నాటోలోకి స్వీడన్‌

అత్యంత కీలకమైన నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా అడుగుపెట్టడానికి స్వీడన్‌కు మార్గం సుగమమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తటస్థంగా ఉంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు రష్యా వ్యతిరేక బృందంలో చేరనుంది.

Published : 12 Jul 2023 04:22 IST

32వ సభ్య దేశంగా చేరిక
ఉక్రెయిన్‌ను ఇప్పుడే చేర్చుకోలేమన్న కూటమి
లిథువేనియాలో శిఖరాగ్ర భేటీ

విల్నియస్‌ (లిథువేనియా): అత్యంత కీలకమైన నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా అడుగుపెట్టడానికి స్వీడన్‌కు మార్గం సుగమమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తటస్థంగా ఉంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు రష్యా వ్యతిరేక బృందంలో చేరనుంది. మరోవైపు నాటోలో చేరాలని ఉవ్విళ్లూరుతున్న ఉక్రెయిన్‌కు చుక్కెదురైంది. ఆ దేశాన్ని నాటోలో చేర్చుకుంటాంగానీ ఇప్పట్లో కాదని నాటో తేల్చి చెప్పింది. ‘నాటోలో ఉక్రెయిన్‌ కచ్చితంగా సభ్యురాలు అవుతుందని పునరుద్ఘాటిస్తున్నాం. అందుకోసం కొన్ని విషయాల్లో మినహాయింపులూ ఇస్తాం. ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తాం’ అని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ తెలిపారు. నాటో నిర్ణయంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా మండిపడ్డారు. నాటోలో తమ చేరికకు సమయాన్ని నిర్దేశించకపోవడాన్ని అనుచిత నిర్ణయంగా అభివర్ణించారు.

లిథువేనియాలో జరుగుతున్న నాటో దేశాధినేతల రెండ్రోజుల సమావేశంలో తొలి రోజైన మంగళవారం స్వీడన్‌ చేరికకు ఒప్పందం కుదిరింది. ఇన్నాళ్లూ ఆ దేశ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న టర్కీ, హంగరీలు మనసు మార్చుకోవడంతో అడ్డంకులు తొలగిపోయాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశానంతరం ఆయా దేశాల అధ్యక్షులు స్వీడన్‌కు పచ్చజెండా ఊపారు. ఎఫ్‌-16 విమానాల అందజేత, ఐరోపా సమాజంలో టర్కీకి సభ్యత్వంపై జో బైడెన్‌ నుంచి మద్దతు లభించింది. ఇక ఉక్రెయిన్‌ చేరికకూ అంగీకరించినా అది ఎప్పుడనేది తేల్చలేదు. కేవలం సభ్యత్వం ఇవ్వడం కోసం రోడ్‌మ్యాప్‌ తయారు చేస్తామని నాటో పేర్కొంది. అయితే దానికెలాంటి గడువూ నిర్ణయించకపోవడం గమనార్హం. దీనిపై జెలెన్‌స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాటో నిర్ణయాన్ని అర్థం లేనిదిగా అభివర్ణించారు. ‘మిత్రులకు మేం ఎంతో విలువిస్తాం. అదే సమయంలో ఉక్రెయిన్‌ను వారు గౌరవించాలి. మా సభ్యత్వానికి సంబంధించిగానీ, ఆహ్వానానికిగానీ ఎలాంటి నిర్దిష్ట కాలపరిమితి విధించకపోవడమనేది అసంబద్ధమైంది. అనిశ్చితి అనేది బలహీనత. దీనిపై సదస్సులో బహిరంగంగానే మాట్లాడతా’ అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. బుధవారం నాటో సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. బైడెన్‌ తదితర నాయకులతోనూ సమావేశమవుతారు. ఆయనను బుజ్జగించడానికి నాటో-ఉక్రెయిన్‌ మండలి ఏర్పాటు చేసి, యుద్ధంలో ఉక్రెయిన్‌ అవసరాలను తీర్చడానికి సాయం చేస్తామని ప్రకటించే అవకాశాలున్నాయి.

రక్షణ వ్యూహం పునర్వ్యవస్థీకరణ!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో నాటో రక్షణ వ్యూహాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించాలని మంగళవారం కూటమి దేశాలు నిర్ణయానికి వచ్చాయి. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఎదురైన అతి పెద్ద సవాలును ఎదుర్కోవడంతోపాటు రష్యా తమ ప్రాంతంపై దాడి చేస్తే గట్టిగా స్పందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై బైడెన్‌తో నాటో కూటమి దేశాధినేతలు చర్చించారు. 31 సభ్యదేశాలు ఆర్కిటిక్‌, బాల్టిక్‌ సముద్ర ప్రాంతాలు, ఉత్తర అట్లాంటిక్‌, దక్షిణ అట్లాంటిక్‌, మధ్యధరా, నల్ల సముద్ర ప్రాంతాల్లో ఎక్కడి నుంచైనా ప్రతీకార చర్యకు దిగేలా సిద్ధంగా ఉండాలని వారు తీర్మానించుకున్నారు. ‘యూరో అట్లాంటిక్‌ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగింది. రష్యా, తీవ్రవాదం నుంచి ముప్పు పొంచి ఉంది. అందుకే కలిసికట్టుగా సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ఏ క్షణంలోనైనా ఎటువంటి ముప్పునైనా తిప్పికొట్టేలా సిద్ధంగా ఉండాలని నిర్ణయించాం’ అని నాటో సంయుక్త ప్రకటన వెల్లడించింది.


మూల్యం చెల్లించుకుంటారు: రష్యా

స్వీడన్‌ను నాటోలో చేర్చుకోవడంపై రష్యా హెచ్చరిక జారీ చేసింది. ‘నాటో విస్తరణవాదమే ప్రస్తుత ఘర్షణకు దారి తీసింది. అయినా తమ తప్పులను ఐరోపా దేశాలు గుర్తించడం లేదు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐరోపా భద్రతకే అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని