Donald Trump: ‘ట్రూత్‌’ను మస్క్‌కు అమ్మాలనుకొన్న ట్రంప్‌..?

ట్రంప్ సోషల్‌ మీడియా వేదికను మస్క్‌కు అమ్మేయాలనుకొన్నారంటూ వాషింగ్టన్‌ పోస్టు పత్రిక కథనం ప్రచురించింది. దీనిపై ఆయన ప్రతినిధి వెటకారంగా స్పందించారు.

Published : 13 Mar 2024 15:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) తన సొంత సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ను ఒక దశలో బిలియనీర్‌ మస్క్‌ (Musk)కు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిని కొనుగోలు చేయాలని ఎక్స్‌ (ట్విటర్‌)యజమాని ఎలాన్‌ మస్క్‌ను కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికా పత్రిక వాషింగ్టన్‌ పోస్టు కథనంలో పేర్కొంది. కానీ, చివరికి ఇదంతా తప్పంటూ ట్రంప్‌ ప్రతినిధి ఆ పత్రికపైనే సెటైర్లు వేశారు. 

వాషింగ్టన్‌ పోస్టు కథనం ప్రకారం గతేడాది వేసవిలో ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య రాజకీయాలు, వ్యాపారాలు సహా చాలా అంశాలు చర్చకు వచ్చాయి. ఆ తర్వాత ట్రంప్‌ తన సలహాదారులతో మాట్లాడుతూ చర్చలు విఫలమైనా సరే.. మస్క్ ట్రూత్‌ను కొనుగోలు చేయాలి అని వ్యాఖ్యానించినట్లు తెలిసిందని కథనంలో పేర్కొంది.  

ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పామ్‌ బీచ్‌ రిసార్ట్‌లో రిపబ్లికన్‌ పార్టీ సభ్యులతో డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈసందర్భంగా వారి మధ్య ట్రూత్‌ డీల్‌, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు ఆ పత్రిక వెల్లడించింది. కానీ, దీనిని మస్క్‌ తోసిపుచ్చారు. తాను ఆ సమావేశానికి వెళ్లలేదని చెప్పారు. మరో వైపు ట్రంప్‌ మాట్లాడుతూ మీటింగ్‌ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘మస్క్‌ నాకు చాలా ఏళ్లుగా మంచి మిత్రుడు. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అతడికి చాలా సాయం చేశాను. విద్యుత్తు కార్లు వంటి అంశాల్లో చిన్న అభిప్రాయభేదాలున్నాయి’’ అని పేర్కొన్నారు. 

మరోవైపు ట్రంప్‌ మీడియా-టెక్నాలజీ గ్రూప్‌ ప్రతినిధి షాన్నన్‌ డెవిన్‌ మాట్లాడుతూ ‘‘వాస్తవంగా మేం విన్న దానిప్రకారం ట్రంప్‌, మస్క్‌ వాషింగ్టన్‌ పోస్టును కొనుగోలు చేయడంపై చర్చించారు. కానీ, దానికి ఎలాంటి విలువ లేదని నిర్ణయించి వదిలేశారు’’ అంటూ వెటకారంగా వ్యాఖ్యానించారు.

హిందూ మహా సముద్రంలో నౌక హైజాక్‌..

2022 నుంచి ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ తీవ్రమైన ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. ఈనేపథ్యంలో ‘డిజిటల్‌ వరల్డ్‌ అక్విజేషన్‌ కార్ప్‌’లో విలీనానికి యత్నిస్తున్నా.. చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇటీవలే అమెరికా ఎస్‌ఈసీ దీని విలీన ఒప్పందానికి ఆమోదముద్ర వేయడం ట్రంప్‌నకు ఊరటనిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని