సాధారణ దుస్తుల్లోనైనా భారత సైనికులు మాల్దీవుల్లో ఉండకూడదు: ముయిజ్జు

భారత సైనిక బలగాలు మే 10 తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ భూభాగంలో ఉండకూడదని, సైనిక దుస్తుల్లో కాకుండా సాధారణ దుస్తుల్లో ఉండేందుకు కూడా అంగీకరించేది లేదని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు స్పష్టంచేశారు.

Updated : 06 Mar 2024 06:11 IST

మాలె: భారత సైనిక బలగాలు మే 10 తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ భూభాగంలో ఉండకూడదని, సైనిక దుస్తుల్లో కాకుండా సాధారణ దుస్తుల్లో ఉండేందుకు కూడా అంగీకరించేది లేదని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు స్పష్టంచేశారు. చైనాకు దగ్గరవుతున్న ఆయన మరోసారి భారత్‌పై వ్యతిరేక గళం వినిపించారు. సైనిక సహకారంపై మాల్దీవులు-చైనా మధ్య కీలక ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మాల్దీవుల్లోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న భారత బలగాలు మార్చి 10లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10నాటికి వెనక్కి వెళ్లిపోవాలని ముయిజ్జు సూచించారు. సైనికుల బదులు సాంకేతిక సిబ్బందిని భారత్‌ ఇటీవలే పంపించింది. వారంతా వాస్తవానికి సైనిక అధికారులేనని, పౌర దుస్తుల్లో వారిని పంపిస్తున్నారని మాల్దీవుల విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీనిపై అధ్యక్షుడు స్పందిస్తూ భారత బలగాలను ఏ రూపంలోనూ మాల్దీవుల్లో కొనసాగనిచ్చేది లేదని ప్రకటించారు. చైనా అనుకూల నేతగా పేరున్న ముయిజ్జు.. ఊహించినట్లుగానే డ్రాగన్‌కు దగ్గరవుతున్నారు. ఈ రెండు దేశాల మధ్య సైనిక సహకారంపై ఒప్పందం కుదిరింది. మాల్దీవులకు ఉచితంగా సైనిక పరికరాలను అందించేందుకు చైనా ముందుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని