భారత్‌ నుంచి 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించాం

భారత్‌లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వారి కుటుంబ సభ్యుల(42)తో సహా వెనక్కు రప్పించుకున్నట్టు కెనడా అధికారికంగా వెల్లడించింది.

Published : 21 Oct 2023 04:28 IST

కెనడా అధికారిక ప్రకటన
భారత వైఖరి లక్షల మంది జీవితాల్ని దుర్భరం చేస్తుంది: ట్రూడో

ఒట్టావా, దిల్లీ : భారత్‌లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వారి కుటుంబ సభ్యుల(42)తో సహా వెనక్కు రప్పించుకున్నట్టు కెనడా అధికారికంగా వెల్లడించింది. 62 మంది దౌత్య సిబ్బందిలో 41 మందిని తగ్గించుకోకపోతే వారికి అందించే దౌత్యపరమైన రక్షణను ఉపసంహరిస్తామంటూ భారత్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిబ్బంది కుదింపు చర్య చేపట్టినట్లు కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి మెలానీ జోలీ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు మాత్రమే దిల్లీలోని కెనడా హైకమిషన్‌తోపాటు పలు కాన్సులేట్లలో ఉన్నారు. ‘‘41 మంది దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణను ఉపసంహరించుకోవడమేనది అనూహ్యమైన చర్య. అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. అయితే కెనడా అదే తరహాలో స్పందించాలనుకోవడం లేదు. పరిస్థితులు మరింత దిగజారకుండా చూడాలనుకుంటోంది. అన్నిదేశాలకు వర్తించే అంతర్జాతీయ చట్టాలను కెనడా సమర్థిస్తూనే ఉంటుంది. అలాగే భారత్‌తో సంప్రదింపులు కొనసాగిస్తాం’ అని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. కెనడా దౌత్యవేత్తలపై భారత్‌ అనుసరించిన వైఖరి రెండు దేశాల్లోని లక్షల మంది జీవితాలను దుర్భరం చేస్తుందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో శుక్రవారం వ్యాఖ్యానించారు. దౌత్యం ప్రాథమిక సూత్రానికి భిన్నంగా వారు (భారత్‌) వ్యవహరించారని బ్రాంప్టన్‌లో విలేకరులతో పేర్కొన్నారు.

‘భారత్‌లో ఆ నగరాల్లో జాగ్రత్త..’

భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసి కెనడా మరోసారి కవ్వింపులకు పాల్పడింది. ‘‘ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. భారత్‌లో మీడియా, సామాజిక మాద్యమాల్లో కెనడాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కెనడా-వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు జరిగే అవకాశాలున్నాయి. కెనడియన్లపై బెదిరింపులు, వేధింపులు జరగొచ్చు. అందువల్ల దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో కొత్త వ్యక్తులతో మీరు (కెనడియన్లు) జాగ్రత్తగా ఉండండి. వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. బెంగళూరు, చండీగఢ్‌, ముంబయిల్లోనూ అప్రమత్తంగా ఉండండి’’ అని కెనడా తన అడ్వైజరీలో పేర్కొంది.

కెనడాకు దీటుగా బదులిచ్చిన భారత్‌

భారత అల్టిమేటం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కెనడా అక్కసు వెళ్లగక్కడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీటుగా బదులిచ్చింది. ‘‘భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలని మేం కోరుకుంటున్నాం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 11.1 నిబంధనలకు అనుగుణంగానే.. దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు మేం చర్యలు తీసుకున్నాం’’ అని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.


17,000 వీసా దరఖాస్తులపై ప్రభావం..?

తన దౌత్య సిబ్బందిని తగ్గించుకున్న నేపథ్యంలో బెంగళూరు, ముంబయి, చండీగఢ్‌ నగరాల్లోని కాన్సులేట్‌లలో అన్ని రకాల వ్యక్తిగత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా వెల్లడించింది. ఈ పరిణామం ప్రభావం దాదాపు 17 వేలకు పైగా వీసా దరఖాస్తులపై ఉంటుందని అంచనా. ఎవరికైనా కాన్సులర్‌ సహాయం కావాలంటే దిల్లీలోని కెనడా రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని