Court Ruling: విద్యార్థినిని తాకింది 10 సెకన్లేనంటూ.. నిర్దోషిగా తేల్చి..!

లైంగిక వేధింపుల కేసులో బాధితురాలిని 10 సెకన్లే తాకిన కారణంగా నిందితుడిని నిర్దోషిగా తేల్చిందో కోర్టు. ఈ తీర్పుపై ఆ దేశంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడం విశేషం.

Updated : 15 Jul 2023 14:31 IST

రోమ్‌: విద్యార్థినిపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో ఇటలీ (Italy)లోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు అందర్నీ నివ్వెరపర్చింది. ఈ కేసులో నిందితుడు కేవలం 10 సెకన్ల కంటే తక్కువ సమయమే ఆ విద్యార్థిని తాకాడని (Groping) పేర్కొంటూ అతడిని నిర్దోషిగా తేల్చింది. దీంతో ఈ తీర్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

రోమ్‌కు చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థిని స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుతోంది. ఈ స్కూల్లో కేర్‌టేకర్‌ (CareTaker)గా పనిచేస్తున్న 66 ఏళ్ల ఆంటోనియో అవోలా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని గతేడాది ఏప్రిల్‌లో ఫిర్యాదు చేసింది. ఆ రోజు తాను స్నేహితురాలితో కలిసి స్కూల్లో మెట్లెక్కుతుండగా.. కేర్‌టేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పేర్కొంది. తన వెనుక భాగంపై చేతులతో తడిమి.. తన లోదుస్తులను కిందకు లాగేందుకు అతడు ప్రయత్నించినట్లు తెలిపింది. ఆ తర్వాత తనను పైకెత్తాడని.. తాను భయపడిపోవడంతో జోక్‌ చేశానంటూ కేర్‌టేకర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో పోలీసులు ఆంటోనియోపై కేసు నమోదు చేశారు. దీనిపై స్థానిక కోర్టులో విచారణ జరగ్గా.. ఆ విద్యార్థినిని తాను తాకడం నిజమేనని అతడు అంగీకరించాడు. అయితే తాను సరదాగానే అలా చేశానని కోర్టుకు తెలిపాడు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తాజాగా అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

‘‘కామవాంఛతో తాను ఈ పనిచేయలేదని, కేవలం సరదాగా చేసినట్లు నిందితుడు చెప్పిన వాదనను మేం అంగీకరిస్తున్నాం. అంతేగాక.. బాలికను అతడు కేవలం 5 నుంచి 10 సెకన్ల లోపు మాత్రమే తాకాడు. కాబట్టి దీన్ని నేరంగా పరిగణించడం అనాలోచితమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించిన కోర్టు.. అతడిపై అభియోగాలను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని