కెనడా అడుగు ఎటో!

భారత్‌, కెనడాల మధ్య వివాదాస్పదంగా మారిన ఖలిస్థాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసు ఎటు దారితీస్తుంది? నిజ్జర్‌ హత్యలో భారత ప్రభుత్వ హస్తముందని ఆరోపిస్తున్న కెనడా తద్వారా ఏం సాధించగలుగుతుంది? ఈ కేసును ఎంతదాకా లాగగలదు? చట్టప్రకారం కెనడా ఏం చేయగలుగుతుంది?.. ఇవన్నీ ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్నలు.

Updated : 24 Sep 2023 05:28 IST

నిజ్జర్‌ హత్య కేసులో పలు సందేహాలు
భీష్మిస్తుందా.. పట్టు సడలిస్తుందా..

భారత్‌, కెనడాల మధ్య వివాదాస్పదంగా మారిన ఖలిస్థాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసు ఎటు దారితీస్తుంది? నిజ్జర్‌ హత్యలో భారత ప్రభుత్వ హస్తముందని ఆరోపిస్తున్న కెనడా తద్వారా ఏం సాధించగలుగుతుంది? ఈ కేసును ఎంతదాకా లాగగలదు? చట్టప్రకారం కెనడా ఏం చేయగలుగుతుంది?.. ఇవన్నీ ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్నలు. ‘మా పౌరుడైన హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ను మా దేశంలోనే ఇతరులు వచ్చి కాల్చి చంపటం అంటే మా సార్వభౌమత్వాన్ని ధిక్కరించినట్లే’ అన్నది కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణ! ఈ హత్యలో భారత ప్రభుత్వ పాత్ర ఉందని ఆయన చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవి. అంతర్జాతీయ చట్టాన్ని భారత్‌ ఉల్లంఘించిందనేది ట్రూడో పరోక్షంగా చెబుతున్న మాట. అంతా అనుసరిస్తూ వస్తున్న అంతర్జాతీయ చట్టం ప్రకారం ఏ దేశం కూడా మరో దేశంలోకి వారి అనుమతి లేకుండా ఏజెంట్లను పంపించకూడదు. అన్ని దేశాలూ ఇతర దేశాల రాజకీయ స్వేచ్ఛను, భౌగోళిక సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకోవాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. నిజ్జర్‌ కేసులో తమ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేయడమే కాకుండా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్‌ ఉల్లంఘించినట్లు కెనడా చూపించే అవకాశం ఉంది. కానీ ఇలాంటి సందర్భాల్లో ఆత్మరక్షణ అనేది- ఆరోపణలకు గురైన దేశాలు చెబుతున్న కారణం!

ఆ రెండు సందర్భాల్లో...

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో... ఇరాక్‌లో ఇరాన్‌ మిలిటరీ జనరల్‌ ఖాసిం సులేమాని డ్రోన్‌ దాడిలో చనిపోయారు. అలాగే బరాక్‌ ఒబామా హయాంలో పాకిస్థాన్‌లో ఒసామాబిన్‌ లాడెన్‌ను అమెరికా ప్రత్యేక ఆపరేషన్లో మట్టుపెట్టింది. ఈ రెండు సందర్భాల్లోనూ చెప్పిన కారణం- ఆత్మరక్షణే! పైగా లాడెన్‌ను చంపిన ఘటనలో కెనడా పాత్రధారి! ఆ సంఘటనను కెనడా అధినేతలు ప్రత్యక్షంగా తిలకించారు. వాటికి అమెరికాను ఎవరూ నిలదీయలేదు. కేసు వేయలేదు. నిజ్జర్‌ విషయంలో భారత్‌ అలాంటి ఆత్మరక్షణ వాదన కూడా చేయటం లేదు. ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. నిజ్జర్‌ ఖలిస్థాన్‌ ఉగ్రవాది అనే సంగతిని చెబుతూనే... నేర గ్యాంగులు, కాల్పులు కెనడాలో పెరిగిపోయాయని, క్షీణించిన శాంతిభద్రతల కారణంగానే నిజ్జర్‌ చనిపోయాడని భారత్‌ ప్రత్యారోపించింది. భారత్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు బహిరంగ పర్చటానికి కెనడా వెనకంజ వేస్తుండటం గమనార్హం. కెనడాలోని దౌత్యవేత్తల మధ్య సమాచారం ఆధారంగా నిఘా వర్గాలు ఒక నిర్దారణకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా కెనడా నిఘా సంస్థలు కాకుండా దాని మిత్రదేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బ్రిటన్‌ దేశాల నిఘా వర్గాలు గుర్తించినట్లు సమాచారం. అదే నిజమైతే భారత దౌత్యవేత్తలపై నిఘా పెట్టినట్లు, వారి ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు అవుతుంది. అది మరో వివాదానికి దారితీసే అవకాశం ఉంది.


మూడు మార్గాలు

ఈ కేసులో కెనడా ముందు మూడు మార్గాలున్నాయన్నది నిపుణుల మాట! 1) భారత పాత్రపై మరింత బలమైన సాక్ష్యం లభిస్తే ఐక్యరాజ్యసమితి న్యాయవిభాగమైన అంతర్జాతీయ న్యాయస్థానం తలుపుతట్టడం మొదటి మార్గం. అదంత సులభం కాదు. ఎందుకంటే కామన్వెల్త్‌ దేశాల మధ్య వివాదాలపై అంతర్జాతీయ కోర్టుకు వెళ్లకూడదనే ఓ ఒప్పందం ఉంది. దీనిపై భారత్‌, కెనడా సంతకాలు చేశాయి. భారత్‌ అంగీకరిస్తేనే కెనడా ముందడుగు వేయగలుగుతుంది. దానికి అవకాశం తక్కువ. 2) ఐరాస మానవ హక్కుల కమిటీ ముందుకు వెళ్లటం కెనడా ముందున్న రెండో మార్గం. అది న్యాయపరమైన కేసుగా నిలవదు. కమిటీ ఇచ్చే తీర్పు- న్యాయస్థానం తీర్పులాంటి చట్టబద్ధమైనదేమీ కాదు. 3) భారత్‌తో ద్వైపాక్షికంగా చర్చించుకోవటం మూడో మార్గం. సరైన సాక్ష్యాలను చూపించి, భారత్‌తో చర్చించి, ఇక ముందు ఇలాంటివి జరగకుండా హామీ తీసుకోవటం.. మరేదైనా దౌత్యపరమైన ప్రయోజనాలు పొందటం కెనడా ముందున్న మంచి అవకాశమని ఆ దేశానికే చెందిన అంతర్జాతీయ క్రిమినల్‌ న్యాయవాది అమందా గహ్రేమని అభిప్రాయపడటం గమనార్హం. ‘‘బహుశా భవిష్యత్తులో మరే దేశం ముందూ చులకన కాకుండా ఉండటానికైనా కెనడా దీన్ని అంతర్జాతీయంగా వివాదం చేయాలనుకొంటూ ఉండొచ్చు. పట్టుదలతో దీనిపై ముందుకు వెళుతుందా ఇక్కడితో వదిలేస్తుందా అనేది కొద్దిరోజుల్లో తేలిపోతుంది. వారి స్పందనలు తగ్గితే వివాదం సద్దుమణిగినట్లే! భారత్‌తో చర్చల ద్వారా సర్దుకోవటానికి కెనడా సిద్ధమవుతున్నట్లే! అలాకాకుండా పదేపదే సాక్ష్యాల గురించి మాట్లాడితే దీన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నట్లే!’’ అని యూకేలో అంతర్జాతీయ న్యాయశాస్త్ర ఆచార్యుడు మార్కో మిలనోవిక్‌ వ్యాఖ్యానించారు.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని