ శవానికి వరుసగా ఆర్​టీపీసీఆర్​ టెస్టులు చేశారు. 41 రోజుల్లో 28సార్లు సాంపిల్స్ తీసి పరీక్షించగా.. ప్రతిసారీ పాజిటివ్‌గానే ఫలితం వచ్చింది. ఆ తర్వాత అంత్యక్రియలు జరపడంతో కొవిడ్‌ పరీక్షలు చేయడం సాధ్యం కాలేదు.

మృతదేహాల నుంచి కరోనా వ్యాప్తిపై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. కానీ.. ఎక్కడా శవాల నుంచి కొవిడ్ వ్యాప్తి చెందినట్లు తేలలేదు. మృతదేహాల్లో కరోనా ఎంతకాలం సజీవంగా ఉంటుందన్నదానిపైనా స్పష్టత లేదు. గతంలో జర్మన్ పరిశోధకులు ఇదే విషయంపై అధ్యయనం చేయగా.. శవపరీక్ష తర్వాత 35 గంటల వరకు వైరస్ శరీరంలో వృద్ధి చెందుతున్నట్లు తేలింది. కానీ తాజా ఫలితాల కారణంగా ఈ అంశంపై మరిన్ని విస్తృత ప్రయోగాలు జరగాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని