Elon Musk: MH370 మిస్సింగ్‌లో ఏలియెన్స్‌ ఆధారాలు?.. ఎలాన్‌ మస్క్‌ ఏమన్నారంటే..

Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ స్పందించారు.

Published : 28 Apr 2024 12:30 IST

వాషింగ్టన్‌: గ్రహాంతర జీవుల (Aliens) విషయం ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీనే. గుర్తు తెలియని గుండ్రటి వస్తువులేవో ఆకాశంలో ఎగురుతున్నట్లుగా చెబుతూ కొన్ని వీడియోలు అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాయి. అలా వచ్చిన ప్రతిసారీ దీనిపై చర్చ జరుగుతుంటుంది. 2014లో హఠాత్తుగా కనిపించకుండా పోయిన ఎంహెచ్‌370 విమానానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో వైరలైంది. దాంట్లో ఒక గుండ్రటి వస్తువు విమానం చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు కనిపించింది. అయితే, అది నిజమైన వీడియో కాదని.. ఎడిట్‌ చేశారని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేస్తూ ఓ యూజర్‌ స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అభిప్రాయాన్ని కోరారు.

దీనిపై మస్క్‌ (Elon Musk) స్పందిస్తూ.. ‘‘నేను ఇప్పటి వరకు ఏలియెన్స్‌కు సంబంధించిన ఆధారాలను చూడలేదు. ఒకవేళ నా దృష్టికి వస్తే వెంటనే ఆ వివరాలను ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తాను. స్పేస్‌ఎక్స్‌కు చెందిన దాదాపు 6,000 ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ ఇప్పటి వరకు ఏలియెన్స్‌ను ఎదుర్కొన్న సందర్భాలు లేవు’’ అన్నారు.

2014లో ఎంహెచ్‌370 కౌలాలంపూర్‌ నుంచి బీజింగ్‌కు బయలుదేరింది. 227 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్‌ అయిన 38 నిమిషాల తర్వాత ఆ విమానం కనిపించకుండా పోయింది. తర్వాత ఓ గంట పాటు మిలిటరీ రాడార్లలో దాని ఆనవాళ్లు కనిపించాయి. నిర్దేశిత మార్గంలో కాకుండా మాలే ద్వీపం, అండమాన్‌ సముద్రాన్ని దాటేసి వెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత దాని జాడ ఇప్పటి వరకు కనిపించలేదు. ఆధునిక విమానయాన చరిత్రలో ఇదో పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై అనేక వాదనలు తెరపైకి వచ్చాయి. అందులో ఒకటి ఏలియెన్స్‌ థియరీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు