అలుపెరుగని పోరాటగళం

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీది ఆది నుంచీ ధిక్కార స్వరమే! ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. పుతిన్‌ సర్కారు పాలనా విధానాల్లో లోపాలను తీవ్రంగా ఎండగట్టారు.

Updated : 17 Feb 2024 06:53 IST

పుతిన్‌పై ధిక్కారస్వరానికి మారుపేరు నావల్నీ

ష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీది ఆది నుంచీ ధిక్కార స్వరమే! ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. పుతిన్‌ సర్కారు పాలనా విధానాల్లో లోపాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఎదురైనా లెక్కచేయలేదు. జైల్లో ఉన్న నావల్నీ శుక్రవారం మృతిచెందడంతో రష్యాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అవినీతిపై గళమెత్తి..

రష్యా రాజధాని మాస్కోకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని బ్యూటిన్‌లో నావల్నీ 1976 జనవరి 4న జన్మించారు. న్యాయశాస్త్రం అభ్యసించిన ఆయన.. మొదటినుంచీ ప్రభుత్వ అవినీతిపై గట్టిగా పోరాడారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల మధ్య సంబంధాలను ఎండగట్టారు. ప్రజాస్వామ్య విలువలు, మానవహక్కుల కోసం గళమెత్తుతూ గుర్తింపు పొందారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఓ కేసులో 2013లో ఆయనకు అయిదేళ్ల జైలుశిక్ష ఖరారైంది. తర్వాత ఆ శిక్షను కోర్టు నిలిపివేసింది. అప్పట్లో మాస్కో మేయర్‌ ఎన్నికల్లో పుతిన్‌ మద్దతున్న సిట్టింగ్‌ మేయర్‌కు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలవడంతో నావల్నీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పుతిన్‌ పాలనలో రాజకీయ విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించేవారు. నాయకులు/అధికారుల అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు జరిపి అనేక కీలక వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ టీవీ ఛానళ్లలో నావల్నీకి ఏమాత్రం ప్రచారం లభించేది కాదు. అయితే యూట్యూబ్‌ వీడియోలు, సామాజిక మాధ్యమ ఖాతాలతో ఆయన జనానికి బాగా దగ్గరయ్యారు.

విషప్రయోగంతో కలకలం

నావల్నీ ముఖంపైకి 2017లో ఓ దుండగుడు ఆకుపచ్చ రంగు రసాయనాన్ని విసిరాడు. ఫలితంగా ఒక కన్నుకు తీవ్ర గాయమైంది. ఓ నిరసనలో పాల్గొన్నందుకు అరెస్టయి 2019లో జైలులో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. విషప్రయోగం వల్ల అలా జరిగినట్లు వైద్యులు తర్వాత తేల్చారు. 2020 ఆగస్టు 20న సెర్బియా నుంచి మాస్కోకు విమానంలో వస్తుండగా నావల్నీ తీవ్ర అనారోగ్యానికి గురై పడిపోయారు. అత్యవసర చికిత్స అనంతరం ఆయన్ను జర్మనీకి తరలించారు. నావల్నీపై ‘నొవిచోక్‌’ అనే విషప్రయోగం జరిగినట్లు నాడు నిర్ధారణ అయింది. ఆ విష ప్రభావంతో ఆయన దాదాపు రెండు వారాలు కోమాలో ఉన్నారు. తర్వాత చాలా వారాలకుగానీ సరిగా మాట్లాడలేకపోయారు. నావల్నీపై పుతిన్‌ విషప్రయోగం జరిపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని రష్యా అధ్యక్ష కార్యాలయం ఖండించింది.

విమానం దిగగానే అరెస్టు

నిధుల దుర్వినియోగం కేసులో శిక్ష నిలిపివేత షరతులను నావల్నీ ఉల్లంఘించారని ఆయన జర్మనీలో ఉండగా రష్యా అధికారులు తెలిపారు. స్వదేశానికి వస్తే ఆయన్ను అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. అయితే వారి హెచ్చరికలు ఆయనపై ప్రభావం చూపలేదు. అరెస్టవుతానని తెలిసీ నావల్నీ తన భార్యతో కలిసి 2021 జనవరి 17న మాస్కో చేరుకున్నారు. విమానం దిగగానే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. రెండు వారాల విచారణ అనంతరం ఆయనకు రెండున్నరేళ్ల జైలుశిక్ష ఖరారైంది. అయితే ఆయన అరెస్టుతో పెద్దఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. నావల్నీ స్థాపించిన ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఫైటింగ్‌ కరప్షన్‌’ను మాస్కోలోని ఓ కోర్టు నిషేధిత సంస్థగా ప్రకటించింది.

ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకి

జాతీయవాదిగా నావల్నీకి పేరుంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రష్యా దాడిని తప్పుబడుతూ జైలు నుంచే తన సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు పెట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలై నెల రోజులు కూడా కాకముందే నిధుల దుర్వినియోగం, కోర్టు ధిక్కరణ అభియోగాలపై నావల్నీకి మరో తొమ్మిదేళ్ల కారాగార శిక్ష ఖరారైంది. తీవ్రవాదం సంబంధిత అభియోగాలపై ఆయనకు నిరుడు ఆగస్టులో 19 ఏళ్ల జైలుశిక్ష పడింది. ‘‘నా ప్రాణం ఉన్నంతవరకు లేదా ఈ (పుతిన్‌) ప్రభుత్వం ఉన్నంత కాలం నేను జైల్లోనే ఉంటానన్న సంగతి నాకు తెలుసు’’ అని నాటి తీర్పు సమయంలో నావల్నీ వ్యాఖ్యానించారు. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని కెనడాకు చెందిన దర్శకుడు డేనియల్‌ రోహెర్‌ ‘నావల్నీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. గతేడాది ఈ చిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌గా ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం లభించింది. నావల్నీకి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

పుతిన్‌కు తీవ్ర కోపం

రష్యా అధ్యక్ష కార్యాలయ విధానాలను వ్యతిరేకిస్తూ నావల్నీ అనేక నిరసనలు చేపట్టారు. అందుకుగాను పలుమార్లు అరెస్టయ్యారు. గత అధ్యక్ష ఎన్నికల్లో నావల్నీ పోటీ చేశారు. పుతిన్‌కు ఆయనంటే తీవ్ర కోపం. నావల్నీ పేరును పలికేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే.. ‘ఆ వ్యక్తి’ అని మాత్రమే సంబోధించేవారు. నావల్నీకి మరింత ఎక్కువ పేరు రావొద్దనే ఆయన పేరును పుతిన్‌ పలికేవారు కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని